Dating Red Flags: గుడ్డిగా నమ్మి మోసపోకండి!

మనసుకు నచ్చిన వాడు దొరికితే.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అనేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. అతని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఓ అడుగు ముందుకేసి డేటింగ్‌ సంస్కృతిని అనుసరించే వారూ లేకపోలేదు.

Published : 25 Nov 2023 12:52 IST

మనసుకు నచ్చిన వాడు దొరికితే.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అనేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. అతని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఓ అడుగు ముందుకేసి డేటింగ్‌ సంస్కృతిని అనుసరించే వారూ లేకపోలేదు. అయితే దీన్నే అలుసుగా తీసుకునే కొంతమంది అబ్బాయిలు తమను నమ్మిన భాగస్వామిని మోసం చేయడానికీ వెనకాడట్లేదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతోన్న కొన్ని ఘటనలే ఇందుకు సాక్ష్యం. నిజానికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ప్రేమ విషం చిమ్మాక గానీ అవతలి వ్యక్తి నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు కొందరు అమ్మాయిలు. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే.. డేటింగ్‌ చేసే క్రమంలో భాగస్వామిలోని సానుకూల అంశాలే కాదు.. అతడి ప్రవర్తననూ సునిశితంగా పరిశీలించాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే అనుమానించమంటున్నారు.

నిజమైన ప్రేమంటే సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ పాలుపంచుకుంటుంది. కానీ అవసరం తీరాక భాగస్వామిని వదిలించుకోవాలని చూసే వారు ఇలా ఉండరని చెబుతున్నారు నిపుణులు. మీ కష్టాల్లో వారు పాలుపంచుకోకపోగా.. ఒకవేళ మీరు వాటి గురించి చెప్పాలని చూసినా వినే ప్రయత్నం చేయరు.. పైగా టాపిక్‌ మార్చుతూ పరోక్షంగా మిమ్మల్ని మరింత బాధపెడుతుంటారు.

మీ అభిప్రాయాలకు, ఇష్టాయిష్టాలకు విలువివ్వకపోగా.. వారి నిర్ణయాలే మీరు పాటించాలన్నట్లుగా అజమాయిషీ చెలాయిస్తుంటారు. అందుకు మీరు నిరాకరిస్తే.. మీపై చేయి చేసుకోవడానికి, మాటలతో హింసించడానికీ వారు వెనకాడరు.

మీ లోకంలో తనొక్కరే ఉండేలా.. మాటలు, చేతలతో మిమ్మల్ని తనవైపు తిప్పుకుంటారు. ఈ క్రమంలో మీ కుటుంబం, స్నేహితులు-సన్నిహితులతో మీకున్న సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచేస్తుంటారు. తద్వారా వారి నుంచి ప్రతికూల సమస్యలు ఎదురైనప్పుడు మీకు ఎలాంటి ఆధారం ఉండకుండా చేయడమే దీని వెనకున్న ముఖ్యోద్దేశమన్నమాట!

మనసిచ్చిన భాగస్వామి కోసం మనం ఎన్నో త్యాగాలు చేస్తాం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వారు ఎదిగేలా మనకు చేతనైన సహాయం చేస్తాం. వారి ఉన్నతిని చూసి మనస్ఫూర్తిగా సంతోషపడతాం. కానీ మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసే మీ భాగస్వామి నుంచి ఇలాంటి మద్దతు మీకు అందదు. పైగా మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నా, కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉన్నా వారు అసూయ పడడం మీరు గమనించచ్చు.

ఒంటిపై ఓ దెబ్బ వేస్తే అది కొన్నాళ్లకు మానిపోతుంది.. కానీ మనసుకు అయిన గాయం మానడానికి కొన్నేళ్లు పడుతుంది.. పైపై ప్రేమ ప్రదర్శించే మీ భాగస్వామి కూడా మిమ్మల్ని ఇలా శారీరకంగా, మానసికంగా హింసించడానికే ప్రయత్నిస్తారని.. ఒకవేళ అవతలి వారిలో ఇలాంటి ప్రవర్తనను గుర్తిస్తే వెంటనే అలర్ట్‌ అవడం మంచిదంటున్నారు నిపుణులు.

మిమ్మల్ని బాధపెట్టాలని చూసే భాగస్వామి.. తనను తాను గాయపర్చుకోవడానికి, వివిధ రకాలుగా తనను తాను హింసించుకోవడానికీ వెనకాడరు. వారి ప్రవర్తన ద్వారా మీలో భయాందోళనలు రేకెత్తేలా చేస్తూ.. ఒక రకమైన రాక్షసానందాన్ని పొందుతారన్నమాట!

మీరు పరిచయమైన కొత్తలో మీలో ఏ లక్షణాలైతే నచ్చాయని చెప్పి మీకు దగ్గరయ్యారో.. రోజులు గడిచే కొద్దీ వాటినే మార్చుకోవాలని మీపై ఒత్తిడి తీసుకొస్తారు. ‘అప్పటితో పోల్చితే లావయ్యావని’, ‘నవ్వులో నిజాయతీ లేదని’.. ఇలా ఏవేవో సాకులు చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంటారని చెబుతున్నారు నిపుణులు.

ప్రేమంటే నమ్మకం. ఈ విశ్వాసంతోనే బాయ్‌ఫ్రెండ్‌కు తమ వ్యక్తిగత విషయాలు, మొబైల్‌ పాస్‌వర్డ్‌, అకౌంట్‌ పిన్‌.. ఇలా అన్నీ చెప్పేస్తుంటారు కొంతమంది అమ్మాయిలు. దీన్నే అలుసుగా తీసుకొని.. తరచూ మీ మొబైల్‌ చెక్‌ చేయడం, మీ అకౌంట్‌లో డబ్బును మీ ప్రమేయం లేకుండా విచ్చలవిడిగా వాడుకోవడం.. వంటివి చేస్తుంటే మాత్రం భాగస్వామిని అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు.

ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తన ఉన్న భాగస్వామి చేతిలో మోసపోవడం మీకు కొత్త కావచ్చు.. కానీ ఇలా మోసం చేయడం వాళ్లకు అలవాటే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తమ పాత స్నేహాలు, సంబంధాల గురించి, గర్ల్ ఫ్రెండ్స్‌ గురించి చెడుగా చెబితే మాత్రం.. వాళ్లను అనుమానించడంలో తప్పు లేదంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మీ గురించి మరొకరి దగ్గర ఇలా చెడుగా చెప్పరన్న గ్యారంటీ ఏంటి?!

నచ్చిన వారితో కలిసుండాలన్న ఆలోచన మీకు ఉండచ్చు.. కానీ మోజు తీరాక మిమ్మల్ని ఎలా, ఎప్పుడు వదిలించుకోవాలన్న ప్రతికూల ఆలోచన అవతలి వారి మనసులో ఉంటుంది. ఇలాంటి వాళ్ల ఫ్రెండ్‌ సర్కిల్‌ కూడా తక్కువగానే ఉంటుందట! అందుకే మీ భాగస్వామి ప్రవర్తనలో ఏవైనా తేడా గుర్తించినా, ఎక్కువమంది స్నేహితులు లేకపోయినా అనుమానించి జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు.

భరించద్దు.. బయటికి రండి!

మనస్ఫూర్తిగా ప్రేమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడానికి మనసు అంగీకరించదు. ఈక్రమంలో తమ కుటుంబానికి, స్నేహితులకు దూరమై.. భాగస్వామి తప్ప మరే మార్గం లేదన్నట్లుగా పరిస్థితులు పరిణమిస్తుంటాయి. దాంతో ప్రమాదకర పరిస్థితుల్లోనూ వారితో కలిసే జీవితం కొనసాగించడానికి నిర్ణయించుకుంటారు కొంతమంది. మోసం చేయాలనుకునే వారు దీన్నే అలుసుగా తీసుకొని మిమ్మల్ని వేధిస్తుంటారు. కాబట్టి ఆదిలోనే వారి ప్రతికూల ప్రవర్తనను పసిగట్టి, ఈ సత్యాన్ని తెలుసుకొని జాగ్రత్తపడితే.. భాగస్వామి చేతిలో మోసపోకుండా ఉండచ్చు. అలాగే వారు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నా.. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నా.. వాటిని భరించకుండా ధైర్యంగా ఆ బంధంలో నుంచి బయటికి వచ్చేయాలి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, నిపుణులు, పలు స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవడానికి వెనకాడకూడదు. ఇలా ప్రతి ఒక్కరూ ధైర్యం చేస్తే ప్రేమ వేధింపులు, హత్యలు.. వంటి ఉదంతాలు చాలావరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్