Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!

ఇతర జుట్టుతత్వాల మాటెలా ఉన్నా.. కర్లీ హెయిర్‌ను సంరక్షించుకోవడం మాత్రం కత్తి మీద సామే అని చెప్పాలి. పదే పదే పొడిబారిపోవడం, గడ్డిలాగా మారడం, చిక్కులు కట్టడం.. ఒక్కోసారి ఈ కర్లీ హెయిర్‌ కంటే సిల్కీ హెయిర్‌ ఉంటే బాగుండేది అనిపిస్తుంటుంది. తనకున్న కర్లీ హెయిర్‌తో టీనేజ్‌లో ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొంది అన్షిత మెహ్రోత్రా.

Published : 15 Apr 2024 12:32 IST

(Photos: LinkedIn)

ఇతర జుట్టుతత్వాల మాటెలా ఉన్నా.. కర్లీ హెయిర్‌ను సంరక్షించుకోవడం మాత్రం కత్తి మీద సామే అని చెప్పాలి. పదే పదే పొడిబారిపోవడం, గడ్డిలాగా మారడం, చిక్కులు కట్టడం.. ఒక్కోసారి ఈ కర్లీ హెయిర్‌ కంటే సిల్కీ హెయిర్‌ ఉంటే బాగుండేది అనిపిస్తుంటుంది. తనకున్న కర్లీ హెయిర్‌తో టీనేజ్‌లో ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొంది అన్షిత మెహ్రోత్రా. వీటి నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్లో ఉన్న హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని ప్రయత్నించింది. అయితే వాటిలోని రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీయడం గమనించిందామె. ఈ అనుభవాలే ఆమెను వ్యాపారవేత్తగా మార్చాయి. సహజసిద్ధమైన కర్లీ హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ని నెలకొల్పేలా చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచంలోని దాదాపు పది దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన అన్షిత వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం..!

గురుగ్రామ్‌కు చెందిన అన్షిత కెనడాలో జర్నలిజంలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమెది కర్లీ హెయిర్‌. తన జుట్టు సంరక్షణ విషయంలో చిన్న వయసు నుంచే పలు సమస్యల్ని ఎదుర్కొందామె. పదే పదే పొడిబారిపోవడం, చిక్కులు కట్టడం, దువ్విన కాసేపటికే తిరిగి గడ్డిలాగా మారడం.. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయిన ఆమె.. ఒకానొక దశలో ‘నాకు కర్లీ హెయిర్‌ కంటే సిల్కీ హెయిర్‌ ఉన్నా బాగుండేది!’ అనుకుంది.

ఏదీ వర్కవుట్‌ కాలేదు!

తన జుట్టును సంరక్షించుకునే క్రమంలో మార్కెట్లో దొరికే కర్లీ హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని ప్రయత్నించింది అన్షిత. అయితే వీటిలో ఉన్న హానికారక రసాయనాలు ఆమె జుట్టు ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీశాయి.

‘నా కర్లీ హెయిర్‌ను సంరక్షించుకోవడానికి కెరాటిన్‌ ట్రీట్‌మెంట్‌, బ్లోడ్రైస్‌, స్మూతెనింగ్‌.. తదితర సౌందర్య చికిత్సల్ని ప్రయత్నించా. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. వీటికి తోడు పలు హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్నీ వాడాను. వీటిలో ఉన్న రసాయనాల వల్ల సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగాయి. అంతేకాదు.. వీటి ధర కూడా ఎక్కువే అన్న విషయం నాకు అర్థమైంది. అధిక ధర కారణంగా ఇలాంటి ఉత్పత్తులు సామాన్యులు అస్సలు కొనలేరనిపించింది. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే నా మనసులో ఓ ఆలోచన మెదిలింది. నాలాగే కర్లీ హెయిర్‌ ఉన్న ఎంతోమంది ఏదో ఒక సమయంలో పలు సమస్యల్ని ఎదుర్కొనే ఉంటారు. అలాంటి వారి కోసం రసాయనాలేవీ ఉపయోగించకుండా, సహజసిద్ధంగా.. అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా కర్లీ హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని నేనే తయారుచేస్తే ఎలా ఉంటుంది?’ అన్న కోణంలో ఆలోచించా.. ఇదే 2019లో ‘ఫిక్స్‌ మై కర్ల్స్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించేలా చేసింది..’ అంటోంది అన్షిత.

షాంపూ నుంచి మాస్క్‌ల దాకా!

కర్లీ హెయిర్‌ ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ సహజసిద్ధమైన పరిష్కారాలు చూపే హెయిర్‌కేర్‌ బ్రాండ్‌ ఇది. ఈ వేదికగా ఉంగరాల జుట్టున్న వారు తమ కేశ సంపదను మరింతగా ఇష్టపడేలా, వాటి సహజత్వాన్ని కాపాడేలా ఆయా హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తోంది అన్షిత.

‘ఉంగరాల జుట్టును సంరక్షించుకోవడం కష్టమే అయినా.. ఇది వారికి అదనపు అందాన్ని జోడిస్తుంది. ఈ పాజిటివిటీని అందరిలో పెంచాలన్న ముఖ్యోద్దేశంతోనే నా హెయిర్‌కేర్‌ బ్రాండ్‌ పనిచేస్తోంది. ప్రస్తుతం మా వద్ద కర్లీ హెయిర్‌ సంరక్షణకు ఉపయోగపడే షాంపూలు, కండిషనర్లు, జెల్స్‌-క్రీమ్స్‌ వంటి స్టైలింగ్‌ ఉత్పత్తులు, శాటిన్‌ యాక్సెసరీస్‌, హెయిర్‌ మిస్ట్‌, హెయిర్‌ మాస్క్‌.. వంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇక వీటి తయారీ కోసం బటర్స్‌, ఆయిల్స్‌, క్లెన్సింగ్‌ ఏజెంట్స్‌.. వంటి సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగిస్తున్నాం. సల్ఫేట్లు, సిలికాన్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, పారాబెన్స్‌, మైనం.. వంటి హానికారక రసాయనాలేవీ మా ఉత్పత్తుల్లో వాడం. మా వద్ద తయారయ్యే ప్రతి ఉత్పత్తీ జుట్టు తేమను ఎప్పటికీ నిలిపి ఉంచుతుంది.. తద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది..’ అంటోంది అన్షిత.

10 దేశాలు.. కోట్ల వ్యాపారం!

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. జర్మనీ, రొమేనియా, నేపాల్‌, సౌదీ అరేబియా.. ఇలా దాదాపు పది దేశాలకూ తన హెయిర్‌కేర్‌ వ్యాపారాన్ని విస్తరించిందీ బిజినెస్‌ లేడీ. ఈ క్రమంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా తన ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే అన్షిత.. ఈ వేదికగా ఓ కర్లీ హెయిర్‌ కమ్యూనిటీని సైతం ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో మహిళల కర్లీ హెయిర్‌ సమస్యలు, వాళ్ల అనుభవాలు వింటూనే.. వాటికి పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తోందామె. అలాగే కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి సోషల్‌ మీడియా వేదికగా పలు చిట్కాలూ అందిస్తోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌. ఇలా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ పేరుతెచ్చుకున్న ఈ కర్లీ బ్యూటీ.. తన వ్యాపారంలో ఏడాది తిరిగే సరికి కోట్లు సంపాదిస్తోంది. భవిష్యత్తులో తన వ్యాపారాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని, మరిన్ని కర్లీ హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్షిత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్ని సవాళ్లు, ఒత్తిళ్లున్నా వ్యాయామం చేయడం, తన పెట్‌తో ఆడుకోవడంతోనే రిలాక్సవుతానంటోందీ బిజినెస్‌ ఉమన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్