పగలంతా చదువు.. రాత్రుళ్లు ఫుడ్‌ డెలివరీ.. ఈ అమ్మాయి స్ఫూర్తి గాథ విన్నారా?!

చదువుకోవాలన్న తపన మనల్ని ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించేలా చేస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోతే.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసైనా తమ ఫీజులు, ఇంటి అవసరాలు చూసుకునే వారిని చాలామందినే చూస్తుంటాం. పాకిస్థాన్‌కు చెందిన మీరబ్‌ అనే అమ్మాయి కూడా.....

Published : 04 Aug 2022 18:19 IST

(Photo: Twitter)

చదువుకోవాలన్న తపన మనల్ని ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించేలా చేస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోతే.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసైనా తమ ఫీజులు, ఇంటి అవసరాలు చూసుకునే వారిని చాలామందినే చూస్తుంటాం. పాకిస్థాన్‌కు చెందిన మీరబ్‌ అనే అమ్మాయి కూడా ఇదే కోవకు చెందుతుంది. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న తన కుటుంబంపై ఆధారపడడం ఇష్టం లేని ఆమె.. రాత్రుళ్లు ఫుడ్‌ డెలివరీ చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుంటోంది. ఈ డబ్బుతో తన చదువు సాగిస్తూనే.. మరోవైపు కుటుంబానికీ ఆసరాగా నిలుస్తోంది. ఈ అమ్మాయి కథని ఓ మహిళ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని..!

లాహోర్‌లోని యుహానాబాద్‌కు చెందిన మీరబ్‌కు చిన్న వయసు నుంచే చదువంటే చాలా ఇష్టం.. పైగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేయాలనేది తన కల. ప్రస్తుతం అదే కోర్సు చేస్తోన్న ఆమెకు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా పలు సమస్యలు ఎదురయ్యాయి. పైగా ఆరోగ్య సమస్యల వల్ల తన తల్లికీ వైద్యం చేయించాల్సిన పరిస్థితి. అలాగని చదువు మానేయడానికి ఆమె మనసొప్పలేదు. అందుకే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ.. అటు తన చదువును కొనసాగించాలని, ఇటు కుటుంబానికీ అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కేఎఫ్‌సీలో చేరింది. అయితే పగటి పూట కాలేజీకి వెళ్లాల్సి రావడంతో.. రాత్రుళ్లు విధులు నిర్వర్తించడానికి ఒప్పుకుంది.

నీ పట్టుదలకు జోహార్లు!

ఈ క్రమంలోనే ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఫిజ్జా ఇజాజ్‌ అనే మహిళ కేఎఫ్‌సీ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంది. డెలివరీ సమయంలో వచ్చిన కాల్‌ను స్వీకరించిన ఆమె ఒక్కసారిగా షాకైంది. కారణం.. అవతలి వైపు నుంచి ఓ అమ్మాయి గొంతు వినిపించింది.. అదీ రాత్రి సమయంలో ఫుడ్‌ డెలివరీ చేయడంతో ఆశ్చర్యానికి గురైంది. ఆపై ఆ అమ్మాయి నుంచి ఆర్డర్‌ స్వీకరించడమే కాదు.. ఈ కష్టం వెనకున్న కథనూ తెలుసుకొని లింక్డిన్‌లో ఇలా రాసుకొచ్చింది.

‘నేను కేఎఫ్‌సీ నుంచి ఓ ఆర్డర్‌ పెట్టా. ఫుడ్‌ డెలివరీ అయ్యే సమయంలో ఓ అమ్మాయి నాకు ఫోన్‌ చేసి.. ‘నేను మీ డెలివరీ గర్ల్‌ని!’ అంది. అంతే.. నేను, నా ఫ్రెండ్స్ ఆమె కోసం గేటు దగ్గర వేచి చూశాం. కాసేపు ఆమెతో మాట్లాడాం. ప్రస్తుతం తను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నానని; చదువుకయ్యే ఫీజుల్ని కేఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ భరిస్తోందని; అయితే తన వ్యక్తిగత ఖర్చులు, కాలేజీ అసైన్‌మెంట్స్‌, తన తల్లి చికిత్స-మందుల కోసం ఇలా రాత్రుళ్లు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నానని చెప్పింది. మరో మూడేళ్ల పాటు దీన్ని కొనసాగించి.. ఆపై చదువు పూర్తి కాగానే సొంతంగా ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఏదేమైనా తనతో మాట్లాడుతున్నంత సేపు ఉత్సాహంగా అనిపించింది. తన బైక్‌ రైడింగ్‌ నైపుణ్యాలు, ఎలాగైనా సరే చదువుకోవాలన్న తపన మమ్మల్ని కట్టిపడేశాయి. త్వరలోనే మీరబ్‌ కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. అలాగే మరింతమంది అమ్మాయిలు మీరబ్‌ను స్ఫూర్తిగా తీసుకొని వారి కలలు నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నా..’ అంటూ ఈ డెలివరీ గర్ల్‌ స్టోరీని పంచుకుంది ఫిజ్జా.

దీంతో ప్రస్తుతం మీరబ్‌ కథ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘మీరబ్‌.. మీ తపన, పట్టుదల, ధైర్యానికి జోహార్లు! మీరు చేసే పని ప్రత్యక్షంగా మీకు ఉపయోగపడడమే కాదు.. పరోక్షంగా ఈ సమాజానికీ స్ఫూర్తిదాయకం..!’ అంటూ నెటిజన్లు ఈ అమ్మాయిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

హ్యాట్సాఫ్‌ మీరబ్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్