Love Signs: అది ప్రేమా..? స్నేహమా?

ప్రేమ పెదవి దాటదంటారు.. నచ్చిన వాళ్లు ఎదురుగా ఉంటే చేతలతోనే తమ మనసులోని భావాల్ని పలికిస్తుంటారు.. అయితే ఒక్కోసారి అవతలి వాళ్ల భావాలు కూడా మనల్ని కన్‌ఫ్యూజ్‌ చేసేస్తుంటాయి.

Published : 03 Aug 2023 12:32 IST

ప్రేమ పెదవి దాటదంటారు.. నచ్చిన వాళ్లు ఎదురుగా ఉంటే చేతలతోనే తమ మనసులోని భావాల్ని పలికిస్తుంటారు.. అయితే ఒక్కోసారి అవతలి వాళ్ల భావాలు కూడా మనల్ని కన్‌ఫ్యూజ్‌ చేసేస్తుంటాయి. అసలు వాళ్లు నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదా నటిస్తున్నారా? అన్న సందిగ్ధంలో పడేస్తుంటాయి. నిజానికి ఈ అయోమయం నుంచి బయటపడి.. వాళ్లకు మీపై ఉన్నది నిజమైన ప్రేమేనా? లేదంటే స్నేహమేనా? అన్నది తెలియాలంటే.. వాళ్ల ప్రవర్తనను సునిశితంగా గమనించాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఈ రోజుల్లో సోషల్‌ మీడియా ప్రేమలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో మాటలు మార్చుకుంటూ, ఇన్‌స్టాలో ఫొటోలు చూసుకుంటూ దగ్గరైపోతున్నారు కొందరు. ప్రేమ కోసం ప్రాంతాలే కాదు.. సరిహద్దులూ దాటేస్తున్నారు మరికొందరు. అయితే అవతలి వాళ్లు ఎలాంటి వారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో.. తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేయడం, ముక్కూ-మొహం చూసుకోకుండా ప్రేమించుకోవడం వల్ల మోసపోయే ప్రమాదమే ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి దూరపు ప్రేమల కంటే.. అవతలి వాళ్ల ప్రవర్తనలో కనిపించే కొన్ని మంచి లక్షణాల ద్వారా వాళ్ల ప్రేమ గురించి ఒక అంచనాకు రావచ్చంటున్నారు.

మీపై ప్రేమ.. ఇలా!

మిమ్మల్ని మీరుగా ఇష్టపడే వారు.. పది మందిలో ఉన్నా మిమ్మల్ని ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తుంటారు. మీకిచ్చే గౌరవమర్యాదలు, మీ విషయంలో తీసుకునే శ్రద్ధ, జాగ్రత్త.. వంటివన్నీ ఇతరుల కంటే ఎక్కువగా మీపై చూపడం గుర్తించచ్చు.

మీరు ఏది మాట్లాడినా ఆసక్తిగా వినడం, మీ ఇష్టాయిష్టాల్ని, ఆసక్తుల గురించి తెలుసుకోవడానికి ఆరాటపడడం వారిలో గమనించచ్చు. తద్వారా మీ గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వారిలా ప్రయత్నిస్తుంటారని చెబుతున్నారు నిపుణులు.

మీరు అక్కడ ఉన్నా, లేకపోయినా.. ప్రతి విషయంలో మీ అభిప్రాయం తెలుసుకోవడానికి, మీ మాటలకు విలువివ్వడానికి ఆరాటపడుతుంటారు.

ఏదైనా టాపిక్‌ గురించి మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా, వారి మాటలు మీకు ఇబ్బంది కలిగించినా.. ఆ అంశాన్ని అక్కడితో కట్‌ చేస్తుంటారు. ఇలా మీకు సౌకర్యాన్ని అందించడమే కాదు.. మీ మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరిగేందుకు, తద్వారా మీ అనుబంధం పాజిటివ్‌గా ముందుకు సాగేందుకు వారిలా ప్రయత్నిస్తుంటారట!

నిజమైన ప్రేమంటే నమ్మకం. మీరంటే ఇష్టపడే వారు మీ విషయంలో ఇలాంటి నమ్మకాన్నే ప్రదర్శిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తి మీతో ప్రేమగా మాట్లాడుతున్నట్లయితే.. మీరు తప్పు చేయరన్న భావనతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేయడం, తిరిగి మీతో ఎప్పటిలాగే కలిసిపోవడం.. వంటి మంచి లక్షణాలు వారిలో గమనించచ్చు.

వాళ్లెక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా.. మీరు వాళ్ల పక్కనే ఉండాలని కోరుకుంటారు. నడకైనా, కాఫీకైనా, సినిమాకైనా.. మీరు సరేనంటే ఇక వారి ఆనందానికి అవధులుండవు.. ఇలా వాళ్లకున్న ఖాళీ సమయంలో మీతో ఎక్కువ టైమ్‌ గడపడానికి ఆసక్తి చూపుతుంటారు.

ప్రేమ పుట్టేది ఇద్దరు వ్యక్తుల మధ్యే అయినా.. కలిపేది రెండు కుటుంబాల్ని! కాబట్టి.. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారు.. ఆ ఇష్టాన్ని మీపై చూపడమే కాదు.. మిమ్మల్ని వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి.. తద్వారా మీ అనుబంధాన్ని మరో మెట్టెక్కించడానికి ఆరాటపడుతుంటారు.

మీతో బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకునే వారు.. వర్తమానం కంటే భవిష్యత్ ప్రణాళికలు, మీ ఆలోచనలకు అధిక ప్రాధాన్యమిస్తుంటారని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ భవిష్యత్‌ లక్ష్యాల గురించి తెలుసుకోవడం.. ఈ క్రమంలో మిమ్మల్ని ప్రోత్సహించడం; అలాగే వారి ఆలోచనల్ని మీతో పంచుకోవడం.. ఇలా వారి జీవితంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం కల్పిస్తారు.

మిమ్మల్ని మీరుగా ఇష్టపడే వారు మీ సంతోషాన్ని పంచుకోవడమే కాదు.. బాధల్లోనూ తోడుగా నిలుస్తుంటారు. ఈ క్రమంలో మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి ఆర్థికంగా, మానసికంగా, ఎమోషనల్‌గా.. ఇలా అన్ని రకాలుగా సహాయపడుతుంటారు.

గుడ్డిగా నమ్మేయకుండా..!

అయితే ఎదుటివారిలో కనిపించే ఇలాంటి సానుకూల ప్రవర్తన.. వారి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచినా.. అందరి విషయంలోనూ ఈ లక్షణాలు వర్తిస్తాయని చెప్పలేం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది తమకు నచ్చిన వారితో ముందు ఇలా తియ్యగా మాట్లాడడం, సత్ప్రవర్తన కనబరచడం చేసినా.. ఆ తర్వాత వారి మోసపూరిత ధోరణి బయటపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తనను కొంతవరకు పరిగణనలోకి తీసుకున్నా.. అవతలి వారితో అన్ని విషయాలు మాట్లాడడం, వారి గురించి లోతుగా తెలుసుకొని మంచివాళ్లు అని ఓ స్పష్టమైన నిర్ణయానికి రావడం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ జీవితాంతం కలిసుంటామన్న నమ్మకం, భరోసా కలిగినప్పుడే ప్రేమను మరో మెట్టెక్కించడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రేమలే జీవితాంతం శాశ్వతంగా నిలిచిపోతాయని, అందమైన అనుభూతుల్ని అందిస్తాయని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్