ఆ అమ్మాయితో సంబంధముందా.. తెలిసేదెలా?

మా వారు వ్యాపారం చేస్తారు. పని మీద నెలలో సగం రోజులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ మధ్య నన్ను, పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు. మాతో ఎక్కడికీ రావడం లేదు. అదేమంటే తీరిక లేదంటున్నారు.

Published : 04 Nov 2023 15:54 IST

మా వారు వ్యాపారం చేస్తారు. పని మీద నెలలో సగం రోజులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ మధ్య నన్ను, పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు. మాతో ఎక్కడికీ రావడం లేదు. అదేమంటే తీరిక లేదంటున్నారు. ఒక రోజు ఫోన్‌ చేసినప్పుడు వేరే అమ్మాయి పేరుతో పిలుస్తూ చెప్పు అన్నారు. ఇంట్లో కూడా ఒకసారి అదే పేరుతో నన్ను పిలిచి తడబడ్డారు. ఆ అమ్మాయి ఎవరని అడిగితే ‘ఎవరూ లేరు’ అని అంటున్నారు. ఆయన మీద అనుమానంతో మనశ్శాంతి లేకుండా పోతోంది. ఈ విషయం గురించి ఆయన సహోద్యోగులను అడగడం మంచిదేనా?ఆయన్నుండి నిజం ఎలా తెలుసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు రెండు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకటి మీ భర్త మిమ్మల్ని, పిల్లలను పట్టించుకోకపోవడం. రెండు మీ భర్తకు మరొక స్త్రీతో సంబంధం ఉందేమోనన్న అనుమానం. మీ భర్తకు మరొక స్త్రీతో సంబంధం ఉన్న విషయం గురించి ఆయన ఆఫీసులో లేదా ఇతర మార్గాల ద్వారా అన్వేషించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఒక వ్యక్తి ఒక విషయం కావాలని దాచాలనుకున్నప్పుడు దాన్ని కనిపెట్టడం కొద్దిగా కష్టమైన పనే. ఈ విషయం గురించి నేరుగా అడిగినా ఆయన చెప్పడం లేదని అంటున్నారు. కాబట్టి పెద్దవాళ్ల సమక్షంలో అడిగే ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్పుడు కూడా చెప్పకపోతే.. మిమ్మల్ని, పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం గురించి చర్చించండి. అప్పుడు అసలు సమస్య తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లు ఎవరూ లేరు, వాళ్ల వల్ల కూడా ఉపయోగం లేదని భావిస్తే ఫ్యామిలీ కౌన్సెలర్‌ని సంప్రదించండి. మీకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ప్రయత్నంలో ఎక్కడా ఆయన్ని అనవసరంగా అనుమానిస్తున్నట్లుగా ప్రవర్తించకండి. అలాగే సాధ్యమైనంతవరకు ఆయన ప్రైవసీకి భంగం కలగకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే- సరైన ఆధారాలు లేని పరిస్థితులలో ఒకవేళ మీ అనుమానం నిజం కాకపోతే భవిష్యత్తులో లేనిపోని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు, పిల్లలు ఎంతగా బాధపడుతున్నదీ అర్ధమయ్యేలా వివరించండి. ఈ పరిస్థితికి అసలు కారణమేమిటో చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందనే విషయం ఆయనకు తెలియజేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ అప్పటికీ నోరు విప్పకపోతే, ఎవరిముందూ మాట్లాడడానికి ఇష్టపడకపోతే - 'ఎంత అడిగినా మీరు ఏం మాట్లాడడం లేదు.. పెద్దవారి దగ్గరికి లేదంటే కౌన్సెలర్ దగ్గరకు కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మీ ఆఫీసులో ఎంక్వైరీ చేయడం తప్ప వేరే దారి కనిపించడం లేదు..' అని చెప్పి చూడండి. వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి అప్పుడైనా కొంతవరకు ఆయన బయటపడే అవకాశం ఉండచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్