Relationship Tips: ఆ కోరికలు పంచుకోలేకపోతున్నారా?

భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయంలో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ బాగున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే కొంతమంది దంపతులు తమ మనసులోని కోరికలు, నిర్ణయాల్ని తమ భాగస్వామితో....

Published : 01 Jun 2023 12:59 IST

భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయంలో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ బాగున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే కొంతమంది దంపతులు తమ మనసులోని కోరికలు, నిర్ణయాల్ని తమ భాగస్వామితో నిర్మొహమాటంగా పంచుకోలేకపోతారు. దీనివల్ల సందర్భమొచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక గొడవలొచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ మొహమాటానికి తమ మనసులో ఉన్న అభద్రతా భావం, పలు స్వీయ సందేహాలే కారణమంటున్నారు నిపుణులు. వాటిని నివృత్తి చేసుకుంటేనే ఇద్దరి మధ్య దాపరికాల్లేకుండా అనుబంధాన్ని పెంచుకోవచ్చంటున్నారు. మరి చాలామంది దంపతులు తమ మనసులోని భావాల్ని భాగస్వామితో పంచుకోకపోవడానికి కారణాలేంటి? తెలుసుకుందాం రండి..

తిరస్కరిస్తారేమో..!

వ్యక్తిగతంగానైనా, కెరీర్‌ పరంగానైనా.. మన కోరికలు, మనసులో ఉన్న ఆలోచనల గురించి భాగస్వామితో పంచుకునే ముందు మనలో ఒక సందేహం కలుగుతుంది. వారెలా స్పందిస్తారోనని! వాళ్లు తిరస్కరిస్తారేమో, ఇద్దరి మధ్య గొడవలవుతాయేమో.. అన్న భయాలూ పుడతాయి. ఇవి అసలు విషయాన్ని అవతలి వారితో పంచుకోకుండా చేస్తాయి. దాంతో కోరి గొడవలు కొని తెచ్చుకునే బదులు మౌనం వహించడం ఇద్దరికీ మంచిది కదా అనుకుంటారు. అయితే ఇలా మనసులోని కోరికల్ని చంపేయడం, ప్రతి విషయంలో రాజీ పడుతూ మిమ్మల్ని మీరు మోసం చేసుకునే బదులు.. మీ ఆలోచనల్ని నిర్మొహమాటంగా బయటపెట్టడమే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని బట్టి అడుగు ముందుకు వేయాలా? భాగస్వామిని ఒప్పించాలా? కుదరని పక్షంలో రాజీ పడాలా? అన్న విషయాల్లో స్పష్టత వస్తుంది. అంతేకానీ.. ఏ ప్రయత్నమూ చేయకుండా కోరికల్ని అణచుకోవడం వల్ల నష్టపోయేది మీరే అని గుర్తుపెట్టుకోండి.

ఆ నమ్మకం లేదా?

కొంతమంది తమ మనసులోని భావాలు/కోరికలు/ఆలోచనల్ని.. సరిగ్గా వివరించలేకపోతారు.. అవతలి వారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతారు. ఇది తప్పుడు సంభాషణకు దారితీయచ్చు. తద్వారా భాగస్వామికి మీపై చెడు అభిప్రాయం కలిగే ప్రమాదమూ లేకపోలేదు. ఈ సమస్యంతా ఎందుకు అనుకునే వారు కూడా తమ ఆలోచనల్ని మనసులోనే దాచుకుంటారంటున్నారు నిపుణులు. అయితే ఇలా మీపై మీకు నమ్మకం లేకపోవడం వల్ల కూడా మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తద్వారా మీ మనోబలం తగ్గిపోవడంతో పాటు.. ఈ ప్రతికూలతలు మీ ఇద్దరి మధ్యా దూరం పెంచే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ఆయా అంశాల గురించి సరిగ్గా కమ్యూనికేట్‌ చేయలేరనుకునేవారు మీ ఆలోచనల్ని, కోరికల్ని రాతపూర్వకంగా, సందేశాత్మకంగా భాగస్వామికి చేరవేయచ్చు. అంతేకానీ.. వాటిని మీలోనే దాచుకొని బాధపడడం సరికాదు.

ఈసారీ అలాగే జరుగుతుందేమో?

ప్రేమైనా, పెళ్లైనా.. కొన్ని జంటలు విడిపోవడం, ఆపై రెండో వివాహం చేసుకోవడం సహజమే! అయితే మొదటి భాగస్వామి తమ విషయంలో కఠినంగా వ్యవహరించారని, రెండోసారీ అలాగే మీ ఇష్టాయిష్టాలకు వారు విలువ ఇవ్వరని కొంతమంది అనుకుంటుంటారు. ఈ భావన కూడా తమ మనసులోని ఇష్టాల్ని వారితో పంచుకోనివ్వకుండా చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే అందరూ అలాగే ఉండాలన్న నియమం లేదని, రెండోసారి అనుబంధంలోకి అడుగుపెట్టే ముందే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకుంటే ఇలాంటివి తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఏదేమైనా వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారోనన్న విషయం పక్కన పెట్టి అసలు విషయాన్ని వాళ్లతో పంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది.

అహం పనికిరాదు!

ఎవరైనా సరే.. తమ మనసులోని ఆలోచనలు/కోరికల గురించి పంచుకున్నప్పుడే అవతలి వారికి తెలుస్తుంది. అయితే కొంతమంది.. తాము చెప్పకుండానే.. భాగస్వామి తమ ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని నడుచుకోవాలనుకుంటారు. వీటి గురించి తామే స్వయంగా చెబితే అవతలి వారి దృష్టిలో చులకనైపోతామన్న భావన వీరిని వ్యక్తపరచకుండా ఆపుతుంటుంది. ఇక అవతలి వారు వీటి గురించి తెలుసుకోలేకపోతే ఇద్దరి మధ్య గొడవలు షురూ! అందుకే భాగస్వామి విషయంలో అంత అహంభావం పనికి రాదంటున్నారు నిపుణులు. ఈ ప్రవర్తన తగ్గించుకొని నడచుకుంటేనే అనుబంధాన్ని నిలబెట్టుకోవచ్చంటున్నారు.

వింటారో? లేదో?

కొంతమంది తమ భాగస్వామిని చులకనగా చూస్తుంటారు. మాటలు, చేతలతో వేధించడమే పనిగా పెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారితో ఏ ఆలోచన/కోరిక పంచుకోవాలన్న ఆసక్తి ఉండదు. అయితే ఒక్కోసారి ఉండబట్టలేక.. తమ మనసులోని ఆలోచనల్ని బయటపెట్టినా.. వాటిని వినీ విననట్లుగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. చాలామంది తమ మనసులోని కోరికల్ని తమలోనే దాచుకోవడానికీ భాగస్వామిలో ఉన్న ఈ తరహా ప్రవర్తనే కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి వారితో చెప్పి బాధపడడం కంటే.. చెప్పకుండా మనసులో దాచుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంతగా చెప్పాలనిపిస్తే.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మీ ఆలోచనల్ని పంచుకొని తగిన సలహాలు పొందచ్చు.

అయితే ఈ క్రమంలో మీ మనసులోని భావాల్ని పంచుకోలేకపోయినా, భాగస్వామి మీ మనసును అర్థం చేసుకోలేకపోయినా.. సంయమనం పాటించి సర్ది చెప్పడం, అయినా వినకపోతే నిపుణుల్ని సంప్రదించి సరైన సలహాలు తీసుకోవడం మంచిది. తద్వారా మీ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్