Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!

పిల్లల్ని మందలిస్తేనే మన చెప్పుచేతల్లో ఉంటారా? ఖర్చు విషయంలో కంట్రోల్‌ చేస్తేనే చిన్నారులకు డబ్బు విలువ తెలుస్తుందా?ఎప్పుడూ పిల్లలే తల్లిదండ్రుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలా? అంటే.. ఇలా.....

Published : 11 Aug 2022 15:12 IST

పిల్లల్ని మందలిస్తేనే మన చెప్పుచేతల్లో ఉంటారా? ఖర్చు విషయంలో కంట్రోల్‌ చేస్తేనే చిన్నారులకు డబ్బు విలువ తెలుస్తుందా?ఎప్పుడూ పిల్లలే తల్లిదండ్రుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలా? అంటే.. ఇలా అనుకోవడం మన పొరపాటే అంటోంది బాలీవుడ్‌ అందాల తార కాజోల్‌ దేవ్‌గణ్‌. నైసా, యుగ్‌ అనే ఇద్దరు పిల్లల తల్లైన ఆమె.. ఇటు ఇంటిని, అటు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేయడంలో అత్యుత్తమంగా నిలుస్తుంది. మరోవైపు తల్లిగా పిల్లలకు ఏ లోటూ రానివ్వకుండా, వర్కింగ్‌ మదర్‌గా పిల్లలు తనను మిస్సవకుండా బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటానంటోంది. పిల్లల పెంపకం విషయంలో తన తల్లి తనూజా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వాటిని తన పిల్లల విషయంలో పాటిస్తూ.. వాళ్లతో ‘ది బెస్ట్‌ మామ్‌’ అనిపించుకుంటున్నానంటూ మురిసిపోతోంది. మరి, ఒక తల్లికి పిల్లలిచ్చే అత్యుత్తమ బహుమతి ఇంతకంటే ఇంకేముంటుంది? అయితే, అందుకోసం కాజోల్‌ పాటించే ఆ చిట్కాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..!

‘బొమ్మరిల్లు’ పేరెంటింగ్‌.. నమ్మను!

కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతి విషయంలోనూ తాము చెప్పినట్టే వినాలని, నడుచుకోవాలని అనుకుంటారు. వేసుకునే దుస్తుల దగ్గర్నుంచి తీసుకునే ఆహారం దాకా.. తమకు నచ్చిందే పాటించాలన్న నియమాలు పెడుతుంటారు. ఇందుకు అతి గారాబం, అతి భద్రత, పిల్లలకు స్వేచ్ఛనిస్తే తప్పుదోవ పడతారేమోనన్న భయం.. ఇలా చాలా కారణాలే ఉంటాయి. అయితే నేను మాత్రం ఇందుకు భిన్నం. కంట్రోలింగ్‌ పేరెంటింగ్‌ అంటే నాకు అస్సలు నచ్చదు. పైగా దీనివల్ల పేరెంట్స్‌, పిల్లల మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం కూడా వృద్ధి చెందదు. దాంతో చిన్నారులు తమ సమస్యల్ని పెద్దవాళ్లతో చెప్పుకోలేరు.. ఫలితంగా సమస్యలు కూడా పరిష్కారం కావు. ఏ కోణంలో నుంచి పరిశీలించినా ఈ తరహా పేరెంటింగ్‌ మేలు చేయదు. అందుకే నేను దీనికి విరుద్ధం. నిజానికి నేను ఈ చిట్కాను అమ్మ నుంచే నేర్చుకున్నా. నన్ను, చెల్లిని పెంచే విషయంలో అమ్మ ఇలాగే వ్యవహరించేది.. ఇప్పుడు నేను దీన్ని నా పిల్లల విషయంలో పాటిస్తున్నా.

ప్రతి పైసా లెక్కే!

‘స్టార్‌ కిడ్స్‌కేంటి.. ఖర్చుపెట్టినంత డబ్బు.. కూర్చొని లెక్కలు రాసుకోవాల్సిన అవసరం వారికేంటి?’ అనుకుంటారు చాలామంది. కానీ ఇలా అంటే నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే నా పిల్లలకు ఆర్థిక విషయాల్లో నేను ఇంత స్వేచ్ఛనివ్వను. వాళ్లు ఖర్చు చేసిన ప్రతి రూపాయీ.. ఎక్కడ, దేనికోసం వెచ్చించారో అడిగి తెలుసుకుంటా. అంతేకాదు.. అది అవసరమైందో, అనవసర ఖర్చో కూడా వెంటనే చెప్పేస్తా. దీనివల్ల వారికి డబ్బు విలువ తెలుస్తుంది. ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ అవసరం లేదో గ్రహించగలుగుతారు. అంతేకానీ.. పిల్లలకు అసలే డబ్బులు ఇవ్వకపోవడం, మరీ విచ్చలవిడిగా ఇవ్వడం.. ఈ రెండూ మంచి పద్ధతులు కావనేది నా అభిప్రాయం.

‘GCBC పేరెంటింగ్‌’కి మేం విరుద్దం!

తల్లిదండ్రులిద్దరిలో ఒకరు పిల్లలతో ప్రేమగా వ్యవహరించాలని, మరొకరు స్ట్రిక్ట్‌గా ఉంటూ వారికి భయం చెప్పాలని కొంతమంది అనుకుంటారు. దీన్నే ‘గుడ్‌ కాప్‌ బ్యాడ్‌ కాప్‌ (GCBC) పేరెంటింగ్‌’గా పిలుస్తారు. నిజానికి దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులిద్దరి ప్రేమ సంపూర్ణంగా అందదు. గుడ్‌ కాప్‌ పట్ల మరీ చనువుగా, బ్యాడ్‌ కాప్‌కు మరీ దూరంగా ఉన్నా.. అది అసలైన పేరెంటింగ్‌ అనిపించుకోదు. కాబట్టి పిల్లలు తప్పు చేస్తే సున్నితంగా మందలించడం, మంచి పని చేస్తే వారిని ప్రశంసించడం, పిల్లల విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసే తీసుకోవడం.. ఇలా ప్రతి పనినీ తల్లిదండ్రులిద్దరూ కలిసి చేస్తేనే పిల్లలు వాళ్లకు కావాల్సిన ప్రేమ, ఆదరణ పొందగలుగుతారు. అంతేకాదు.. దీనివల్ల పిల్లలకు, పేరెంట్స్‌కి మధ్య స్నేహబంధం ఏర్పడి ప్రతి విషయాన్నీ వారు మీతో పంచుకోగలుగుతారు. నా ఇద్దరు పిల్లల విషయంలో కూడా ఏ నిర్ణయమైనా నేను, అజయ్‌ కలిసే తీసుకుంటాం.

పిల్లల నుంచీ నేర్చుకోవాలి!

‘పిల్లలు చిన్న వాళ్లు.. వాళ్లకు లోకం పోకడ ఏం తెలుస్తుంది?’ అన్న భ్రమలో ఉంటారు కొందరు. కానీ ఆ అభిప్రాయం తప్పని నేనంటా. ఎందుకంటే మనం ఎప్పుడూ పిల్లలకు మంచి విషయాలు చెప్పడమే కాదు.. వాళ్ల నుంచీ నేర్చుకునే అంశాలు కొన్నుంటాయి. ఉదాహరణకు.. ఈ తరానికి సోషల్‌ మీడియా గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మనం వాళ్ల నుంచి నేర్చుకోవచ్చు. అంతెందుకు.. సోషల్‌ మీడియాలో కొన్ని సంక్షిప్తాలు (Acronyms), యాసలు (Slangs).. వంటి వాటి గురించి నేను నా కూతురు నైసా దగ్గర్నుంచే తెలుసుకుంటా. ఇక నా కొడుకు కూడా ఓ సందర్భంలో ‘అన్ని వేళలా కోపం పనికి రాదు.. ఏ విషయాన్నైనా ఓపికతో, శాంతంగా వివరించాలి..’ అంటూ తన మాటలతో చెప్పకనే చెప్పాడు. ఇలా వాళ్లలో దాగున్న మంచి విషయాలు మనం నేర్చుకొని ఆచరించినప్పుడే వాళ్లకూ ప్రోత్సాహకరంగా ఉంటుంది.. ఇదే పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య అనుబంధాన్ని దృఢం చేస్తుంది.

ఇలా చేస్తే మిస్సవ్వరు!

ఈరోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని, పేరెంట్స్‌ తమ పిల్లల్ని మిస్సవడం చూస్తున్నాం.. ఇందుకు కెరీర్‌, ఇతర వృత్తి ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండడం.. వంటివి కారణాలు కావచ్చు. దీనివల్ల ఇద్దరి మధ్య అనుబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఇటు ఇంటిని, అటు ఉద్యోగాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం.. అటు వృత్తిలో, ఇటు ఇంట్లో సమయం వృథా చేసుకోకుండా ప్రణాళిక వేసుకుంటే పిల్లలకూ తగిన సమయాన్ని కేటాయించవచ్చు. ఓసారి నా కొడుకు నన్నో ప్రశ్న అడిగాడు. ‘అమ్మా.. నువ్వు రోజూ మమ్మల్ని వదిలేసి షూటింగ్‌కి ఎందుకు వెళ్తున్నావు?’ అని! అప్పుడు నేను.. ‘నాన్నా.. నువ్వు రోజూ ఆడుకోవడానికి ఎందుకెళ్తావ్‌? అక్కడ నీకు సంతోషం దొరుకుతుందనేగా! నాకూ షూటింగ్‌ ప్లేటైమ్‌ లాంటిది.. దాంతో నేను మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతా.. అందుకే నువ్వు రోజూ నన్ను నవ్వుతూ పంపించాలి..’ అని వివరించి చెప్పా. తను అర్థం చేసుకున్నాడు. అప్పట్నుంచి ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం’ అన్న మాట నా పిల్లల నోటి నుంచి వినలేదు. ఇలా ప్రతి విషయాన్నీ పిల్లలకు సున్నితంగా వివరిస్తే ఎందుకు అర్థం చేసుకోరు?! పైగా దీనివల్ల ఇద్దరి మధ్య అనుబంధం కూడా దృఢమవుతుంది.
ప్రస్తుతం నా కూతురు నైసాకు 19 ఏళ్లు, కొడుకు యుగ్‌కి 11 ఏళ్లు. వారిద్దరూ నా రెండు కళ్లు. ఇప్పటికీ నా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తినీ సమర్థంగా బ్యాలన్స్‌ చేసుకుంటున్నానంటే అది నా భర్త, పిల్లల ప్రోత్సాహమే అని చెప్తా. ప్రతి మహిళకూ ఇలా ఇంటి నుంచి మద్దతు ఉంటే ఎందులోనైనా విజయం సాధించగలదు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్