Updated : 14/02/2023 12:40 IST

జ్ఞాపకానికి అందమైన రూపం!

మనసు దోచిన వారందించే ప్రేమ కానుకలు.. మూడు ముళ్లు.. ఏడడుగులకు సాక్షిగా నిలిచే పూమాలలు...  ఈమె చేతిలో అపురూపమైన జ్ఞాపకాలుగా మారతాయి. జీవితంలోని  తీపి ఘడియలను శాశ్వతం చేసి భద్రపరచి ఇస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల షెల్లీ.  

నా హృదయాన్ని గెలిచినవారందించిన ఈ గులాబీ నాతోపాటే శాశ్వతంగా ఉండేలా చేయమంటారు కొందరు. ఆ గులాబీని పెండెంట్‌గా మార్చి ఇచ్చినప్పుడు వారి కళ్లలో కనిపించే ఆనందానికి మరేదీ సాటిరాదు. కొందరు తల్లులు తమ బుజ్జాయితో అనుబంధంగా ఉన్న బొడ్డుతాడుని ప్రసవం తర్వాత జీవితాంతం తమవద్ద ఉండాలంటారు. అందమైన జ్ఞాపికగా మార్చి ఇచ్చినప్పుడు ప్రపంచంలోని సంతోషమంతా వారి ముఖంలో కనిపిస్తుంది.

సృజనాత్మకంగా..

రెజిన్‌ ఆర్ట్‌ ద్వారా ఇవి సాధిస్తున్నా. దీనిలోకి అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు. పుట్టింది వైజాగ్‌. నాన్న త్రిమూర్తి కేంద్ర ప్రభుత్వోద్యోగి. అమ్మ గృహిణి. నా చదువంతా అక్కడే పూర్తయ్యింది. సీఏ ఇంటర్‌ చేసి హైదరాబాద్‌లో ఓ ఎంఎన్‌సీలో చేరా. అమెజాన్‌కి మారి, అమెరికా క్లైంట్స్‌కు ఛార్ట్‌ సపోర్ట్‌ చేసేదాన్ని. ఆ తర్వాత బైజూస్‌ నుంచి ఆఫర్‌ వస్తే, శిక్షణలో చేరే సమయానికి మనసుకు నచ్చింది చేయాలి. నాకంటూ ఒక బ్రాండ్‌ను రూపొందించాలి అనిపించింది. అప్పుడే సృజనాత్మకంగా, మరొకరి జ్ఞాపకాన్ని మనం భద్రపరిచి అందించగలిగే రెజిన్‌ ఆర్ట్‌ గురించి తెలిసింది. ఓ అనుభూతిని జ్ఞాపకంగా మార్చి ఇచ్చే ఈ కళ కొత్తగా తోచింది. ఆన్‌లైన్‌లో ఓ విదేశీయురాలి వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకొని సాధన చేసి, 2021లో ‘రెజిన్‌ ఆర్ట్‌ బై షెల్లీ’ ప్రారంభించా. ఇప్పటివరకు వేలమందికి కానుకలు చేసిచ్చా. ఇంట్లోనే స్టూడియో ప్రారంభించి, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ మొదలుపెట్టా. ఏడాదిలోపే వినియోగదారుల సంఖ్య వేలకు పెరిగింది. చాలామంది తమ మనసుకు నచ్చినవారి నుంచి కానుకగా వచ్చిన పూల బొకే, గులాబీలనిచ్చి పెండెంట్‌, బ్రాస్‌లెట్‌, లోలాకులు అంటూ వారికి నచ్చినట్లు చేసిమ్మని అడుగుతారు.పెళ్లిళ్లలో వధూవరులు మార్చుకొనే మాలలను కూడా ఫ్రేమ్స్‌, వాల్‌క్లాక్‌, ఆల్బమ్స్‌, కాఫీ టేబుల్‌లా వారు కోరుకున్నట్లు చేసిస్తా. తాజాదనం దూరం కాకుండా పూలను డ్రై చేయడం, వాటిని జ్ఞాపికగా చేయడం కష్టమైనదే. చిన్న పెండెంట్‌ చేయడానికి రెండువారాలు పడుతుంది. కాఫీ టేబుల్‌ వంటివాటికి కనీసం నెలరోజులకుపైగా కావాలి. ప్రేమికులదినోత్సవం వంటి ప్రత్యేక రోజుల్లో వినియోగదారుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. రోజుకి 12 గంటలకుపైగా పనిచేస్తా. చెప్పిన సమయానికి ఆర్డరు అందించడానికి కృషి చేస్తా. రోజుకి 15 నుంచి 20 వరకు ఆర్డర్లు వస్తుంటాయి. ఒత్తిడి ఉన్నా..అవతలివారి సంతోషాన్ని చూసి నా అలసట మర్చిపోతా. రాశీఖన్నా కానుకగా ఇచ్చిన గులాబీలను ఆ వీరాభిమాని నావద్దకు తీసుకొచ్చి జ్ఞాపికగా మార్చుకున్నారు. అలాగే దిల్లీకి చెందిన ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ అంకుశ్‌ బహుగుణ నుంచి ప్రశంసలు అందుకోవడం మరవలేను. మూన్‌ డస్ట్‌తో ఒకరికి ప్రపోజ్‌ రింగ్‌ చేసిచ్చా. ఇవన్నీ మనసుకెంతో ఆనందాన్నిస్తాయి. అలాగే భవిష్యత్తులో మరికొందరికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి