ప్రేమారా హత్తుకోండి..

పిల్లల్ని ప్రేమగా హత్తుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా... వాళ్లతో దూరంగా మెలగడం, వేరేగా పడుకోబెట్టడం వల్ల అనుబంధం, ఆత్మీయత తగ్గిపోవడమే కాదు.. మానసిక రుగ్మతలు కూడా వస్తాయట! కాబట్టి.. పిల్లల తల నిమురుతాం, వీపుమీద సవరదీస్తాం, భుజం తడతాం, కౌగిలించుకుంటాం.

Published : 11 Feb 2023 00:21 IST

పిల్లల్ని ప్రేమగా హత్తుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా... వాళ్లతో దూరంగా మెలగడం, వేరేగా పడుకోబెట్టడం వల్ల అనుబంధం, ఆత్మీయత తగ్గిపోవడమే కాదు.. మానసిక రుగ్మతలు కూడా వస్తాయట! కాబట్టి..

పిల్లల తల నిమురుతాం, వీపుమీద సవరదీస్తాం, భుజం తడతాం, కౌగిలించుకుంటాం. ఈ లాలన, ప్రేమ చాలా అవసరం. అది శారీరక, మానసిక వృద్ధికి తోడ్పడుతుంది. గర్భంలో ఉన్న బిడ్డకు తల్లి శరీర స్పర్శ, హృదయ స్పందన, ఒంట్లో వేడి అలవాటై ఉంటుంది. అందుకే పుట్టిన వెంటనే కొంతసేపు తల్లి గుండెల మీద పడుకోబెడుతున్నారు. తల్లి స్పర్శతో పాపాయికి స్పందించడం అలవాటవుతుంది. దీన్ని సెన్సరీ మోటార్‌ స్టిమ్యులేషన్‌ అంటారు. అంటే స్పర్శ ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది అన్నమాట. దీంతో ఇరువురి మధ్యా అనుబంధం, భద్రత, కలివిడితనం కలుగుతాయి. స్పృశించడం, కౌగిలించుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయని  అధ్యయనాలు రుజువు చేశాయి. నిమరడం వల్ల ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది. ఈ లవ్‌ హార్మోన్‌ ఆత్మీయత, ఆనందం, తృప్తి, ఊరటలను అందిస్తుంది.

బాధ హుష్‌..

శరీరక బాధల్ని సహజంగా తగ్గించడానికి ఎండార్ఫిన్లు, మార్ఫిన్‌ ఉంటాయి. కింద పడినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడే కాదు కౌగిలించుకున్నప్పుడూ అవి ఉత్పత్తి అవుతాయి. అందుకే విచారంగా ఉన్నప్పుడు హత్తుకుంటే దుఃఖం తగ్గి, భద్రత, భరోసా కలుగుతాయి. ఆనందాన్నిచ్చే డోపమైన్‌, సెరటోనిన్‌ హార్మోన్లూ విడుదలై సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పిల్లలకే కష్టమొచ్చినా అమ్మ దగ్గరికొస్తారు. ఆమె హత్తుకోగానే వారి ఉద్వేగాలు అదుపులోకి వస్తాయి. చిన్నప్పటి నుంచీ వచ్చిన ఆ అలవాటుతో, స్పర్శతో బాధను తగ్గించే, ఉత్తేజపరిచే హార్మోన్లు విడుదలై ఆనందం కలుగుతుంది. ఇదంతా సహజంగా జరిగిపోతుంది.

స్పర్శతో మనోధైర్యం

తల్లి స్పర్శ పిల్లల్లో ధైర్యం, స్థైర్యం, భద్రత కలిగిస్తుంది. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తి చేకూరుస్తుంది. దగ్గరకు తీసుకోవడం ద్వారా మనోధైర్యం పొందడం అలవాటయ్యాక అమ్మానాన్నలను తలచుకున్నా కూడా ఆ అనుభూతి కలుగుతుంది. ఆపై టీచర్‌, ఆత్మీయుల స్పర్శ కూడా ఆ భావనను కలిగించి బంధం బలపడటానికి దారితీస్తుంది. పిల్లలు మాత్రం అందరి దగ్గరా ఆ భావన పొందలేరు. భద్రతాభావం, ఆనందం, మనోధైర్యం దొరికే వారి స్పర్శనే వాళ్లు కోరుకుంటారు. అందుకే వాళ్ల దగ్గరికి వెళ్లాలి, మాట్లాడాలి, స్పృశించాలి అనుకుంటారు. మానవ సంబంధాల మెరుగుదలకు కౌగిలింత కావాలి. పిల్లల పెంపకంలో ఎన్నో మార్పులొచ్చాయి. మునుపటిలా తల్లిదండ్రులు పిల్లల్ని చేరదీయడంలేదు. వస్తువులిస్తున్నారు, చదవమంటూ లక్ష్యాలు నిర్ణయిస్తున్నారు. వాళ్లు ఒత్తిడిలో, కష్టంలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకునుంటే ఊరట పొంది, మళ్లీ మళ్లీ ఆ అనుభూతిని కోరుకొని ఉండేవారు. అది కరవయ్యే మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. అనుబంధాల కంటే శాస్త్ర విజ్ఞానం ముఖ్యం అనుకుంటున్నారు. వ్యక్తులు నచ్చడంలేదు. గాడ్జెట్స్‌తో డోపమైన్‌ విడుదలవుతోంది. దాంతో అవి దూరమైతే దుఃఖం తన్నుకొస్తోంది.

యూరప్‌ దేశాల్లో దీనిపై పలు పరిశోధనలు చేశారు. ఆత్మీయస్పర్శ కరవైతే ప్రవర్తనా లోపాలతోపాటు ఆత్మవిశ్వాసమూ దెబ్బతింటుంది, నిరాశ బారిన పడతారని తేలింది. స్పర్శ నుంచి దూరమవ్వడం వల్లే ఇదంతా! అందుకే చిన్నారులను హత్తుకోండి. ఆ ప్రేమ, ఓదార్పులతో ఆత్మీయత, అనుభూతి కలుగుతాయి. అనుబంధం బలపడుతుంది. చిన్న హగ్‌.. మర్చిపోవద్దు మరి!

- డాక్టర్‌ గౌరీదేవి, సైకియాట్రిస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్