టీనేజ్ పిల్లలు మీ మాట వినడం లేదా?

ప్రజ్ఞకు పద్నాలుగేళ్లు. సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా గడుపుతుంటుంది. ఫోన్‌ కాసేపు పక్కన పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టమని తల్లి చెప్తే.. ‘నువ్వేం చెప్పక్కర్లేదు.. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు’ అంటూ బదులిస్తుంటుంది.మొన్నటిదాకా ఖాళీ సమయంలో ఏదో ఒక విషయం నేర్చుకుంటూ సద్వినియోగం.....

Published : 13 May 2022 16:38 IST

ప్రజ్ఞకు పద్నాలుగేళ్లు. సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా గడుపుతుంటుంది. ఫోన్‌ కాసేపు పక్కన పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టమని తల్లి చెప్తే.. ‘నువ్వేం చెప్పక్కర్లేదు.. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు’ అంటూ బదులిస్తుంటుంది.

మొన్నటిదాకా ఖాళీ సమయంలో ఏదో ఒక విషయం నేర్చుకుంటూ సద్వినియోగం చేసుకునే ప్రణవ్‌.. ఈ మధ్య తన ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. దీంతో వాళ్లమ్మ ఇదేంటని అడిగితే.. డౌట్స్‌ క్లారిఫికేషన్‌ అంటూ అబద్ధం చెబుతున్నాడు.

వీళ్లే కాదు.. కౌమార దశలోకి అడుగిడిన పిల్లలు- తమ తల్లిదండ్రులు.. అందులోనూ ముఖ్యంగా అమ్మ మాట అస్సలు వినరని తాజాగా నిర్వహించిన ఓ సర్వే చెబుతోంది. ఇందుకు వాళ్ల మెదడులో జరిగే నాడీ సంబంధిత మార్పులే కారణమని తేల్చింది. తద్వారా తల్లి మినహాయించి కొత్త వ్యక్తులు లేదంటే తెలిసిన వారు చెప్పే మాటలే బాగా తలకెక్కించుకుంటారని వెల్లడించింది. మరి, టీనేజ్‌ పిల్లల గురించి ఇంకా ఈ సర్వే ఏం చెబుతోంది? కౌమార దశలో ఉన్న పిల్లలు తన మాట వినేలా చేసుకోవాలంటే తల్లులు ఏం చేయాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

చిన్న వయసు నుంచి తల్లిదండ్రుల మాటలు శ్రద్ధగా వినే పిల్లలు.. కౌమార దశలోకి ప్రవేశించగానే అన్నీ తమకే తెలుసన్న భావనలోకి వెళ్లిపోతారు. శారీరకంగా, మానసికంగా పరిణతి చెందడం, చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం.. ఇలా దీనికి విభిన్న కారణాలుండచ్చు. అయితే ముఖ్యంగా కౌమార దశలోకి (13 ఏళ్లు దాటిన చిన్నారులు) అడుగుపెట్టిన పిల్లలు తల్లి మాట పెడచెవిన పెడుతూ.. ఇతరుల మాటలపై దృష్టి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు ‘స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 12 అంతకంటే తక్కువ వయసున్న పిల్లలతో పాటు 13 ఏళ్లు దాటిన చిన్నారుల మెదడుపై పరిశోధనలు చేసి ఈ విషయం తేల్చారు.

అందుకే అమ్మ మాట వినరట!

ఇందులో భాగంగా 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు అమ్మ మాటకు చక్కగా ప్రతిస్పందించారని, అదే 13 ఏళ్లు దాటిన పిల్లల్లో ఈ ప్రతిస్పందన తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. టీన్‌ దశలోకి ప్రవేశించిన ఈ చిన్నారులు ఇతర శబ్దాలకు, తెలియని/తెలిసిన వ్యక్తుల వాయిస్‌కు ఎక్కువగా ప్రతిస్పందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇదంతా మెదడులోని నాడీ సంబంధిత ప్రతిస్పందనల ఫలితమే అని.. కౌమార దశలోకి ప్రవేశించకముందు ఈ భావోద్వేగాలు చురుగ్గా ఉంటాయని.. ఆ తర్వాత వాటి యాక్టివ్‌నెస్‌ క్రమంగా తగ్గుతున్నట్లు గమనించారు. ఈ క్రమంలో వీరు అమ్మ మాట కంటే స్నేహితులు - కొత్త వాళ్ల తోడు కోరుకుంటారని, వాళ్లతోనే ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతారని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఒకరు చెబుతున్నారు.

పేరెంట్స్‌ ప్రవర్తన కూడా..!

టీనేజ్‌ దశలోకి అడుగుపెట్టిన పిల్లలు అమ్మ మాట వినకపోవడానికి వాళ్ల మెదడులో జరిగే మార్పులే కాదు.. ఇతర కారణాలు కూడా కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

* చిన్నతనంలో గడిపిన సరదా సమయం పెద్దయ్యే కొద్దీ తగ్గిపోతుంటుంది. ఈ క్రమంలో ఆటలు తగ్గించి చదువుపై దృష్టి పెట్టమని పేరెంట్స్‌/తల్లులు పిల్లలకు చెప్పడం కామన్‌. ఇలా వాళ్లపై పరిమితులు విధించడం వల్ల.. తాము స్వేచ్ఛను కోల్పోయామన్న భావన వాళ్లలో బలపడుతుంది. ఇది మొండి ప్రవర్తనకు దారితీసి.. క్రమంగా పేరెంట్స్‌ మాట వినకుండా చేస్తుందంటున్నారు నిపుణులు.

* కొంతమంది తల్లిదండ్రులు తాము చెప్పినట్లే తమ పిల్లలు వినాలనుకుంటారు. ఈ క్రమంలో పిల్లల మాటలు పట్టించుకోరు.. వారు చెప్పిన విషయాలు వినిపించుకోరు.. దీంతో వాళ్ల మాటలు వినే వారి వైపే వాళ్ల దృష్టి మళ్లుతుంది. అంటే.. ఏ ఫ్రెండ్సో లేదంటే ఇతర బంధువులో అన్నమాట! ఇలా వాళ్ల విషయంలో చూపే నిర్లక్ష్య ధోరణి కూడా వాళ్లు మీ చేయి దాటిపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.

* కౌమార దశలోకి అడుగుపెట్టిన పిల్లలకు నెమ్మదిగా వాళ్ల అందం, శరీరాకృతిపై ఆసక్తి పెరుగుతుంటుంది. ఈ క్రమంలో పార్లర్‌కు వెళ్లి బ్యూటీ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని, కాస్త మోడ్రన్‌గా ఉన్న దుస్తులు ధరించాలని.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ఆసక్తి ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు వీళ్ల కోరికలకు అడ్డుపడుతుంటారు. అలా చేయకూడదు, ఇది వేసుకోకూడదని పరిమితులు పెడుతుంటారు. ఇది కూడా వాళ్లు తల్లి మాట వినకుండా ఇతరుల సలహాలు తీసుకునేందుకు ప్రోత్సహిస్తుంటుందని చెప్పచ్చు.

* ఈ రోజుల్లో చాలామంది తల్లులు కూడా వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు. దాంతో పిల్లలతో గడిపే సమయమే తగ్గిపోతుంది. ఇది క్రమంగా వారు ఇతరుల చెలిమి కోరుకోవడం, వాళ్ల మాటలపై ఆసక్తి చూపడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

* కొంతమంది పేరెంట్స్‌/తల్లులు తమ వృత్తి ఉద్యోగాలు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కలిగే ఒత్తిళ్లను పిల్లలపై రుద్దుతుంటారు.. ఓపిక నశించి వారిపై అరుస్తుంటారు. దీనివల్ల కూడా వారు మీ మాట వినకుండా మొండిగా తయారవుతుంటారు.

ఎలా మార్చుకోవాలి?

కౌమార దశలోకి అడుగుపెట్టిన పిల్లలు తమ మాట వినట్లేదని వాళ్లను అలా వదిలేయడం కాకుండా.. కాస్త ఓపిక వహించి తమ మాట వినేలా చేసుకునే బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

* పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య స్నేహభావం ఉండాలే తప్ప వాళ్లపై అజమాయిషీ చూపకపోవడమే మంచిది. ఈ క్రమంలో వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వాళ్ల మనసులోని మాటలు పంచుకునేలా వాళ్లను ప్రోత్సహించాలి.

* అకారణంగా పిల్లలపై అరవడం, మన కోపాన్ని వాళ్లపై చూపడం వల్ల వాళ్ల మనసు చిన్నబుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా అలా అకస్మాత్తుగా కోప్పడ్డా.. తిరిగి వారిని బుజ్జగించి దగ్గరికి తీసుకోవడం మంచిది.

* పిల్లలకు ఉన్నత భవిష్యత్తును అందించాలంటే.. కౌమార దశే టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పచ్చు. అందుకే ఈ సమయంలో మీ లక్ష్యాలను వాళ్లపై రుద్దడం కాకుండా వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోండి.. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి. తప్పకుండా మీ మాట వినడమే కాదు.. కెరీర్‌లోనూ ఎదుగుతారు.

* పిల్లల్ని ఇతరులతో పోల్చుతూ ప్రతి విషయంలో విసిగించడం వల్ల కూడా వారు మొండిగా తయారై మీ మాట వినరు. కాబట్టి ఈ పోలిక అనే పదాన్ని మర్చిపోయి.. వారిలోని బలహీనతల్ని పక్కన పెట్టి బలాల్ని ప్రోత్సహించాలి. అప్పుడే వారేంటో నిరూపితమవుతుంది.

* ఏ విషయంలోనైనా సరే.. తమకు నచ్చేలా పిల్లల్ని ఉండనివ్వమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాళ్లు తీసుకున్న నిర్ణయాల్లో పొరపాట్లు ఉన్నా, అవి వారికి హాని తలపెట్టేవి అయితే మాత్రం వారికి సర్దిచెప్పి సరిదిద్దడం పేరెంట్స్‌ బాధ్యతే!

ఇక ఇన్ని చేసినా మీ పిల్లలు మారకపోయినా, మీ మాట వినకపోయినా.. మానసిక నిపుణుల్ని సంప్రదించి కారణమేంటో కనుక్కోండి! తగిన చికిత్స/కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్