పెద్ద పండగ అందించే తియ్యటి జ్ఞాపకాలెన్నో..!

ఏ పండగైనా సిటీలో చేసుకోవచ్చు కానీ పెద్ద పండగ మాత్రం పల్లెల్లోనే..! ఎందుకంటే ఆ ఆనందం.. ఆ పండగ హడావిడి అక్కడ కాకపోతే మరెక్కడ కనిపిస్తాయి.. అందుకే ఏడాదికోసారైనా సరే.. ఊరికి వెళ్లాల్సిందే.. అదీ సంక్రాంతి సమయంలో అయితే మరీనూ..! సంక్రాంతి శోభ మాత్రమే...

Published : 15 Jan 2023 13:43 IST

ఏ పండగైనా సిటీలో చేసుకోవచ్చు కానీ పెద్ద పండగ మాత్రం పల్లెల్లోనే..! ఎందుకంటే ఆ ఆనందం.. ఆ పండగ హడావిడి అక్కడ కాకపోతే మరెక్కడ కనిపిస్తాయి.. అందుకే ఏడాదికోసారైనా సరే.. ఊరికి వెళ్లాల్సిందే.. అదీ సంక్రాంతి సమయంలో అయితే మరీనూ..! సంక్రాంతి శోభ మాత్రమే కాదు.. ఊరికెళ్తే ఓ చక్కటి ఆత్మీయ స్పర్శ మనల్ని తాకినట్లుగా అనిపించడం సహజం.

ఆత్మీయ పలకరింపులు..

సిటీలో అంటే ఇరుగుపొరుగిళ్లలో ఎవరుంటున్నారో తెలీని పరిస్థితి.. కానీ ఊళ్లలో అలా కాదు.. అంతా కలిసి మెలిసి ఉంటారు. అందుకే ఊళ్లోకి అడుగుపెట్టగానే పలకరింపులు ప్రారంభమైపోతాయి. 'ఏ అమ్మాయ్.. ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఊరు..' అని ఒకరంటే.. 'బాగా చిక్కిపోయినట్టున్నావే..' అని మరొకరంటారు. 'బాగున్నావా', 'ఇదేనా రావడం..', 'మరీ నల్లపూసైపోయావు..', 'నిన్ను చూడాలని మీ బామ్మ బెంగ పెట్టుకుంది..' అంటూ పలకరించేవాళ్లు ఎంతోమంది.. మరికొందరైతే 'ఎవరి మనవరాలివి/కూతురివి నువ్వు..?' అంటూ మన గురించి తెలుసుకొని మరీ పలకరిస్తారు. ఈ తరహా పలకరింపులు కావాలంటే పల్లెటూరికి వెళ్లాల్సిందే..

సెలబ్రిటీ ట్రీట్‌మెంట్..!

ఇన్ని పలకరింపులు దాటుకొని ఇంటికొస్తామా? రోజూ వీడియో కాల్ లో మాట్లాడుతున్నా సరే.. ఇంట్లో అందరూ ఎలా ఉన్నావ్.. బాగున్నావా? అంటూ అడగడం ప్రారంభిస్తారు. ఎక్కడెక్కడో ఉన్న పిన్నిబాబాయ్‌లు, అత్తమామలు, పెద్దమ్మాపెదనాన్నలు, అక్కాబావలు, అన్నావదినలు.. వీరితో పాటు మిగిలిన కజిన్స్.. అంతా ఒక్కచోట చేరతారు. వీరందరినీ చూసి అమ్మమ్మలు, బామ్మలు ఎంతో ఆనందంగా వారికి కావాల్సిన ప్రతి పిండివంటకాన్ని తయారుచేయడంలో బిజీ అయిపోతారు. మనం లావైనా సరే.. 'చిక్కిపోయావ్' అంటూ అడిగినవి, అడగనివి అన్నీ తినిపించి మనల్ని రెండురోజుల్లో కనీసం రెండు కేజీలు పెరిగేలా చేస్తారంటే నమ్మండి.. బూరెలు, గారెలు, కోడికూర, అరిసెలు, లడ్డూలు ఇలా మనకు నచ్చినవన్నీ అడిగి చేయించుకొని మరీ తినడానికి ఇంతకన్నా ప్రత్యేక సందర్భం మళ్లీ ఎప్పుడొస్తుంది చెప్పండి?

బోలెడన్ని లొకేషన్స్..

కేవలం విందులు వినోదాలేనా? వాట్సాప్ చాటింగ్ పక్కన పెట్టేసి బంధువులందరితో కలిసి ప్రత్యక్షంగా మాట్లాడడం.. వారి విశేషాలు తెలుసుకోవడం.. మన విషయాలను వారితో పంచుకోవడం వల్ల బంధాలు మరింత దృఢమవుతాయి. ఇక కజిన్స్ అందరితో కలిసి పొలాల చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేయడం.. పొలాల్లో కొబ్బరినీళ్లు తాగుతూ.. అక్కడక్కడా ఉండే చెట్ల నుంచి పండ్లు కోసుకొని లాగించడం.. వీటన్నింటికంటే ముఖ్యంగా పల్లెల్లోని ఆ స్వచ్ఛమైన చల్లని గాలిని గుండెల నిండా పీల్చుకోవడం.. వంటివన్నీ ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. సిటీలో మంచి లొకేషన్ దొరికితే చాలు.. క్లిక్‌మనిపించే మన సెల్ఫీ కెమెరాలకు ఊర్లో ప్రతిచోటా పనే.. ఎందుకంటే పల్లెల్లో అందమైన లొకేషన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు.. ప్రతిచోటా పచ్చగా అందంగానే కనిపిస్తుంది. ఎలాగూ పట్టుచీరలు, లంగావోణీలు కట్టుకొని అచ్చమైన పల్లెపడుచుల్లా సిద్ధమవుతాం. కాబట్టి ఏ చక్కటి లొకేషన్ కనిపించినా.. మన ఫోన్ కెమెరాను ఇట్టే క్లిక్‌మనిపించవచ్చు. ఇలా ఒక్కసారి ఊరెళ్లొచ్చామంటే చాలు.. కనీసం రెండునెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేందుకు బోలెడన్ని ఫొటోలు సిద్ధమైపోతాయి.

మధుర జ్ఞాపకాలు..

పల్లెటూరికి వెళ్తున్నామంటే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఎప్పటికప్పుడు జ్ఞాపకమొస్తూనే ఉంటాయి. ఊరంతా తిరిగేటప్పుడు అదిగో ఆ చెట్టు కిందే చిన్నప్పుడు ఆడుకునేవాళ్లం. ఇదిగో ఇక్కడే నారింజ మిఠాయి కొనుక్కు తినేవాళ్లం.. అంటూ ప్రతి జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటాం. మన చిన్నప్పటి నేస్తాలెవరైనా ఉంటే వారిని కూడగట్టుకొని మరీ పండగ ఆనందాన్ని పంచుకుంటాం. ఊళ్లో మనకిష్టమైన ప్రదేశాలన్నింటినీ చూసొస్తాం.. ఇలాంటి తియ్యటి అనుభూతులెన్నిటిలో వెంటబెట్టుకొని సిటీకి బయల్దేరతాం. మనసు వద్దంటోన్నా.. సిటీలో ఉద్యోగాలు, ఇతర కమిట్‌మెంట్స్ తప్పవు కాబట్టి మనకు మనమే నచ్చజెప్పుకొని వచ్చేస్తాం. ఊరి నుంచి మనం వచ్చేసినా.. మన మనసు నుంచి ఊరు వెళ్లిపోదు.. ఆ మధుర జ్ఞాపకాలు మళ్లీ పండక్కి ఊరెళ్లే వరకూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సిటీలో ఎంత బిజీలైఫ్ గడుపుతున్నా.. అప్పుడప్పుడూ మనసు తలుపు తట్టి మనల్ని ఆనందంలో ముంచేస్తాయి...!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్