Poonam Gupta: వృథా పేపర్లతో.. వెయ్యి కోట్ల వ్యాపారం!

ఉన్నత విద్యా సంస్థల్లో చదువు.. చక్కటి అకడమిక్‌ ట్రాక్‌ రికార్డు.. అంతకుమించిన తెలివితేటలు.. ఇలాంటి వాళ్లకు కెరీర్‌ అవకాశాలు క్యూ కడుతుంటాయి. ప్రముఖ సంస్థలు వరుస ఉద్యోగావకాశాల్ని అందిస్తాయి.. కానీ పూనమ్‌ గుప్తా విషయంలో ఇలా జరగలేదు. చదువులో రాణించినా, అమోఘమైన తెలివితేటలున్నా.. ఉద్యోగ వేటలో మాత్రం విఫలమైందామె.

Published : 13 Apr 2024 13:31 IST

(Photos: Instagram)

ఉన్నత విద్యా సంస్థల్లో చదువు.. చక్కటి అకడమిక్‌ ట్రాక్‌ రికార్డు.. అంతకుమించిన తెలివితేటలు.. ఇలాంటి వాళ్లకు కెరీర్‌ అవకాశాలు క్యూ కడుతుంటాయి. ప్రముఖ సంస్థలు వరుస ఉద్యోగావకాశాల్ని అందిస్తాయి.. కానీ పూనమ్‌ గుప్తా విషయంలో ఇలా జరగలేదు. చదువులో రాణించినా, అమోఘమైన తెలివితేటలున్నా.. ఉద్యోగ వేటలో మాత్రం విఫలమైందామె. వరుస తిరస్కరణలకు గురైంది. అయినా నిరాశ చెందలేదు. ‘సంస్థలు తనకు ఉద్యోగం ఇవ్వకపోతేనేం.. తానే ఓ వ్యాపారం ప్రారంభించి నలుగురికీ ఉపాధి కల్పించాల’నుకుంది. ఈ ఆలోచనే ఇప్పుడు ఆమెను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలబెట్టింది. పేపర్‌ రీసైక్లింగ్‌తో నాణ్యమైన పేపర్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తూ వాటిని సుమారు 60 దేశాలకు ఎగుమతి చేస్తూ.. వెయ్యి కోట్ల టర్నోవర్‌కు చేరువైన పూనమ్‌ విజయగాథ ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం!

పూనమ్‌ది దిల్లీ. సంప్రదాయ మూలాలున్న కుటుంబం కావడంతో.. తన ఫ్యామిలీలో ఆడపిల్లల్ని చదువు, ఉద్యోగాల్లో ప్రోత్సహించేవారు కాదు. అయినా వీటన్నింటినీ పక్కన పెట్టి తన ఒక్కగానొక్క కూతురు పూనమ్‌ను ఉన్నత చదువులు చదివించారు ఆమె తండ్రి. ఇందుకు తగినట్లే చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉన్న ఆమె.. తన తెలివితేటలతో ఉన్నత విద్యాసంస్థల్లో సీటు సంపాదించింది. దిల్లీలోని లేడీ ఇర్విన్‌ స్కూల్‌, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం, లేడీ శ్రీరామ్‌ కాలేజీలో కళాశాల చదువు పూర్తిచేశాక.. అర్థశాస్త్రంలో డిగ్రీ (ఆనర్స్‌) పట్టా అందుకుంది. దిల్లీ యూనివర్సిటీ నుంచి ‘ఇంటర్నేషనల్‌ బిజినెస్‌-మార్కెటింగ్‌’లో ఎంబీఏ చేసిన పూనమ్‌.. ‘గ్లాస్గో క్యాలెడోనియన్‌ యూనివర్సిటీ’ నుంచి ‘బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌’లో పీహెచ్‌డీ పట్టా అందుకుంది.

వరుస తిరస్కరణలు!

2002లో చదువు పూర్తయ్యాక పునీత్‌ గుప్తాను వివాహమాడిన పూనమ్‌.. తన భర్తతో కలిసి స్కాట్లాండ్‌లో స్థిరపడింది. అక్కడే తన కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఆమె.. ఉద్యోగ వేట ప్రారంభించింది. మంచి అకడమిక్‌ ట్రాక్‌ రికార్డు, తెలివితేటలున్నా.. ఇంటర్వ్యూల్లో పలుమార్లు తిరస్కరణకు గురైందామె. అయినా నిరాశ చెందకుండా.. తానే ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. ఈ క్రమంలో ఆలోచిస్తున్నప్పుడే పూనమ్‌కు ఓ ఐడియా తట్టింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో ఆయా సంస్థల్లో కొండల్లా పేరుకుపోయిన వృథా పేపర్లు ఆ సమయంలో ఆమె కళ్ల ముందు మెదిలాయి. వాటితో పర్యావరణానికి నష్టమే తప్ప.. ఎలాంటి ప్రయోజనం లేదనుకున్న ఆమె.. ఆ పేపర్లను రీసైక్లింగ్‌ చేసి నలుగురికీ ఉపయోగపడే వస్తువుల్ని తయారుచేయాలనుకుంది. ఇదే 2003లో ‘పీజీ పేపర్‌ కంపెనీ లిమిటెడ్‌’ అనే సంస్థను ప్రారంభించేలా చేసింది. ఈ క్రమంలో- ప్రభుత్వ పథకం ద్వారా అందిన రూ. లక్ష పెట్టుబడితో ‘పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్’ పేరిట ఓ పేపర్ రీసైక్లింగ్ సంస్థను ప్రారంభించింది పూనమ్.

ఇంటి నుంచే సేవలు!

ఆయా సంస్థల నుంచి వృథా పేపర్లను సేకరించి.. వాటిని రీసైకిల్‌ చేసి.. కొత్త పేపర్‌ ఉత్పత్తుల్ని తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. తొలుత ఇంటి నుంచే తన వ్యాపార సేవలు ప్రారంభించిన ఆమె.. యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా దేశాల్లో ఉన్న పలు సంస్థల నుంచి వృథా పేపర్లను సేకరించి రీసైకిల్‌ చేసేవారు.

‘సాధారణంగా పేపర్‌ కలప నుంచి తయారవుతుంది. అదే వృథా పేపర్లను రీసైక్లింగ్‌ చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అందుకే ఆయా సంస్థల నుంచి పేపర్లను సేకరించి రీసైకిల్‌ చేయడం ప్రారంభించా. ఇలా రీసైకిల్‌ చేసిన పేపర్‌తోనూ పలు పేపర్‌ ఉత్పత్తులు తయారుచేయచ్చన్న విషయం చిన్నపాటి అధ్యయనం ద్వారా తెలుసుకున్నా. ఈ ఆలోచనతోనే ఓ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పిన నేను.. ఇటలీ, ఫిన్లాండ్‌, స్వీడన్‌, భారత్ తదితర దేశాల్లోని సంస్థల నుంచి పెద్ద మొత్తంలో వృథా పేపర్లను కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ చేయడం ప్రారంభించా. వీటితో నాణ్యమైన పేపర్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నా. ఇందులో భాగంగా న్యూస్‌ ప్రింట్‌, వుడ్‌ఫ్రీ కోటెడ్‌ పేపర్‌, సూపర్‌ క్యాలెండర్డ్‌-లైట్‌వెయిట్‌ కోటెడ్ పేపర్‌, పేపర్‌ కవర్స్‌, కార్టన్‌ బోర్డ్‌, క్రాఫ్ట్‌ పేపర్స్‌, థర్మల్‌ పేపర్‌, టిష్యూ పేపర్‌.. ఇలా పేపర్లలో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలూ మా దగ్గర తయారవుతున్నాయి..’ అంటున్నారు పూనమ్.

లక్షల నుంచి కోట్లకు పడగెత్తి!

రూ. లక్ష పెట్టుబడితో తన పేపర్‌ రీసైక్లింగ్‌ బిజినెస్‌ను ప్రారంభించిన పూనమ్‌.. అనతి కాలంలోనే రూ. 40 లక్షల వార్షిక ఆదాయాన్ని అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఆపై తాను తయారుచేసే వివిధ రకాల పేపర్‌ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకూ ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన పూనమ్‌.. ప్రస్తుతం సుమారు 60 దేశాలకు తన పేపర్‌ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తూ దాదాపు వెయ్యి కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. భవిష్యత్తులో తన సంస్థను లక్ష కోట్ల వ్యాపారంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతున్నారు పూనమ్‌. ప్రస్తుతం ఈ వ్యాపారంతో పాటు PG World, SAPP Holdings, SAPP International, SAPP Property, Envisage Dental Health, Punav.. పేర్లతో సంస్థల్ని స్థాపించి రియల్‌ఎస్టేట్‌, ఆరోగ్య రంగాల్లోనూ దూసుకుపోతున్నారామె. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న పూనమ్.. ‘యూకే-ఇండియాతో సంబంధాలున్న వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల’ జాబితాలో స్థానం సంపాదించారు.

సేవలోనూ ముందే!

తన వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా సమాజ సేవకూ సమయం కేటాయిస్తారు పూనమ్‌. మహిళా సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలిచే ఆమె.. పేద చిన్నారుల అభివృద్ధి, మూగ జీవుల పరిరక్షణకు పాటుపడే పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. అలాగే క్యాన్సర్‌, లింగ సమానత్వం, బాలికా విద్య.. వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. బ్రిటిష్‌ కళాకారుడు Sacha Jafri విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ కోసం తన పెయింటింగ్‌ను వేలం వేసినప్పుడు.. ఆ వేలంలో పాల్గొని అత్యధిక మొత్తానికి ఆ పెయింటింగ్‌ను తన సొంతం చేసుకున్నారు పూనమ్‌. ఇలా ఈ డబ్బుతో విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌కు పరోక్షంగా సేవలందించారామె. భారత్‌లో కొవిడ్‌ రెండో దశ విజృంభించిన సమయంలోనూ సుమారు మూడు వేల ఆక్సిజన్‌ సిలిండర్స్‌ని ఉచితంగా అందించి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారామె. వ్యాపార, సేవా రంగాల్లో ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా పలు అవార్డులు, రివార్డులు అందుకున్న పూనమ్‌.. 2016లో బ్రిటన్‌ ప్రభుత్వం అందించే అత్యున్నత మెడల్‌ ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (OBE)’ అందుకున్నారు. మరోవైపు ఇద్దరు కూతుళ్ల తల్లిగా ఇంటి బాధ్యతల్నీ సమర్థంగా నిర్వర్తిస్తోన్న ఈ లేడీ బాస్.. వ్యక్తిగత, వృత్తిగత విజయాలకు మదర్‌ థెరెసా, ఇందిరా గాంధీ వంటి మేటి మహిళలే స్ఫూర్తి అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్