కేన్స్‌ వేదికపై... నాన్సీ ప్రతిభ!

పేరున్న తారలు, ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు వేసుకొని రెడ్‌కార్పెట్‌పై నడవడం... కేన్స్‌లో కనిపించే సన్నివేశమే ఇది. అలాంటి ప్రతిష్ఠాత్మక వేదిక మీదకి ఓ పేదింటి అమ్మాయి వెళ్లడం మాట అటుంచితే... డిజైనర్‌గా మెరవడం ఊహించగలమా? నాన్సీ త్యాగి దాన్ని నిజం చేసి చూపించింది. అందుకే ఈమెవరా అని సామాన్యులూ, తారలతోపాటు విదేశీయులూ వెదికేస్తున్నారు. ఇంతకీ ఎవరీ అమ్మాయి?

Updated : 29 May 2024 07:56 IST

పేరున్న తారలు, ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు వేసుకొని రెడ్‌కార్పెట్‌పై నడవడం... కేన్స్‌లో కనిపించే సన్నివేశమే ఇది. అలాంటి ప్రతిష్ఠాత్మక వేదిక మీదకి ఓ పేదింటి అమ్మాయి వెళ్లడం మాట అటుంచితే... డిజైనర్‌గా మెరవడం ఊహించగలమా? నాన్సీ త్యాగి దాన్ని నిజం చేసి చూపించింది. అందుకే ఈమెవరా అని సామాన్యులూ, తారలతోపాటు విదేశీయులూ వెదికేస్తున్నారు. ఇంతకీ ఎవరీ అమ్మాయి?

రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆతృతగా ఫోన్‌ చెక్‌ చేసుకుంటోంది నాన్సీ. ఒక్క ఫాలోయర్‌ అయినా పెరిగారేమో చూద్దామని ఆశ. ఆ సంఖ్య పెరగలేదు కానీ... తిడుతూ మెసేజులొచ్చాయి. ‘నీ మొహమెప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అచ్చం అస్థిపంజరంలా ఉన్నా’వంటూ కామెంట్లు. మొదట్లో ఎలాగోలా సర్దిచెప్పుకొన్నా... రోజురోజుకీ విమర్శలు మరింత పెరుగుతోంటే తట్టుకోలేక ఏడ్చేసింది. 20 ఏళ్లమ్మాయి... తన ఆసక్తిని నిరూపించుకోవాలనుకుంది. తీరా అవమానాలు ఎదురయ్యేసరికి దాని జోలికే వెళ్లొద్దు అనుకుంది. కొన్నిరోజులు అలా చేసింది కూడా. అలాగని ఆగిపోతే తన గురించి మనమూ చెప్పుకోవాల్సిన అవసరముండేది కాదు... కానీ ఆ బక్కపలుచని అమ్మాయి తన గుండెలో కొండంత ధైర్యాన్ని నింపుకొని పోరాడింది. కాబట్టే... కేన్స్‌ వరకూ వెళ్లింది.

లాక్‌డౌన్‌ దారి మార్చింది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బర్నావా నాన్సీది. ఊళ్లో బతకడం కష్టమై వాళ్ల కుటుంబం దిల్లీకి చేరింది. తల్లి ఫ్యాక్టరీలో పనిచేస్తే, తండ్రి టీవీ మెకానిక్‌. సివిల్స్‌కి సన్నద్ధమవుతున్న సమయంలో లాక్‌డౌన్‌. తినడానికే కష్టమైంది. శిక్షణ కోసం దాచుకున్న డబ్బుతో ధైర్యం చేసి, కెమెరా కొంది నాన్సీ. నిజానికి ఆమెకది చాలా పెద్ద అడుగే. విఫలమైతే అమ్మ కష్టమంతా వృథా చేసినట్లే. అయినా ప్రయత్నిద్దామనుకుంటే వ్యతిరేకత ఎదురైంది. బంధువులే కాదు... తండ్రి కూడా ‘అమ్మాయివి... ఇవన్నీ చేసి, పరువు తీయొద్దు’ అనేవారు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. మార్కెట్లన్నీ తిరిగి తక్కువ ఖర్చుతో వస్త్రం కొని, దుస్తులు కుట్టి, ఆ వీడియోలను పోస్ట్‌ చేసేది. ఆలియాభట్, జాన్వీ కపూర్‌ వంటి సెలెబ్రిటీల డిజైనర్‌వేర్‌ని తక్కువ ఖర్చులో చేసి చూపించేది. ఇక్కడా తనే మోడల్‌. వదులైన, చినిగిన దుస్తులే కాదు... పాత వాటిని అందంగా తిరిగి తీర్చిదిద్దడం వంటివెన్నో సలహాలిచ్చేది. ఆ వీడియోలు కాస్తా వైరల్‌ అయ్యాయి. అలా నెమ్మదిగా అనుసరించేవారు పెరిగారు. ‘డిస్రప్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘ఫేవరెట్‌ ఫ్యాషన్‌ హెరిటేజ్‌ ఐకాన్‌’ వంటి అవార్డులూ అందుకుంది.

భయపడిందట...

యూట్యూబ్, ఇన్‌స్టాల్లో లక్షలకొద్దీ ఫాలోయర్లు పెరగడం చూసి, నాన్సీ చాలా ఆనందించిందట. కానీ కేన్స్‌ నుంచి ఆహ్వానం అందినప్పుడు మాత్రం భయపడింది. కేన్స్‌ అంటే మాటలా? పెద్ద పెద్ద తారలు వస్తారు. వాళ్లతో పోటాపోటీగా నిలవడమంటే మాటలు కాదు కదా! ఇంకా ‘ఏం వేసుకోవాలి?’ అనే సందేహం! అప్పటివరకూ తను చేసినవన్నీ అనుకరణవే. అలాగని వేరేవాళ్ల సాయం తీసుకునే స్థోమత లేదు. చివరికి తనే డిజైనింగ్‌ మొదలుపెట్టింది. క్లాత్‌ బజార్‌కి వెళ్లి 1000 మీటర్ల వస్త్రాన్ని కొనుక్కొచ్చింది. తొలి గౌను చేయడానికి ఏకంగా 30రోజులు పట్టింది. దాని బరువు 20 కేజీలు. తరవాతి నెలలో మిగతా మూడూ పూర్తిచేసింది. 20 కేజీల గులాబీ గౌను... భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దిన మోడరన్‌ శారీ, సస్టెయినబుల్‌ ప్యాంట్‌సూట్‌... ప్రతిదీ చూపరుల ప్రశంసలు అందుకుంది. తొలిసారి రెడ్‌ కార్పెట్‌ మీద నడక అన్న భయం, ఇంగ్లిష్‌ రాదన్న బెరుకూ ఏమాత్రం లేకుండా తన డిజైన్లను ప్రదర్శించింది నాన్సీ. అడిగిన ప్రశ్నలకు హిందీలోనే సమాధానం చెప్పింది. ఆమె ప్రతిభకే కాదు... ధైర్యానికీ ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్‌నటి సోనమ్‌ కపూర్‌ ఆమె డిజైన్లను మెచ్చుకోవడమే కాదు తనకో డ్రెస్‌ చేసిమ్మని కోరింది. డిజైనర్‌ మసాబా గుప్తా, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి ఎందరో ఆమె సాయం కోరుతున్నవారే. అందుకే ఈమె ఎవరా అని వెదుకుతున్న వారూ పెరిగారు. అన్నట్టూ ఆమె సోషల్‌ మీడియాకీ అభిమానులు పోటెత్తారు. ఇన్‌స్టాలో 21లక్షలు, యూట్యూబ్‌ని దాదాపు 15 లక్షలమంది అనుసరిస్తున్నారు. 

‘ఇప్పటికీ ఇదంతా కలలాగే ఉంది. మా తమ్ముడు, అమ్మ అండగా లేకపోతే నేనిక్కడి వరకూ వచ్చేదాన్ని కాదు. ఒకప్పుడు అస్థిపంజరం అన్నవారే ఇప్పుడు దేశానికి గర్వకారణం అంటున్నారు. అది మాత్రం మర్చిపోలేను. ఇక నుంచి సొంత డిజైన్లతో సంస్థను ఏర్పాటు చేయాలన్నది నా ముందున్న లక్ష్యం’ అంటోంది 23ఏళ్ల నాన్సీ. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి?


పాలడబ్బా... వేల ఏళ్ల క్రితమే 

పిల్లలకి పాలడబ్బా ఉపయోగించొచ్చా లేదా అన్నది పక్కన పెడితే...  ఏడు వేల ఏళ్ల క్రితమే మహిళలు పాలడబ్బాను వినియోగించినట్లు కనిపెట్టారు. బంకమట్టితో చేసిన ఆ డబ్బాలో పాల అవశేషాలను గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్