Second Innings: అలాంటి అమ్మలకు ఉద్యోగావకాశాలు చూపిస్తోంది!

అమ్మయ్యాక పిల్లల బాధ్యత దృష్ట్యా కెరీర్‌లో విరామం తీసుకోవడం లేదంటే వృత్తిఉద్యోగాలు పక్కన పెట్టి పూర్తిగా ఇంటికే పరిమితమవడం చేస్తుంటారు చాలామంది మహిళలు. ఇక పిల్లలు పెద్దయ్యాక తిరిగి ఉద్యోగంలో చేరదామంటే.. సరైన అవకాశాలుండవు.. ఒకవేళ ఉద్యోగమొచ్చినా పనికి తగ్గ వేతనం అందుకోలేరు....

Published : 22 May 2024 12:44 IST

(Photos : Instagram)

అమ్మయ్యాక పిల్లల బాధ్యత దృష్ట్యా కెరీర్‌లో విరామం తీసుకోవడం లేదంటే వృత్తిఉద్యోగాలు పక్కన పెట్టి పూర్తిగా ఇంటికే పరిమితమవడం చేస్తుంటారు చాలామంది మహిళలు. ఇక పిల్లలు పెద్దయ్యాక తిరిగి ఉద్యోగంలో చేరదామంటే.. సరైన అవకాశాలుండవు.. ఒకవేళ ఉద్యోగమొచ్చినా పనికి తగ్గ వేతనం అందుకోలేరు. అయినా మరో అవకాశం లేక మనసుకు సర్దిచెప్పుకొని ఉద్యోగం చేస్తుంటారు కొందరు.. మనసును కష్టపెట్టుకోవడం ఇష్టం లేక ఇంటికే పరిమితమవుతుంటారు మరికొందరు. ఇలాంటి అమ్మలకు కెరీర్‌ దారి చూపుతున్నారు చెన్నైకి చెందిన శాంకరీ సుధార్‌. తానూ అమ్మయ్యాక ఇలాంటి అనుభవాల్నే ఎదుర్కొన్న ఆమె.. తనలాంటి తల్లులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. తన సంస్థ వేదికగా ఇటు ఉద్యోగావకాశాలు చూపుతూనే.. అటు కెరీర్‌ నైపుణ్యాలు నేర్పుతోన్న శాంకరి తన బిజినెస్‌ జర్నీ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

చెన్నైకి చెందిన శాంకరి మద్రాస్‌ ‘యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ’ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఆపై ఇన్ఫోసిస్‌లో సుమారు ఎనిమిదేళ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేశారామె. 2020లో తల్లైన ఆమె ప్రసవానంతర సెలవు తీసుకొని.. ఆపై విధుల్లో చేరారు. అయితే వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ కష్టాలేంటో ఈ సమయంలోనే తనకు అర్థమయ్యాయంటున్నారామె.

వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోలేక..!
‘తల్లయ్యానని ఆనందపడాలో, చంటి బిడ్డను ఇంటి వద్ద వదిలి ఆఫీస్‌కి వెళ్తున్నానని బాధపడాలో ఆ క్షణం నాకు అర్థం కాలేదు. దీనికి తోడు ఇంటి పనులు, ఆఫీస్‌ బాధ్యతలు ఏకకాలంలో సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. అప్పటిదాకా ఈ సమస్యల గురించి ఇతర మహిళల నుంచి వినడమే తప్ప.. తొలిసారి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. ఇక నా వల్ల కాకపోవడంతో ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితమయ్యా. అయినా నాకు సంతృప్తి లేదు. ఎందుకంటే ‘ఇంత చదువు చదివి ఇంట్లో కూర్చోవడమేంటి?’ అనిపించేది ఒక్కోసారి! నా స్నేహితులు, సహోద్యోగులు ప్రమోషన్లు, విదేశాలకు వెళ్లే అవకాశాలు అందుకుంటుంటే.. నేను నాలుగ్గోడలకే పరిమితం కావడం ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఓవైపు బిడ్డను చూసుకుంటూనే.. మరోవైపు నా కెరీర్‌ నైపుణ్యాల్ని మెరుగుపరచుకునే పనిలో పడ్డా. అయితే బిడ్డను ఇంటి వద్ద వదిలి ఆఫీసుకెళ్లి పనిచేసే వెసులుబాటు లేకపోవడంతో.. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించా. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అవకాశాలు తప్ప.. నా నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగం ఒక్కటీ దొరకలేదు. అలాగని మనసు చంపుకొని ఈ ఉద్యోగంలో చేరలేకపోయా. ఇలా నేనొక్కదాన్నే కాదు.. దేశవ్యాప్తంగా చాలామంది తల్లులు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే క్రమంలో ఇలాంటి సవాళ్లెన్నో ఎదుర్కొంటున్నారన్న విషయం నాకు అర్థమైంది. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన నా మనసులో మొదలైంది. ఇదే ‘ఓవర్‌క్వాలిఫైడ్‌ హౌస్‌వైఫ్స్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించేలా చేసింది’ అంటున్నారు శాంకరి.

నైపుణ్యాలకు తగ్గ కెరీర్‌..!
2022లో ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా పిల్లలు, ఇతర బాధ్యతల దృష్ట్యా కెరీర్‌ బ్రేక్‌ తీసుకున్న మహిళలకు.. వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగావకాశాలు చూపిస్తున్నారామె.
‘కొత్తగా తల్లైన మహిళలు ఇటు ఇంటిని, అటు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేసుకోవాలంటే.. ఆఫీస్‌ పనివేళల్లో వారికి కొంత వెసులుబాటు ఉండాలి.. అవసరమైనప్పుడు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలూ సంస్థలు కల్పించాలి. కానీ ఈ సౌకర్యాలు కొరవడటం వల్లే చాలామంది మహిళలు తమకు ఉత్తమ కెరీర్‌ నైపుణ్యాలున్నప్పటికీ.. పిల్లలు పుట్టాక ఉద్యోగాన్ని కొనసాగించలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే మా సంస్థ పని చేస్తోంది. దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 700లకు పైగా సంస్థలతో టై-అప్‌ అయిన మేము.. మహిళల ఆసక్తులు, వారి కెరీర్‌ నైపుణ్యాలకు అనుగుణంగా.. అడ్మినిస్ట్రేషన్‌ దగ్గర్నుంచి ఆపరేషన్స్‌, కంటెంట్ రైటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, వీడియో ఎడిటింగ్‌, డెవలపింగ్‌, టెస్టింగ్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌.. తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాల్ని చూపిస్తున్నాం. ఇందుకోసం ముందుగా మహిళలు మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. మాతో టై-అప్‌ పెట్టుకున్న సంస్థల్లో ఉన్న ఉద్యోగావకాశాల్ని ఎప్పటికప్పుడు మా వెబ్‌సైట్లో పోస్ట్‌ చేస్తుంటాం. మా వద్ద రిజిస్టర్‌ అయిన మహిళల ప్రొఫైల్స్‌ షార్ట్‌లిస్ట్‌ చేసి.. వాటికి అనుగుణంగా కెరీర్‌ నైపుణ్యాలున్న వారికి ఆయా ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సందేశం రూపంలో పంపిస్తాం. తద్వారా వారు నేరుగా ఆ సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..’ అంటూ తమ సంస్థ పనితీరు గురించి చెబుతున్నారు శాంకరి.

ప్రత్యేక శిక్షణ!
రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోయే మహిళలకు వారి నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగావకాశాలు చూపించడమే కాదు.. ఆయా రంగాల్లో వారు మరింత మెరుగుపడడానికి, తద్వారా మంచి ఆఫర్లు అందుకోవడానికి వీలుగా వారి నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నారు శాంకరి.
‘చాలా సంస్థల్లో మహిళలకు తమ పనికి తగ్గ వేతనం దక్కట్లేదనే చెప్పాలి. నైపుణ్యాలున్నా వేతన వ్యత్యాసం వారి కెరీర్‌కు సంకెళ్లు వేస్తుంది. దీనికి తోడు కెరీర్‌ బ్రేక్‌ వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ప్రసవమయ్యాక తిరిగి ఉద్యోగం వెతుక్కునే సమయంలో నేనూ ఈ సమస్యను ఎదుర్కొన్నా. అందుకే మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు వారిలో అటు కెరీర్‌ నైపుణ్యాలు, ఇటు వ్యక్తిగత నైపుణ్యాల్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నా. ఇందుకోసం సంబంధిత నిపుణులతో వెబినార్లు, ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటుచేస్తున్నా. మరోవైపు సాంకేతిక నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సెషన్స్‌ నిర్వహిస్తున్నా. ప్రతి మహిళా ఒక్కో తరగతికి రూ.199 ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది తప్ప మా సంస్థలో చేరిన మహిళలు ఇతర సౌకర్యాలన్నీ ఉచితంగానే పొందచ్చు. ఇలా ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 3,500 మందికి పైగా మహిళలు ఆయా అంశాల్లో నైపుణ్యాభివృద్ధి సాధించగలిగారు.. అలాగే 600 మందికి పైగా తమ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాల్ని సంపాదించి.. తిరిగి కెరీర్‌లో నిలదొక్కుకున్నారు. ఇలా వీరి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకూ ఒక రకమైన సంతృప్తి, సంతోషం కలుగుతున్నాయి..’ అంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్