వాటిని పాజిటివ్‌గా మార్చుకుంటే.. ఆనందాల హరివిల్లు!

కారణమేదైనా కొన్ని ప్రేమకథలు, వైవాహిక బంధాలు కడదాకా సాగకుండా మధ్యలోనే ముగిసిపోతాయి. అలాగని వాటినే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం. అందుకే ఆ అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటే ఇకపై అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా....

Published : 29 Dec 2022 19:44 IST

కారణమేదైనా కొన్ని ప్రేమకథలు, వైవాహిక బంధాలు కడదాకా సాగకుండా మధ్యలోనే ముగిసిపోతాయి. అలాగని వాటినే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం. అందుకే ఆ అనుభవాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటే ఇకపై అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. మరి, ఈ ఏడాది మీరూ బ్రేకప్‌, విడాకులు.. వంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారా? వీటి నుంచి బోలెడన్ని పాఠాలు నేర్చుకున్నారా? అయితే వాటిని పాజిటివ్‌గా మలచుకుంటూ కొత్త ఏడాదికి కొత్త ఉత్సాహంతో స్వాగతం పలికితే జీవితం మరింత హ్యాపీగా ఉంటుందంటున్నారు నిపుణులు.

అంచనాలు.. హద్దు దాటకుండా!

ప్రేమలో, వైవాహిక బంధంలో ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు చాలామంది. భవిష్యత్తులో ఇద్దరం కలిసి అలా ఉండాలి.. ఈ పనులు చేయాలంటూ పెద్ద లిస్టే తయారుచేసుకుంటారు. అయితే అందులో అన్నీ జరగచ్చు.. జరగకపోవచ్చు. అలాగని అంచనాలు మితిమీరినా.. వాటిని చేరుకోలేకపోయామన్న బాధ మనసును మెలిపెడుతుంది. బంధం బీటలు వారినప్పుడు ఈ వేదన రెట్టింపవుతుంది. అందుకే ఈ విషయాన్ని గ్రహించి.. ఇక నుంచైనా మనకు ఏవైతే సాధ్యమో వాటి గురించే ఆలోచించమంటున్నారు నిపుణులు. తద్వారా అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్లుగా చేరుకోవడంతో ఆనందం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. ఇవి ఎలాంటి ప్రతికూలతల నుంచైనా మనల్ని బయటపడేసి సానుకూలత వైపు అడుగులేసేలా చేస్తాయి.

స్నేహితులే థెరపిస్టులు..

నమ్మిన వ్యక్తితో, నచ్చిన మనిషితో విడిపోవడమంటే మాట్లాడుకున్నంత సులభం కాదు. ఆ జ్ఞాపకాల్ని, వాళ్లతో ఉన్న అనుబంధాన్ని చెరిపేయాలంటే కొంత సమయం పడుతుంది. అయితే ఈక్రమంలో మానసికంగా ఒత్తిడికి గురవడం, ఆందోళన చెందడం చాలామందికి అనుభవమే! అలాంటప్పుడు స్నేహితుల్ని మించిన థెరపిస్టులు మరొకరు లేరంటున్నారు నిపుణులు. మనసులోని బాధ మరొకరితో పంచుకుంటేనే ఉపశమనం కలుగుతుందన్నట్లు.. బ్రేకప్‌ వల్ల కలిగిన బాధను, ఆ చేదు అనుభవాల్ని మీలోనే దాచుకోకుండా.. మీ ప్రాణ స్నేహితురాలితో పంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మనసుకు ప్రశాంతత చేకూరడమే కాదు.. వాళ్లిచ్చే సలహాలు మీ మనసుకు మరింత ఊరట కలిగించచ్చు. ఇదే సూత్రాన్ని మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా పాటించారంటే సంతోషమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.. కాదంటారా?!

నిందించుకోవద్దు!

నిజానికి జరిగిన విషయంలో మన తప్పు లేకపోయినా.. మనల్ని మనం నిందించుకోవడం సహజం. ‘ఇదంతా నా అత్యుత్సాహం వల్లే.. ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే.. మా బంధం బ్రేకప్‌ దాకా వచ్చుండేది కాదేమో’నని ఆలోచిస్తుంటారు. నిజానికి ఈ ఆలోచనలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది.. అందులో ఎవరి తప్పు ఎంతుందో స్వీయ పరిశీలన చేసుకోవడం.. ఒకవేళ మీ తప్పుంటే అవతలి వారికి క్షమాపణ చెప్పడం.. లేకపోతే ‘అంతా మన మంచికే జరిగిందేమో’నని సానుకూలంగా స్పందించడం.. ఇవన్నీ ఇకపై మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేవే!

మరుపు మంచిదే!

మతిమరుపును నెగెటివ్‌గా భావిస్తాం కానీ.. కొన్ని సందర్భాల్లో ఇదే మనకు వరంగా పరిణమిస్తుంటుంది. ముఖ్యంగా అనుబంధం నుంచి బయటికి వచ్చినప్పుడు, ప్రేమ విఫలమైనప్పుడు.. ఆ జ్ఞాపకాల్ని మనసులోంచి ఎంత తొలగిద్దామన్నా పదే పదే అవే గుర్తొచ్చి మనసును వేధిస్తుంటాయి. ఒకవేళ భాగస్వామితో కలిసున్నప్పుడు వాళ్లు మనల్ని వేధించినా.. ఆ గడ్డు రోజుల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు. ఇలాంటప్పుడే ‘దేవుడు నాకు మర్చిపోయే శక్తినిస్తే బాగుండు!’ అనిపిస్తుంటుంది. అయితే వాటి నుంచి మనసును మళ్లించాలంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టాలి. ఇప్పటిదాకా మీ భాగస్వామి మాత్రమే ఉన్న మీ ప్రపంచంలోకి.. కెరీర్‌, నైపుణ్యాలు, కుటుంబ సభ్యులు/స్నేహితులకు చోటు కల్పించాలి. తద్వారా గత జ్ఞాపకాల్ని మర్చిపోతూ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. కేవలం ఇప్పుడే కాదు.. ఈ సూత్రాన్ని ఇకపైనా కొనసాగించడం వల్ల సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించచ్చంటున్నారు.

అవకాశమొస్తే.. వదులుకోకండి!

ఒకసారి బ్రేకప్‌ అయినా, భర్తతో విడిపోయినా.. మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించడానికి కొంతమంది మనసు అంత సులభంగా ఒప్పుకోదు. అయితే మరీ అలా నిక్కచ్చిగా ఉండడం మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు.. ప్రతిసారీ గతంలాంటి చేదు జ్ఞాపకాలు ఎదురుకాకపోవచ్చు కూడా! కాబట్టి ఇకపై అంతా మంచే జరుగుతుందన్న పాజిటివిటీని మనసులో నింపుకోవాలి. అప్పుడే ఎదుటి వ్యక్తిలోని సానుకూలతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ అలాంటి మనిషే భవిష్యత్తులో తారసపడి.. మీరే కావాలనుకుంటే మాత్రం వదులుకోవద్దంటున్నారు. ఎందుకంటే మనం ప్రేమించే వారి కంటే మనల్ని ప్రేమించే వారితోనే సుఖంగా, సంతోషంగా ఉండగలం కాబట్టి!

సో.. ప్రేమలో విఫలమైనా, అనుబంధంలో విడిపోయినా.. జీవితంలో ముందుకెళ్లక తప్పదు. కాబట్టి గత చేదు జ్ఞాపకాల్ని ఇక్కడే వదిలేసి.. సానుకూల దృక్పథాన్ని మనసులో నింపుకొన్నామంటే.. కొత్త ఏడాదే కాదు.. జీవితమంతా ఆనందాల హరివిల్లు అవుతుంది..!

హ్యాపీ న్యూ ఇయర్!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్