Priyanka Chopra: ‘శాంపిల్‌ సైజు’లో లేవన్నారు!

మనం ఎలా ఉండాలో, ఎంత బరువుండాలో ఈ సమాజమే నిర్ణయిస్తుంది. ఒకవేళ వారి అంచనాలకు తగినట్లుగా లేకపోతే.. బాడీ షేమింగ్‌ పేరుతో హింసిస్తుంది. ఇలాంటి మాటల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆ మాటలు తననెంతో బాధించాయని, తన కుటుంబ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకునేలా....

Updated : 16 Mar 2023 21:12 IST

(Photos: Instagram)

మనం ఎలా ఉండాలో, ఎంత బరువుండాలో ఈ సమాజమే నిర్ణయిస్తుంది. ఒకవేళ వారి అంచనాలకు తగినట్లుగా లేకపోతే.. బాడీ షేమింగ్‌ పేరుతో హింసిస్తుంది. ఇలాంటి మాటల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆ మాటలు తననెంతో బాధించాయని, తన కుటుంబ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకునేలా చేశాయని ఇటీవలే ఓ చిత్రోత్సవంలో భాగంగా వెల్లడించిందామె. అయితే తనకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదని, గతంలోనూ తన శరీరాకృతి, చర్మ ఛాయ.. వంటి అంశాల్లో విమర్శలు ఎదుర్కొన్నానంటోన్న ఈ అందాల తార.. ఆత్మవిశ్వాసంతోనే ఇలాంటి విమర్శల్ని తిప్పికొట్టాలంటోంది.

తెరపై నటించే నటీమణులు అందం, బరువు, ఫిట్‌నెస్‌.. వంటి విషయాల్లో కచ్చితంగా వ్యవహరిస్తుంటారు. అయితే పలు కారణాల వల్ల బరువు పెరిగినా, తగ్గినా.. వారికి సమాజం నుంచి విమర్శలూ తప్పవు. ఇలా తన బరువు విషయంలో ఇటీవల ఇలాంటి విమర్శల్నే ఎదుర్కొంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోన్న ‘సౌత్‌ బై సౌత్‌వెస్ట్‌’ చిత్రోత్సవంలో పాల్గొన్న ఆమె.. ఈ వేదికగా తనకెదురైన బాడీ షేమింగ్‌ అనుభవాల్ని ఇలా పంచుకుంది.

ఆ మాటలు బాధించాయి!

‘మనల్ని లక్ష్యంగా చేసుకొని ఇతరులు అనే కొన్ని మాటలు వినడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇటీవలే ఓ వ్యక్తి నన్ను చూసి ‘మీరు శాంపిల్‌ సైజులో లేర’న్నారు. అంటే.. నేను సన్నగా, నాజూగ్గా కాకుండా బరువు పెరిగానంటూ ఇలా పరోక్షంగా విమర్శించడంతో చాలా బాధనిపించింది. ఆ మాటలు విని నా మనసు నొచ్చుకుంది. ఉండబట్టలేక ఈ విషయాన్ని నా భర్త నిక్‌, ఇతర కుటుంబ సభ్యులతో పంచుకున్నా.. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.. ఇలా నన్నే కాదు.. నా పాప, ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా పలు విషయాల్లో కొంతమంది విమర్శిస్తుంటారు.. అంతెందుకు..? కొన్ని నెలల క్రితం నా చర్మ ఛాయ విషయంలోనూ కొంతమంది తమకిష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘నల్ల పిల్లి’, ‘డస్కీ’.. అంటూ పిలిచారు. నిజానికి భారతీయులందరూ చామనఛాయలోనే ఉంటారు. నా దృష్టిలో అందం కంటే కష్టపడే తత్వం, ప్రతిభ ముఖ్యం. ఈ విషయంలో ఫెయిర్‌గా ఉన్న నా సహనటీమణుల కంటే నేను ఉత్తమంగా ఉన్నాననే అనుకుంటున్నా..’ అంది ప్రియాంక.

అప్పుడు మరింత ఇబ్బంది పడ్డా!

కేవలం ఇప్పుడే కాదు.. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయంటోంది పీసీ. ‘సినీ రంగంలో ఉన్నామంటే.. కెమెరా దగ్గర్నుంచి ప్రతి ఒక్కరి కళ్లూ మన పైనే ఉంటాయి. మన శరీరాకృతిలో ఏ కాస్త తేడా వచ్చినా అందరి కళ్లూ ఇట్టే పసిగట్టేస్తాయి. ఆ సమయంలో వాళ్లు అనే మాటలు మనల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి. నాన్న పోయినప్పుడు నేనూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నా. నా జీవితంలో అదొక చీకటి అధ్యాయం. నాన్న పోయాక నా ఆహారపుటలవాట్లు మారిపోయాయి. మనసు బాగోలేక ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించలేకపోయా. దాంతో నా శరీరాకృతిలో తేడాలొచ్చాయి. బరువు పెరిగిపోయా. అలా నన్ను చూసి చాలామంది ‘మీరు బరువు పెరిగిపోయారు.. దీంతో వయసు పైబడినట్లుగా కనిపిస్తున్నారు..’ అన్నారు. ఆ సమయంలో ఈ మాటలు విన్నప్పుడు తొలుత బాధపడ్డా. కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యా.. నలుగురి అంచనాలకు తగినట్లుగా కాకుండా.. నాకోసం నేను మారాలనుకున్నా.. స్వీయ ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టా..’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

ఆత్మవిశ్వాసమే ఆయుధం!

అయితే ఇలాంటి విమర్శలు ప్రస్తుతం చాలామంది మహిళల్ని బాధపెడుతున్నాయని, వీటిని అధిగమించడానికి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలంటోందీ అందాల తార. ‘ఒక్కోసారి ఇలాంటి విమర్శల గురించి ఆలోచిస్తుంటే.. కొంతమంది తాము మనుషులమన్న విషయం మర్చిపోయి ఇలా మాట్లాడుతుంటారేమో అనిపిస్తుంటుంది. ఇలాంటి మాటలు కొన్నిసార్లు నన్ను మరపురానంతగా బాధపెడితే.. మరికొన్నిసార్లు సులభంగా మర్చిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇలాంటి కామెంట్లను అధిగమించడానికి ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం అని నేను నమ్ముతా. ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించగలిగితేనే ఇది మన సొంతమవుతుంది. ఈ క్రమంలో మనలోని ప్రత్యేకతల్ని గుర్తించగలగాలి.. దుస్తులు/మేకప్‌.. ఇలా మన ఎంపికలు కూడా అవతలి వారిని సంతృప్తి పరిచేలా కాకుండా.. మనకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఇలా స్వీయ ప్రేమను పెంచుకున్నప్పుడే ఇలాంటి విమర్శల్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఇన్నేళ్ల కెరీర్‌లో కేవలం బరువు విషయంలోనే కాదు.. మేకప్‌, నేను ఎంచుకునే దుస్తులు, చర్మ ఛాయ పైనా ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతోనే నేను వాటన్నింటినీ అధిగమించగలిగా..’ అంటూ బాడీ షేమింగ్‌ సమస్యల్ని ఎదుర్కొంటోన్న ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపిందీ బాలీవుడ్‌ అందం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్