పలకరిస్తున్నారా..!

ఇంట్లో నానమ్మను ఉపయోగపడని సామానుగా పోలుస్తూ.. పిల్లలు హేళన చేస్తుంటారు. అలాగే భావిస్తూ వాళ్లకు పలకరింపు కరవైతే ఇంటిల్లిపాదీ మధ్య ఉంటూనే వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తారు.

Published : 06 Jun 2024 02:04 IST

ఇంట్లో నానమ్మను ఉపయోగపడని సామానుగా పోలుస్తూ.. పిల్లలు హేళన చేస్తుంటారు. అలాగే భావిస్తూ వాళ్లకు పలకరింపు కరవైతే ఇంటిల్లిపాదీ మధ్య ఉంటూనే వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. గతకాలానికి సంబంధించిన విశేషాలను మనకు అందించే వారధుల్లాంటి పెద్దవాళ్లను సంరక్షించాలి. అప్పుడే మరింత కాలం వాళ్లు సంతోషంగా జీవిస్తారు.

దైనా ప్రత్యేకదినం లేదా నూతన సంవత్సరం అంటూ జీవితంలో తీర్మానాల పట్టిక తయారు చేస్తుంటాం. కెరియర్, ఆరోగ్యం కోసం ఇకపై ఎలా ఉండాలో ప్రణాళికలు వేసుకుంటాం. అలాగే ఇంట్లో వృద్ధుల సంరక్షణ కోసం కూడా మనకు మనం కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. ఇంటిల్లిపాది ఉండగా, ఎవరో ఒకరే కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్లతో ఆత్మీయంగా ఉండాలి. ముఖకవళికలను బట్టి వారి మనసులో ఏముందో గుర్తించడం పిల్లలకూ నేర్పించాలి. శారీరక, మానసికారోగ్యానికి సంబంధించి వారిలో కలిగే చిన్న మార్పును కూడా కనిపెట్టాలి. రోజులో వాళ్ల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని తీర్మానం చేసుకుంటే, ఆ సంభాషణలో వారి మనసు అర్థమవుతుంది. పలకరించి కాసేపు మాట్లాడితే చాలు, వారి మనసులో గూడుకట్టుకున్న ఒంటరితనం క్షణాల్లో దూరమవుతుంది. 

అనుభవాలను చెప్పిస్తే...

రోజు వారి నుంచి ఒక జీవితానుభవాన్ని అడిగి తెలుసుకోవాలని మనకు మనమే తీర్మానం చేసుకోవాలి. కనీసం వారికి తెలిసిన వ్యక్తుల గురించి మాట్లాడమనడం లేదా ఏదైనా పౌరాణికగాథÅ]ను చెప్పమనడం... వంటివన్నీ వారిని మానసికంగా ఉత్తేజితులను చేస్తాయి. ఉత్సాహంగా గతకాలాన్ని నెమరువేసుకుంటారు. అప్పటి అనుభవాలను పంచుకుంటారు. అది వారిని సంతోషంగా ఉంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

కాసేపు నడిస్తే...

ఇంటి వరండా లేదా గార్డెన్‌లో పది నిమిషాలు వారిని నడిపించాలనే తీర్మానం తీసుకోవడం కూడా మంచిది. అది వారికి వ్యాయామం అవుతుంది. చెట్ల మధ్య నడిచేటప్పుడు వాళ్ల మనసంతా తేలికగా మారుతుంది. గతంలో వారు చేపట్టిన బాధ్యతలు, పిల్లల పెంపకంలో వాళ్లు తీసుకున్న జాగ్రత్తలను ప్రశంసిస్తూ, ప్రస్తుతకాలంలో వారు గుర్తించిన మార్పులను చెప్పమనాలి. ఇప్పటి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు సలహాలు, సూచనలూ తీసుకోవాలి. ఇవన్నీ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. తామెందుకూ పనికిరావడంలేదనే ఆత్మన్యూనత ఉంటే దాన్నుంచి బయటపడతారు. 

స్నేహం చేయాలి...

వాళ్లను స్నేహితులుగా స్వీకరించాలి. ప్రేమించాలి. కెరియర్‌ లేదా నిత్యజీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను వారితో పంచుకోవచ్చు. సమస్య వివరించి పరిష్కారాన్ని చెప్పమంటే చాలు. అనుభవంతో వాళ్లందించే సలహాలూ ఎంతో ఉపయోగపడతాయి. జీవితంలో లక్ష్యాలను చేరుకునేలా చేస్తాయి. వారి అనుభవాలు పాఠాలై ముందుకు నడిపిస్తాయి.  వారి నుంచి దొరికే నిస్వార్థమైన ప్రేమతో మనకూ కష్టం వస్తే చెప్పడానికి ఒకరున్నారనే భరోసావస్తుంది.      

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్