ఈ ఆటలతో చిన్నారుల మెదడు చురుగ్గా..!

పిల్లలకు ఆటలంటే ఎంతిష్టమో మనకు తెలిసిందే. నెలల ప్రాయంలో ఉండగానే బోర్లా పడుతూ, చుట్టూ ఉన్న వస్తువులతోనే ఆడుకోవడం మొదలుపెట్టేస్తారు. అందుకే పిల్లల ప్రాధాన్యాల్లో ఆటలది ఎప్పుడూ మొదటిస్థానమే. ఒక్కోసారి తల్లులు కూడా చిన్నారులతో కలిసి ఈ ఆటల్లో....

Published : 18 Apr 2022 19:19 IST

పిల్లలకు ఆటలంటే ఎంతిష్టమో మనకు తెలిసిందే. నెలల ప్రాయంలో ఉండగానే బోర్లా పడుతూ, చుట్టూ ఉన్న వస్తువులతోనే ఆడుకోవడం మొదలుపెట్టేస్తారు. అందుకే పిల్లల ప్రాధాన్యాల్లో ఆటలది ఎప్పుడూ మొదటిస్థానమే. ఒక్కోసారి తల్లులు కూడా చిన్నారులతో కలిసి ఈ ఆటల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. అయితే తల్లీపిల్లలు కలిసి ఆడేటప్పుడు ఎలాంటి ఆటలు ఎంచుకోవాలి? ఏ గేమ్స్ వారి ఆలోచనాతీరుని మెరుగుపరిచి, బుర్రకి పదును పెడతాయో తెలుసుకుందాం రండి..

పీక్-ఎ-బూ..

ఈ ఆట సాధారణంగా ప్రతి తల్లీపిల్లలు చిన్నప్పట్నుంచీ ఆడేదే. చేతులని ముఖానికి అడ్డుగా పెట్టుకొని.. ‘అమ్మ ఎక్కడుంది..?’ అని చిన్నారిని అడుగుతూ కాసేపటికి చేతులు పక్కకి తీసి ‘బూ’ అంటూ పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు. ఆడడానికి, వినడానికి ఈ ఆట సింపుల్‌గానే అనిపించినా దీనివల్ల పిల్లలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఆట వల్ల చిన్నారులు వారి ఎదుట ఉండే వ్యక్తులు ఎవరు, వారికి ఏమవుతారు.. అనేది క్రమంగా తెలుసుకొని గుర్తించడమే కాకుండా, వయసు పెరిగే కొద్దీ చిన్నారులు కూడా మరింత ఉత్సాహంగా ఈ ఆటని ఆడతారట! ఈ క్రమంలోనే మనం ముఖానికి చేతులు అడ్డు పెట్టుకున్నప్పుడు వాళ్ల చిట్టి చేతులతో వాటిని పక్కకి తీసేందుకు యత్నిస్తారు. అంతేకాదు.. వారు కూడా చిట్టి చిట్టి చేతులతో తమ ముద్దులొలికే ముఖాన్ని దాచుకొని మనతో దోబూచులాడేందుకు ప్రయత్నిస్తారు కూడా..! అంటే ఇది చిన్నారులకు నేర్చుకునే నైజాన్ని కూడా పరిచయం చేస్తుందన్నమాట.

రౌండ్.. రౌండ్.. రౌండ్..

ఇంట్లో ఎక్కువ మంది పిల్లలున్నా లేదా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.. అందరూ కలిసి ఆడాలనుకున్నా.. ఈ ఆట సరదాని పంచుతుంది. దీనికి ప్రత్యేకంగా ఆటవస్తువులు కూడా ఏమీ అవసరం ఉండవు. ఒకరి చేయి మరొకరు పట్టుకుంటూ గుండ్రంగా చుట్టూ తిరగాలి. అయితే ఈ ఆట ఆడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా మ్యూజిక్ ప్లే చేయచ్చు లేదా ఆట ఆడేవారిలో ఎవరో ఒకరు రౌండ్.. రౌండ్.. రౌండ్.. అని అంటూనే సడెన్‌గా స్టాప్ చెప్పాలి. అప్పుడు అంతా నేల మీద కూర్చోవాలి. ఇలాంటి ఆట పిల్లలు ఆడడం వల్ల వారిలో వినికిడి శక్తి మెరుగవడంతోపాటు ఊహాశక్తి కూడా అలవడుతుందంటున్నారు నిపుణులు. అంటే స్టాప్ ఎప్పుడు చెప్తారా అని ముందే వారు వూహించేందుకు ప్రయత్నిస్తారట! అలాగే ఆట ఆడే సమయంలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటాం కాబట్టి పరస్పరం సహకరించుకోవాలనే విషయం వారికి అవగతమవుతుంది.

బాస్కెట్ బాల్..

బాల్ అంటే ఇష్టపడని పిల్లలుంటారా చెప్పండి.. చేతికి బంతి ఇవ్వడమే ఆలస్యం.. దాన్ని వారికి నచ్చినట్లుగా విసురుతుంటారు. అయితే ఊరికే బాల్ ఇచ్చి వారిని ఆడుకోమని వదిలేయడం కాకుండా ఇంట్లో అందుబాటులో ఉన్న నెట్ లేదా ఏదైనా ఫ్యాబ్రిక్‌తో బాస్కెట్‌బాల్ రింగ్ తయారు చేసి వివిధ రకాల రంగుల్లో ఉన్న బంతులను పిల్లల ముందు ఉంచాలి. ఒక్కో బంతిని తీసి ఆ రింగ్‌లో వేయమని వారికి చెప్పాలి. చిన్నారులు బంతి తీసేటప్పుడు లేదా రింగ్‌లో వేసేటప్పుడు ఆ బంతి రంగు పేరు వారితో చెప్పించాలి. బంతులన్నీ ఆడిన తర్వాత వాటిని ఏరి ఒకచోట పెట్టమని వారికి సూచించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో చేతికి, కళ్లకు మధ్య ఉన్న సమన్వయం మరింత మెరుగవ్వడమే కాకుండా ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేతత్వం కూడా అలవడుతుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.

డ్యాన్స్, పాటలు..

పిల్లలతో కలిసి ఆడుకోవడం అంటే కేవలం ఆటలకే పరిమితమైపోవాలని అర్థం కాదు. వారితో కలిసి డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం కూడా ఆటల కిందకే వస్తాయి. మీకు తెలుసా.. నేరుగా ఆడే ఆటల కంటే ఇలాంటి వినోదాత్మక గేమ్స్‌ వల్ల పిల్లలు మరింత ఉత్సాహంగా, కొత్త విషయాలు త్వరగా గ్రహించేలా తయారవుతారంటున్నారు నిపుణులు. అలాగే కొత్త కొత్త పదాలు, భాషల గురించి నేర్చుకోవడమే కాకుండా రకరకాల వస్తువులు, వాటి రంగులు, ఆకృతులు.. వంటివి కూడా తెలుసుకుంటారట!
వీటితో పాటు బిల్డింగ్ బ్లాక్స్, రోల్స్, పజిల్స్.. వంటి ఆటలన్నీ చిన్నారులకు అటు సరదాలు పంచుతూనే ఇటు వారి మెదడుకు పదును పెడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్