Sid-Kiara: శాశ్వతంగా ఒకరికొకరం కమిటయ్యాం!

పెళ్లి చేసుకోబోయే వాళ్ల మనసులు కలిసినా.. వాళ్ల గుణగణాలన్నీ కలవకపోవచ్చు. కానీ అటు మనసులతో పాటు ఇటు గుణగణాలు కూడా కలిస్తే.. అదే కియారా-సిద్ధార్థ్‌ కల్యాణ వైభోగం అవుతుంది. ‘ఇలా గుణగణాలన్నీ కలిసిన ఈ జంట ఒక్కటైతే అద్భుతమైన అనుబంధం అవుతుంద’ని....

Published : 08 Feb 2023 18:04 IST

(Photos: Instagram)

పెళ్లి చేసుకోబోయే వాళ్ల మనసులు కలిసినా.. వాళ్ల గుణగణాలన్నీ కలవకపోవచ్చు. కానీ అటు మనసులతో పాటు ఇటు గుణగణాలు కూడా కలిస్తే.. అదే కియారా-సిద్ధార్థ్‌ కల్యాణ వైభోగం అవుతుంది. ‘ఇలా గుణగణాలన్నీ కలిసిన ఈ జంట ఒక్కటైతే అద్భుతమైన అనుబంధం అవుతుంద’ని బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ చెప్పిన జోస్యం తాజాగా ఫలించింది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. తమ మనసులో ప్రేమున్నా, తమ ప్రేమ గురించి అభిమానులు ఎప్పుడు అడిగినా.. మౌనంగా దాటేస్తూ వచ్చిన ఈ బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ తాజాగా రహస్య వివాహం చేసుకొని.. ఆ ఫొటోలతో అభిమానుల ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు. ‘ఇక శాశ్వతంగా ఒకరికొకరం కమిటయ్యాం’ అంటూ మురిసిపోతోన్న ఈ న్యూ కపుల్‌ సీక్రెట్‌ లవ్‌స్టోరీ మీకోసం..!

సిద్ధార్థ్‌ మల్హోత్రా-కియారా అడ్వాణీ.. చూడముచ్చటైన జంట. ఒకరికోసం ఒకరు పుట్టారేమో అన్నట్లుగా ఉండే ఈ జంటను ‘షేర్షా’ చిత్రంలో చూసి.. ఆన్‌స్క్రీన్‌పై వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నిజ జీవితంలోనూ కొనసాగితే ఎంత బాగుంటుందో అనుకున్నారు చాలామంది ఫ్యాన్స్‌. అయితే అభిమానుల ఊహే నిజమైంది. ఈ సినిమా కోసం కలిసి పనిచేసిన వీరి మధ్య స్నేహం పెరిగింది.. అది ప్రేమగా పరిణతి చెందింది. అలాగని ‘షేర్షా’తోనే ఇద్దరికీ పరిచయమా? అంటే.. కాదనే చెప్పాలి. 2018లో విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్’ చిత్ర ర్యాపప్‌ పార్టీలో భాగంగా తొలిసారి కలుసుకున్న ఈ జంట మధ్య స్నేహం క్రమంగా పెరిగింది.

ఆ సాయంత్రం మర్చిపోలేను!

అప్పటివరకు మంచి స్నేహితులుగా ఉన్న సిద్-కియారా.. 2021లో విడుదలైన ‘షేర్షా’ సినిమా తర్వాతే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని చెప్పచ్చు. ఈ క్రమంలో కలిసి పార్టీలకు హాజరైనా, వెకేషన్లకు వెళ్లినా.. తమ అనుబంధం గురించి ఏనాడూ బయటపెట్టలేదు. అభిమానులు తెలుసుకోవాలని ప్రయత్నించినా సున్నితంగా దాటేసే ప్రయత్నం చేశారే తప్ప అస్సలు పెదవి విప్పలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇద్దరం ప్రేమలో ఉన్నామన్న విషయం చెప్పకనే చెప్పిందీ ముద్దుల జంట. ఈ క్రమంలోనే ఓసారి ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు హాజరైన కియారాను కరణ్‌.. ‘కియారా.. నువ్వు ప్రేమలో ఉన్నావని నేనంటాను.. దీన్ని నువ్వు తిరస్కరిస్తావా?’ అని అడిగారు. దీనికి బదులుగా.. ‘తిరస్కరించను.. అలాగని అంగీకరించను..!’ అంది కియారా. ‘మరి, మీరిద్దరూ మంచి స్నేహితులా?’ అనడిగితే.. ‘అంతకంటే ఎక్కువ.. లస్ట్‌ స్టోరీస్‌ ర్యాపప్‌ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం.. అది క్యాజువల్‌గానే అయినా ఆ రోజంతా ఎంతో సరదాగా గడిచిపోయింది.. అందుకే ఆ సాయంత్రాన్ని మాత్రం మర్చిపోలేను..’ అంటూ ముసిముసిగా నవ్వేసిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఇలా తన బాయ్‌ఫ్రెండ్‌ పేరు బయటికి చెప్పకుండానే తాను ప్రేమలో ఉన్నానన్న రహస్యం చెప్పేసిందీ క్యూటీ.

తనలో నాకు నచ్చనిది అదే!

ఇలా కియారానే కాదు.. సిద్ధార్థ్‌ కూడా కియారా గురించి కొన్ని ఆసక్తికర విశేషాల్ని ఓ సందర్భంలో బయటపెట్టాడు. అది కూడా ప్రేయసిగా కాకుండా.. ‘షేర్షా’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తన సహ నటిగా ఆమెలో తనకు నచ్చిన, నచ్చని విషయాల గురించి ఇలా పంచుకున్నాడు. ‘తను నాకు ఆన్‌స్క్రీన్‌ కంటే ఆఫ్‌స్క్రీన్‌లోనే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే తెర వెనుక తను చాలా సింపుల్‌గా ఉంటుంది. తనలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం నన్ను ఆకట్టుకుంటుంది. నేనూ తెర వెనుక ఇలాగే ఉంటా. సో.. ఈ విషయంలో మా ఇద్దరి గుణగణాలు ఇంచుమించు ఒక్కటే! ఇక నచ్చనిదంటే.. తాను నటించిన సినిమాల్లోని పాత్రలు. ఎందుకంటే ఆ పాత్రలన్నీ బాధతో కూడుకున్నవే! అన్నింట్లోనూ ఏడుపు సీన్లే కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు ఆమె కళ్లలో నీళ్లు తిరగడం గమనించచ్చు..’ అంటూ తన ప్రేయసి బాధపడడం తాను చూడలేనని చెప్పకనే చెప్పాడీ హ్యాండ్‌సమ్‌. ఇలా తమ ప్రేమ గురించి ఇద్దరూ పరోక్షంగా చెప్పినా.. పార్టీలు/వెకేషన్లలో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టినా.. తమ ప్రేమ గురించి రహస్యంగా దాచారే తప్ప ఏనాడూ పెదవి విప్పలేదు.

ఆ మూడూ కలిశాయి!

ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లైనా.. వధూవరుల మనసులు కలిసినా.. వ్యక్తిగత గుణగణాల్లో మాత్రం కొన్ని తేడాలుంటాయి. కానీ సిద్ధార్థ్‌-కియారాల విషయానికొస్తే.. వీళ్లిద్దరి గుణగణాలన్నీ కలిశాయని చెబుతున్నారు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌. ఈ ముద్దుల జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో.. వీళ్ల గురించి ఏళ్ల క్రితం తనకు కలిగిన అభిప్రాయాన్ని ఇన్‌స్టా ద్వారా బయటపెట్టారు కరణ్.

‘సిద్‌ను నేను సుమారు పదిహేనేళ్ల క్రితం కలిశాను. తను చాలా సైలెంట్‌, సున్నిత మనస్కుడు, బలమైన వ్యక్తి. కియారాను కూడా కొన్నేళ్ల క్రితం కలిశాను. తనలోనూ ఈ మూడు గుణగణాలు కనిపించాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ సందర్భంలో కలుసుకున్నారు.. అది చూసి నేను చాలా సంతోషపడ్డా. ఒకే గుణగణాలు, ఒకే రకమైన మనస్తత్వాలున్న వీళ్లిద్దరూ ఒక్కటైతే.. అది అత్యద్భుతమైన ప్రేమకథ అవుతుంది.. ఒక దృఢమైన అనుబంధంగా మారుతుంది అని మనసులో అనుకున్నా. అలా అప్పుడు నా మనసులోని మాటలు ఇప్పుడు నిజమయ్యాయి..’ అంటూ ఈ జంట పెళ్లి ఫొటోను పోస్ట్ చేశాడీ బాలీవుడ్‌ నిర్మాత. సిద్-కియారా పరిణయ వేళ కరణ్‌ పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కలీరాలు చెప్పే ప్రేమకథ!

క్యాజువల్‌నే కాదు.. పెళ్లి దుస్తుల్లోనూ చూడముచ్చటగా కనిపించారు సిద్ధార్థ్‌-కియారా జంట. సిద్ధార్థ్‌ ఐవరీ-గోల్డెన్‌ షేర్వాణీలో ముస్తాబవగా.. అందుకు పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయిందీ కొత్త పెళ్లికూతురు. మనీష్‌ మల్హోత్రా రూపొందించిన బేబీ పింక్‌ లెహెంగాలో ముస్తాబైన ఈ ముద్దుగుమ్మ.. వజ్రాలు-పచ్చలు పొదిగిన భారీ ఆభరణాలు ధరించింది. ఇక కియారా ధరించిన కలీరాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాటిని తాను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. నక్షత్రాలు, చంద్రుడు, ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలు, సీతాకోకచిలుకలు.. వంటి ఆకృతుల్లో రూపుదిద్దుకున్న ఈ కలీరా హ్యాంగింగ్స్‌పై సిద్ధార్థ్‌ పెట్‌ డాగ్‌, ఇద్దరికీ నచ్చిన పర్యటక ప్రదేశం.. వంటి నమూనాల్ని కూడా గమనించచ్చు. ఇలా వెడ్డింగ్‌ జ్యుయలరీ యాక్సెసరీస్‌తో తన ఇష్టసఖుడిపై తన మనసులో ఉన్న అమితమైన ప్రేమను బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. ‘శాశ్వతంగా ఒకరికొకరం కమిటయ్యాం..’ అంటూ తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారీ లవ్‌బర్డ్స్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్