The Dog Lady: పెళ్లి మీది.. మీ పెట్‌ సంరక్షణ మాది!

పెళ్లంటే అందంగా ముస్తాబవడం, ఫొటోషూట్లు షరా మామూలే! ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేయడం చూస్తుంటాం. ఇక పెంపుడు జంతువుల్నీ తమ కుటుంబంలో ఒకరిగా భావించే వారు.. ఈ వేడుకల్లో వాటినీ భాగం చేస్తుంటారు.

Published : 29 Oct 2023 12:48 IST

(Photos: Instagram)

పెళ్లంటే అందంగా ముస్తాబవడం, ఫొటోషూట్లు షరా మామూలే! ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేయడం చూస్తుంటాం. ఇక పెంపుడు జంతువుల్నీ తమ కుటుంబంలో ఒకరిగా భావించే వారు.. ఈ వేడుకల్లో వాటినీ భాగం చేస్తుంటారు. మరి, వాటిని ముస్తాబు చేయడం దగ్గర్నుంచి, వేడుకంతా పూర్తయ్యే దాకా.. వాటి సంరక్షణను చూసుకోవడానికి కచ్చితంగా ఒక వ్యక్తి ఉండాల్సిందే! అయితే ఆ బాధ్యతలు తనకు అప్పగించి నిశ్చింతగా పెళ్లి తంతు ముగించుకోమంటోంది పాతికేళ్ల ఒలీవియా థామ్సన్‌. పెంపుడు జంతువులంటే ఇష్టపడే ఆమె.. ఈ మక్కువతోనే ‘వెడ్డింగ్‌ డాగ్ షాపరాన్ (వివాహ వేడుకల్లో వారి పెంపుడు కుక్కల్ని సంరక్షించే వ్యక్తి)’గా ఓ వ్యాపారాన్ని ప్రారంభించింది. తన సేవలతో తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించడమే కాదు.. నచ్చిన వృత్తిని ఎంచుకున్నందుకు సంతృప్తిగా, సంతోషంగానూ ఉందంటోంది. ఈ నేపథ్యంలో ఈ డాగ్‌ లవర్‌ గురించి, ఆమె వినూత్న వ్యాపారం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

స్కాట్లాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ఒలీవియాకు పెట్స్‌ అన్నా, పెళ్లిళ్లకు సంబంధించిన అంశాలన్నా భలే ఇష్టం. చదువు పూర్తయ్యాక బ్యాంకింగ్‌ రంగంలో కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె.. వెడ్డింగ్‌ ప్లానర్‌గా స్థిరపడాలనుకుంది. అయితే అనుభవం గడించడానికి ఈ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాంతో ఆఖరికి బొటానికల్‌ గార్డెన్‌కు సంబంధించిన ఓ సంస్థలో సేల్స్‌ అసిస్టెంట్‌గా చేరిందామె.

గార్డెన్‌లో తట్టిన ఐడియా!

అప్పటికే పెట్‌ లవర్‌ అయిన ఒలీవియాకు.. ఈ ఉద్యోగంలో చేరాక పెంపుడు జంతువులపై మరింత మక్కువ పెరిగింది. ఇదే వ్యాపారం ప్రారంభించేందుకు దోహదం చేసిందంటోందామె.
‘ఈ ఉద్యానవనంలో చాలామంది స్థానికులు ఉదయం, సాయంత్రం విహారానికి వచ్చేవారు. కొంతమంది తమ పెంపుడు జంతువుల్నీ వెంట తీసుకొచ్చేవారు. కొన్ని కుక్కలు గార్డెన్‌లో ఒంటరిగా తిరిగేవి. ఇంటికి వెళ్లేటప్పుడు ఎవరి పెట్స్‌ని వాళ్లు తీసుకెళ్లేవారు. కానీ, ఇక్కడే ఉండే ఈ మూగజీవుల్ని ఎవరు సంరక్షిస్తారు? అన్న సందేహం నా మదిలో మొదలైంది. ఈ క్రమంలోనే రోజంతా నేను అక్కడ పని చేసే సమయంలో వాటితో ఆడుకునేదాన్ని. వాటి ఆలనా పాలనా చూసుకునేదాన్ని. అలా కొన్నాళ్లకే వాటితో నాకు స్నేహం పెరిగింది.. మానసిక ప్రశాంతతా దొరికింది. ఇలా పెట్‌ కేరింగ్‌ గురించి మరింత అవగాహనా ఏర్పడింది. అయితే దీన్ని పెళ్లిళ్లతో ఎలా అనుసంధానం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడే ‘వెడ్డింగ్‌ డాగ్ షాపరాన్’ ఐడియా తట్టింది. దాంతో ఉద్యోగం వదిలేసి ఈ ఏడాది జూన్‌లో సొంతంగా ఓ వ్యాపారం ప్రారంభించా..’ అంటూ తన వ్యాపార ఆలోచన వెనకున్న అసలు కథను పంచుకుంది ఒలీవియా.

పెట్స్‌ని మచ్చిక చేసుకొని..!

వెడ్డింగ్‌ డాగ్ షాపరాన్ అంటే.. పెళ్లి రోజు వధూవరుల పెంపుడు కుక్కల సంరక్షణ బాధ్యతల్ని తీసుకునే వ్యక్తి అన్నమాట! పెంపుడు కుక్కలపై తాము ఎంత ప్రాణం పెట్టినా.. ఆ రోజు వాటి బాధ్యతల్ని చూసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండాల్సిందే! తన సంస్థ ద్వారా అలాంటి బాధ్యతలే నిర్వర్తిస్తోంది ఒలీవియా.

‘ది డాగ్ లేడీ.. ఇది నా సంస్థ పేరు. నా అసలు పేరు కంటే ఈ పేరుతోనే నన్ను ఎక్కువమంది గుర్తుపడతారు. ప్రస్తుతం మా సంస్థ ద్వారా రెండు రకాల సేవలందిస్తున్నాను. మొదటిది - పెళ్లి రోజున వధూవరులు పెంపుడు కుక్కల బాధ్యత తీసుకోవడం. ఇక రెండోది - డాగ్‌ వాకింగ్‌ సేవలు. వెడ్డింగ్‌ డాగ్ షాపరాన్ సేవల్లో భాగంగా.. వివాహం చేసుకోబోయే జంటల పెంపుడు కుక్కలకు కాసేపు వ్యాయామం చేయించడం, ఆపై వాటిని ముస్తాబు చేయడం, పెళ్లిలో ఎలా నడుచుకోవాలో వాటికి ముందుగానే ట్రైనింగ్‌ ఇవ్వడం.. వంటివి చేస్తాం. వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ కమాండ్స్‌నీ వాటికి నేర్పిస్తాం. ఇందుకోసం పెళ్లికి కొన్ని రోజుల ముందుగానే కాబోయే దంపతుల్ని సంప్రదించి.. వారి పెట్స్‌ని మచ్చిక చేసుకుంటాం. వాటి అలవాట్ల గురించి తెలుసుకుంటాం.. వాటి ప్రవర్తన, జీవనశైలినీ దగ్గర్నుంచి గమనిస్తాం.. ఇలా ప్రతి పెళ్లిలో ప్యాకేజ్‌ని బట్టి 2-5 గంటల పాటు మా సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇక డాగ్‌ వాకింగ్‌లో భాగంగా.. మా వద్ద ఎన్‌రోల్ చేసుకున్న వారి పెట్స్‌ని దగ్గర్లోని గార్డెన్స్‌లో కాసేపు నడిపించడం/తిప్పడం, వాటితో వ్యాయామాలు చేయించడం, యజమానులు ఊర్లో లేనప్పుడు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం, వారాంతాల్లో పెట్‌ కేరింగ్‌.. తదితర సేవలందిస్తున్నాం..’ అని చెబుతోందీ డాగ్‌ లవర్.

2026 వరకు ఫుల్‌ బిజీ!

ఇలా ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించిన తన వ్యాపారం.. తక్కువ సమయంలోనే ముప్పై పెళ్లిళ్లు, ఆరు వేల పౌండ్లుగా వృద్ధి చెందుతోందంటోంది ఒలీవియా. ఇప్పటికే నాలుగైదు పెళ్లిళ్లకు హాజరై తన సేవలతో స్థానికంగా మంచి పాపులారిటీ సంపాదించిన ఆమె.. దీంతో పాటు మంచి ఆదాయమూ అందుకుంటున్నానంటోంది. అయితే ఆదాయం కంటే.. నచ్చిన వృత్తిని ఎంచుకోవడం అధిక సంతృప్తిని, సంతోషాన్ని అందిస్తుందంటోంది.

‘ఇప్పటివరకు హాజరైన పెళ్లిళ్లలో నేను సంరక్షణ బాధ్యతలు తీసుకున్న పెట్స్‌ అన్నీ నాకు అనువుగా నడుచుకున్నాయి.. తన యజమానితో ఉన్నంత స్నేహపూర్వకంగా మెలిగాయి. ఓ పెట్‌ లవర్‌గా ఇది నాకు మరిన్ని మధురానుభూతుల్ని పంచింది. ఏదేమైనా ఈ వృత్తిలో నాకు బోలెడంత సంతోషం, సంతృప్తి దొరుకుతున్నాయి. ఇక ఈ వ్యాపారం పేరుతో విభిన్న ప్రాంతాలు, పెళ్లి మండపాలు చూసే అవకాశం నాకు దొరుకుతోంది.. వధూవరుల పెట్‌ కేరింగ్‌ బాధ్యతల్ని తీసుకొని వారి సంతోషంలోనూ పాలుపంచుకోవడం మరో అనుభూతి.. ప్రస్తుతానికైతే 2026 వరకు వెడ్డింగ్‌ డాగ్ షాపరాన్‌గా నా డేట్స్‌ అన్నీ ఫుల్‌ అయిపోయాయి..’ అంటోన్న ఒలీవియా.. ఇటీవలే తన ప్రియుడితో కలిసి ఓ పెంపుడు కుక్కను దత్తత తీసుకుంది. దానికి ముద్దుగా ‘గిన్నీ’ అని పేరు కూడా పెట్టుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్