Rakul Preet Singh : అర్థం చేసుకున్నాడు.. అందుకే నచ్చాడు!

అర్థం చేసుకునే వాడు భర్తగా దొరకడం అదృష్టమంటారు.. ఈ విషయంలో తనకంటే అదృష్టవంతులు మరొకరుండరంటోంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఎందుకంటే పెళ్లికి ముందే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను అర్థం చేసుకొని.. తన ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమిచ్చే ఇష్టసఖుడి ప్రేమను తనవి తీరా పొందడం సంతోషంగా ఉందంటోంది.

Published : 19 Jan 2024 12:12 IST

(Photos: Instagram)

అర్థం చేసుకునే వాడు భర్తగా దొరకడం అదృష్టమంటారు.. ఈ విషయంలో తనకంటే అదృష్టవంతులు మరొకరుండరంటోంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఎందుకంటే పెళ్లికి ముందే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను అర్థం చేసుకొని.. తన ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమిచ్చే ఇష్టసఖుడి ప్రేమను తనవి తీరా పొందడం సంతోషంగా ఉందంటోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లిపైనే గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్‌ స్పందన ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిందని చెప్పచ్చు. మరి, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోన్న ఈ ముద్దుల జంట ప్రేమ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..

కెరీర్‌ దారులు కలిపాయి!

తనదైన అందం, అభినయంతో చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది రకుల్‌. పంజాబీ భామే అయినా పలు సినిమాల్లో తెలుగింటి ఆడపడుచులా హావభావాలు పలికిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన పదేళ్ల సినీ కెరీర్‌లో ‘ధృవ’, ‘సరైనోడు’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘మన్మథుడు-2’.. వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించింది రకుల్‌. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

కోల్‌కతాకు చెందిన జాకీ భగ్నానీ నటుడిగా కెరీర్‌ ప్రారంభించాడు. గత కొన్నేళ్లుగా నిర్మాతగా కొనసాగుతోన్న ఈ హ్యాండ్‌సమ్‌.. ‘సరబ్‌జిత్‌’, ‘కూలీ నం.1’, ‘గణపత్‌’.. వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. పలు మ్యూజిక్‌ వీడియోలూ రూపొందించాడు. ఇలా ఒకే రకమైన కెరీర్‌ నేపథ్యాలే తామిద్దరినీ కలిపాయంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది రకుల్‌.

పక్కపక్కనే ఉన్నా..!

లాక్‌డౌన్‌లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. తమ ప్రేమా ఇదే సమయంలో మొదలైందంటోంది రకుల్‌. అయితే అప్పటివరకు ఇరుగుపొరుగు ఇళ్లలోనే ఉన్నా.. ఒకరి కోసం ఒకరు పుట్టామని తెలుసుకోలేకపోయాంటోందీ భామ.

‘నేను, జాకీ ముంబయిలో ఇరుగుపొరుగు ఇళ్లలోనే ఉండేవాళ్లం. కానీ ఇద్దరం కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. హాయ్‌ అంటే హాయ్‌, బాయ్‌ అంటే బాయ్‌ అన్నట్లుగా ఉండే వాళ్లం. కనీసం ఇద్దరి మధ్య స్నేహబంధం ఉందని కూడా చెప్పలేను. అయితే మా ఇద్దరి ఉమ్మడి స్నేహితుల ద్వారానే మా మధ్య స్నేహబంధం చిగురించింది. లాక్‌డౌన్‌ సమయంలో మా స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవాళ్లం. వీలు చిక్కినప్పుడల్లా కలిసి బయటికి వెళ్లే వాళ్లం. అలా స్నేహితులుగా ఉన్న మేము కొన్నాళ్లకే మరింత దగ్గరయ్యాం. ఒకరి అభిరుచులు, ఇష్టాయిష్టాల్ని తెలుసుకోగలిగాం. ఒకరి సౌకర్యాలకు మరొకరం ప్రాధాన్యమివ్వడం ప్రారంభించాం. ఈ క్రమంలోనే ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యాం. త్వరలోనే ఇది ప్రేమని తెలుసుకోగలిగాం. చాలామంది ప్రేమ పుట్టడానికి ఓ సమయం, సందర్భం ఉండాలనుకుంటారు.. కానీ మా ప్రేమ మాత్రం వీటికి అతీతంగా సహజంగానే పుట్టిందని నా భావన!’ అంటోందీ ముద్దుగుమ్మ.

నువ్వు లేక నేను లేను!

ఇలా ఒకరి మనసులో మరొకరున్నారని తెలుసుకున్న రకుల్‌-జాకీ కొన్నేళ్ల పాటు తమ ప్రేమను రహస్యంగా ఉంచారు. కలిసి డిన్నర్‌కు వెళ్లినా, వెకేషన్‌కి వెళ్లినా కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వీళ్ల ప్రేమ గురించి బయటికి పొక్కలేదు. కానీ 2021 అక్టోబర్‌లో స్వయంగా తమను ప్రేమను అధికారికంగా ప్రకటించిందీ జంట. రకుల్‌ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని వెనక వైపు నుంచి దిగిన ఫొటోను పంచుకున్న జాకీ.. ‘నువ్వు పక్కన లేకపోతే రోజు రోజులా గడవదు.. పంచభక్ష్య పరమాన్నాలు కూడా రుచించవు. నా ప్రపంచమే నువ్వు డియర్‌! హ్యాపీ బర్త్‌డే!’ అంటూ పోస్ట్‌ పెట్టాడు. ఇక ఇదే ఫొటోను, పోస్ట్‌ను రకుల్‌ కూడా పంచుకోవడంతో వీళ్ల ప్రేమ విషయం అధికారికంగా బహిర్గతమైంది. ఇక అప్పట్నుంచి ఎక్కడికెళ్లినా, సందర్భమేదైనా కలిసే కెమెరా కంటికి చిక్కుతోందీ అందాల జంట. పుట్టినరోజులైనా, పండగలైనా కలిసే సెలబ్రేట్‌ చేసుకుంటూ.. తమ ప్రేమబంధాన్ని మరింత దృఢం చేసుకుంటున్నారీ క్యూట్‌ కపుల్‌. తద్వారా ఈతరం జంటలకు ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు.

ఏకాంత వేళ.. అలా!

ఇలా గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్‌ పెళ్లెప్పుడా అని అభిమానుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. అయితే వీరి వివాహం ఫిబ్రవరి చివరి వారంలో, అదీ రకుల్‌కు బాగా నచ్చిన గోవా బీచ్‌లో జరగబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇన్నాళ్లూ మౌనం వహించిన రకుల్‌.. తాజాగా పెళ్లిపై తన మనసులోని మాటను పంచుకుంది.
‘నేను చాలా కాలం నుంచి సింగిల్‌గా కాలం గడిపాను. అయితే ఈ రోజుల్లో ప్రేమ, భాగస్వామి ఉండడమనేవి కామన్‌. నేను చాలా స్వతంత్ర భావాలున్న అమ్మాయిని. వీలు చిక్కినప్పుడల్లా జాకీతో గడపాలని, మాట్లాడాలని అనుకునేదాన్ని. తనూ ఇదే ఇండస్ట్రీకి చెందిన వాడు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నాడు. ఇలా అతనిచ్చే ఎమోషనల్‌ సపోర్ట్‌ వల్లే కెరీర్‌లో మరింత చురుగ్గా ముందుకు సాగగలుగుతున్నా. ఇద్దరిదీ ఒకే రంగమైనా ఎప్పుడూ పని గురించే మాట్లాడుకోము. ఇటు వృత్తిని ఇష్టపడతాం.. అటు ఫిట్‌నెస్‌పైనా ఆసక్తి చూపుతాం. అందుకే ఇద్దరం కలిసినప్పుడు వ్యాయామాలు, ఆహారం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి అంశాలపైనే చర్చిస్తుంటాం. చాలా సందర్భాల్లో రోజుకు 12 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అయినా ఒకరి కోసం ఒకరం కనీసం గంటైనా సమయం కేటాయిస్తాం. ఈ సమయంలో వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికే ప్రాధాన్యమిస్తాం. కలిసి పనులు చేసుకోవడానికి ఆసక్తి చూపుతాం.. ఇవే కదా అనుబంధాన్ని దృఢం చేసేవి..’ అంటోంది రకుల్‌. ఇలా తమ పెళ్లెప్పుడని సూటిగా సమాధానం చెప్పకపోయినా.. ఇన్నేళ్ల ప్రేమ బంధంలో మరింత దగ్గరయ్యామని, త్వరలోనే తమ ప్రేమకు పెళ్లితో పీటముడి వేయనున్నామంటూ తన మాటలతో పరోక్షంగా చెప్పిందీ అందాల తార. దీంతో వీరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్