Relationship Tips: మీ భాగస్వామి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారా?

దంపతులన్నాక సవాలక్ష సమస్యలుంటాయి. ఈ క్షణం గొడవపడితే, మరుక్షణం తిరిగి కలిసిపోతారు. ఇద్దరి మధ్య ఇలాంటి కమిట్‌మెంట్‌ ఉంటేనే ఆ బంధం శాశ్వతమవుతుంది. అయితే కొంతమంది తమ భాగస్వామిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ మాటలు, చేతలతో వారి......

Published : 22 Jul 2022 17:28 IST

దంపతులన్నాక సవాలక్ష సమస్యలుంటాయి. ఈ క్షణం గొడవపడితే, మరుక్షణం తిరిగి కలిసిపోతారు. ఇద్దరి మధ్య ఇలాంటి కమిట్‌మెంట్‌ ఉంటేనే ఆ బంధం శాశ్వతమవుతుంది. అయితే కొంతమంది తమ భాగస్వామిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ మాటలు, చేతలతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇదే నిత్యం కొనసాగితే మాత్రం దాంపత్య బంధంలో పూడ్చలేని అగాథం ఏర్పడుతుంది. పరిస్థితి అంతదాకా రాకముందే జాగ్రత్తపడమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. భాగస్వామి మీతో మసలుకునే విధానాన్ని బట్టే వారు మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే పనులేమైనా చేస్తున్నారా అనేది పసిగట్టవచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

మీ నిర్ణయం.. బేఖాతరు!

సమస్యల్ని పంచుకోవడమే కాదు.. ఏ నిర్ణయమైనా ఆలుమగలిద్దరూ కలిసి తీసుకున్నప్పుడే అది ఫలప్రదం అవుతుందంటుంటారు పెద్దలు. అయితే కొంతమందికి ఇవేవీ పట్టవు. విషయమేదైనా సరే.. భాగస్వామి ఆలోచనలు, వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా.. కనీసం వారి మనసులో ఏముందో తెలుసుకోకుండా.. తమకు తామే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. పైగా వారి తుది నిర్ణయం కూడా అవతలి వారికి చెప్పరు. పోనీ కల్పించుకొని మీరు మీ నిర్ణయం చెప్పినా.. ఏమీ పట్టనట్లు మధ్యలోనే మాటలకు అంతరాయం కలిగించడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల మీరు ఉన్నా లేనట్లేనన్న భావన మీ మదిలో మొదలవుతుంది. పైగా ఈ విషయం మూడో వ్యక్తికి తెలిస్తే.. అవమాన భారంతో కుంగిపోయేది కూడా మీరే! ఇదే క్రమంగా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.

తప్పు వాళ్లదైనా.. ‘సారీ’ మీదేనా?!

సాధారణంగా తప్పు చేసిన వాళ్లు క్షమాపణ చెప్పి.. అవతలి వారిని మన్నించమని కోరడం పద్ధతి. కానీ మీరంటే లెక్క చేయని మీ భాగస్వామి మాత్రం ఈ విషయంలోనూ తనదే పైచేయి కావాలని ఆలోచిస్తుంటారు. గొడవ పడ్డా, చిన్న పొరపాటు దొర్లినా, తప్పు మీది కాకపోయినా సరే.. మీ నుంచే క్షమాపణ ఆశిస్తుంటారు. కూర బాలేదనో, మీరు అందంగా రడీ కాలేదనో, సమయానికి ఆఫీస్‌ నుంచి ఇంటికి రాలేదనో.. ఇలా ప్రతి చిన్న విషయానికీ చిర్రుబుర్రులాడడం.. దాంతో మీరు ఓ చిన్న సారీ చెప్పగానే.. ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందడం.. ఇలాంటి స్వార్థపూరిత లక్షణాలతో మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇదిలాగే కొనసాగితే.. ఒకానొక దశలో అవతలి వారే కరక్టేమో, తమదే తప్పేమో అన్న ప్రతికూల ఆలోచనల్లోకి మీరు కూరుకుపోయే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

ప్రేమ కాదు.. భయం!

భార్యాభర్తలిద్దరూ వీలు కుదుర్చుకొని ఎంత ఎక్కువ సమయం గడిపితే వారి అనుబంధం అంతగా బలపడుతుంది. అయితే ఈ క్రమంలో ఎవరైనా తన భాగస్వామితో ప్రేమగా దగ్గరవ్వాలని చూస్తుంటారు. ఇదే ఒకరిపై ఒకరికి ఆసక్తిని, ఆప్యాయతను పెంచుతుంటుంది. అయితే కొంతమంది మాత్రం తమ భాగస్వామిని తమ మాటలు, చేతలతో భయపెట్టాలని చూస్తుంటారు. కలిసి కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామనుకుంటే.. వారేం మాట్లాడినా తప్పు పడుతుంటారు.. ద్వంద్వార్థాలు వెతుకుతుంటారు. నిజానికి ఇలాంటి వాళ్లతో మరోసారి సమయం గడపాలన్న ఆసక్తి కూడా అడుగంటిపోతుంది. ఇది ఇద్దరి మధ్య అగాథం సృష్టించడంతో పాటు, నెమ్మదిగా మీ ఆత్మగౌరవాన్నీ దెబ్బతీస్తుంది.

నచ్చినవీ చేయలేకపోతుంటే..!

ఈ కాలపు జంటలు పెళ్లైనా.. తమ భాగస్వామిని నొప్పించనంత వరకు వారి కోసం తమ అలవాట్లు, అభిరుచులు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆహారపుటలవాట్ల దగ్గర్నుంచి, వేసుకునే దుస్తుల దాకా తమకు నచ్చిన వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో భాగస్వామి అడ్డు చెప్పనంతవరకు ఎలాంటి గొడవా ఉండదు. అయితే ఇందుకు భిన్నంగా ఉండే వారూ లేకపోలేదు. అంటే.. ఎదుటివారు ఏ దుస్తులు ధరించినా ఏదో ఒక వంక పెట్టడం, స్నేహితులతో మాట్లాడినా తప్పుబట్టడం, ఏం చేసినా ప్రశ్నించడం-ఉచిత సలహాలివ్వడం.. ఇలాంటి లక్షణాలతో మీ మనసు మీద దెబ్బకొట్టాలని చూస్తుంటారు.


పరిష్కారాలూ ఉన్నాయ్!

ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం ఉన్నట్లే.. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే మీ భాగస్వామినీ మార్చుకునే చిట్కాలు కొన్నున్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీ భాగస్వామి మీతో ప్రవర్తించే ఈ లక్షణాల్ని పసిగట్టి వారితో కాస్త ఓపిగ్గా మెలిగితే.. ఫలితం సానుకూలంగా ఉంటుందంటున్నారు.

ఏ సమస్యకైనా మాటే పరిష్కారం అంటుంటారు. కాబట్టి మీ భాగస్వామి మీతో ఎందుకలా ప్రవర్తిస్తున్నారో ముందు తెలుసుకోండి. మీ పట్ల వాళ్లకున్న ప్రతికూల భావనలు వారి నోటితోనే చెప్పనివ్వండి. ఒకవేళ అందులో మీరు మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోండి. అలాగే వారినీ మారమని, ఇది తమ అనుబంధానికెంతో శ్రేయస్కరమని చెబితే వారు తప్పకుండా వింటారు.

అవతలి వారు ఎంత చేసినా.. వారిపై నిష్కల్మషమైన ప్రేమను చూపిస్తుంటారు కొందరు. అయితే ఈసారి మీ ప్రేమను ఓ చిన్న లేఖ, పర్సనల్‌ నోట్‌ రూపంలో వారికి తెలియజేయండి. వారి ప్రవర్తన వల్ల మీరెంత బాధపడుతున్నారో.. అయినా మీరు మౌనం వహిస్తూ ఓపిగ్గా ఉంటున్నారో.. వాళ్లను ఎంతలా ఇష్టపడుతున్నారో చెబుతూ మీ మనసును విప్పండి.. ఫలితం ఉండచ్చు.

ఎప్పటికైనా ఓపికే మనల్ని కాపాడుతుందంటుంటారు. నిజానికి ఇదే ఒక దశలో వాళ్ల ప్రవర్తనేంటో వాళ్లకు అర్థమయ్యేలా చేస్తుంది. తప్పొప్పులు గ్రహించేలా చేస్తుంది. దీనివల్ల కూడా వారు మారే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

లైంగిక జీవితం కూడా భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల్ని దూరం చేసి.. వారిని దగ్గర చేస్తుందంటారు నిపుణులు. అందుకే మీ భాగస్వామిని మార్చుకోవడానికి దీన్నో మార్గంగా మలచుకోవడంలో తప్పు లేదంటున్నారు.

భాగస్వామి ప్రవర్తన ఎలా ఉన్నా.. అది మీ మనసును బాధ పెట్టినా.. స్వీయ ప్రేమను కోల్పోకూడదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు నచ్చిన పనులు చేయడం, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం.. వంటివి చాలా ముఖ్యం.

పెళ్లనేది శాశ్వతమైన అనుబంధం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో తెంచుకునేది కాదు. కాబట్టి ఓసారి మీ ఇరువురి పెద్దలతోనూ మీ సమస్యల్ని చెప్పి.. వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కోవచ్చు.. అయినా ఫలితం లేకపోతే.. నిపుణుల కౌన్సెలింగ్‌ మేలు చేస్తుంది. మీ మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసి తిరిగి ఇద్దరినీ ఒక్కటి చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్