ఈగోలెందుకు..? అర్థం చేసుకుంటే సరిపోదూ..!

దంపతులన్నాక చిన్న చిన్న అలకలు సహజం. అయితే ఇవి అంతటితోనే ఆగిపోవు.. అలక పాన్పు ఎక్కిన వారు ఆ ఎమోషన్‌ని అలాగే కొనసాగించడం, ఆపై ఇద్దరి మధ్యా మాటామాటా రావడం.. ఇది ఎక్కడిదాకా వెళ్తుందంటే గతంలో ఎప్పుడో జరిగిన గొడవల తాలూకు కోపాన్నంతా ఇక్కడే....

Updated : 16 Jul 2022 20:40 IST

దంపతులన్నాక చిన్న చిన్న అలకలు సహజం. అయితే ఇవి అంతటితోనే ఆగిపోవు.. అలక పాన్పు ఎక్కిన వారు ఆ ఎమోషన్‌ని అలాగే కొనసాగించడం, ఆపై ఇద్దరి మధ్యా మాటామాటా రావడం.. ఇది ఎక్కడిదాకా వెళ్తుందంటే గతంలో ఎప్పుడో జరిగిన గొడవల తాలూకు కోపాన్నంతా ఇక్కడే తీర్చేసుకునే దాకా!  నిజానికి ఇంత చిన్న విషయానికి అంతదాకా వెళ్లడమెందుకు..?  ఒకరికొకరు సర్దుకొని పోతే ఆ సంసారం నిత్యనూతనంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు.

మీ అమ్మైతే ఇంకా బాగా చేస్తుందేమో!

నేహ వంటలో పర్‌ఫెక్ట్‌. అయితే ఓ రోజు మర్చిపోయి వంటలో ఉప్పు ఎక్కువ వేసేసింది. దాంతో నేహ భర్త నవీన్‌.. ‘ఏంటిది.. ఇవాళ కూరంతా ఉప్పగా ఉందేంటి?’ అన్నాడంతే.. ‘నీకు ఈ మధ్య నా వంట నచ్చట్లేదు.. నిన్న కారం ఎక్కువైందన్నావ్‌.. ఈరోజు ఉప్పంటున్నావ్‌.. రేపు ఏమంటావో.. నీకు మీ అమ్మే కరెక్ట్‌. తను ఎలా చేసినా బాగుందంటూ తింటావ్!’ అంటూ ఇద్దరి మధ్యకూ అత్తగారి ప్రస్తావన తెచ్చేసింది నేహ. ఇంకేముంది కన్నతల్లిని అంటే నవీన్‌ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు.. వెంటనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం చినికి చినికి గాలివానలా మారింది. భార్యలే కాదు.. భర్తలూ ఇలాంటి విషయాల్లో ‘నువ్వు ప్రతి విషయంలో మీ నాన్న చెప్పిందే వింటావ్‌.. నా మాట అసలు పట్టించుకోవు..’ అంటూ భార్యలపై కస్సుబుస్సులాడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరూ కోపతాపాలకు పోతే సిల్లీగా మొదలైన గొడవ మరీ ముదిరిపోతుంది. కాబట్టి భార్య పొరపాటున కూరలో ఉప్పెక్కువ వేసినా భర్త సర్దుకుపోవడం, నాన్న మాట విన్నప్పటికీ.. భర్తకూ సమప్రాధాన్యమిస్తూ వారిని సంతోషపెట్టడం.. ఇలా ఇద్దరూ కలిసి ఒద్దికగా సర్దుకుపోతుంటే సంసార సాగరంలోని మజా ఏంటో అర్థమవుతుంది! దాంపత్య బంధానికి ఆది-పునాది కూడా ఆ సర్దుబాటే!

నాకోసమైతే టైం లేదు కానీ..

అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లయ్యాక తనకంటూ కాస్త ప్రైవసీ ఉండాలని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. అయితే కొంతమంది దంపతులు ఈ విషయంలో కూడా గొడవలు పడుతుంటారు. అలా కాసేపు స్నేహితులతో గడపడానికి వారిళ్లకో లేదంటే అందరూ కలిసి సినిమాకో వెళ్లారనుకోండి..! ఇక అంతే.. ఇంటికొచ్చాక రాద్ధాంతం మొదలవుతుంది. ‘నిన్న నేను బయటకు వెళ్దామంటే టైం లేదన్నావు.. ఇప్పుడు అదే మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేశావు.. నేనంటే నీకు లెక్కలేదు.. నా కన్నా నీకు మీ ఫ్రెండ్సే ఎక్కువయ్యారు..! ఇంతకీ నువ్వు వెళ్లింది నీ గర్ల్‌ఫ్రెండ్‌తోనా? బాయ్‌ఫ్రెండ్‌తోనా?’ ఇలా నాన్‌స్టాప్‌గా ఎదుటివారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. దాంతో వారికి ఓపిక నశించిపోతుంది. అప్పుడు వాళ్లు కూడా రంగంలోకి దిగారనుకోండి.. సంతోషంగా గడపాల్సిన సమయం కూడా ముళ్లపాన్పుపై కూర్చున్నట్లుగా అనిపిస్తుంది.

కాబట్టి ఇలాంటి సమయంలోనే భార్య అయినా, భర్త అయినా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. ఇద్దరిలో ఎవరు తమ ఫ్రెండ్స్‌తో గడపడానికి బయటికి వెళ్లినా.. ‘నీకోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తానం’టూ వారికి హామీ ఇవ్వాలి. మీరు బయటి నుంచి ఇంటికెళ్లే క్రమంలో వారికి నచ్చిన గిఫ్ట్‌ తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేసినా.. మీపై కోపంగా ఉన్న వారు కూడా వెంటనే కరిగిపోతారు.. కావాలంటే ఓసారి ట్రై చేయండి!

వాళ్లను చూసి నేర్చుకోండి!

దాంపత్య బంధాన్ని నిత్య నూతనం చేసే అంశాల్లో ప్రేమ, రొమాన్స్ వంటివి ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ విషయంలో కూడా కొంతమంది దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ప్రేమగా మెలిగే ఇతర జంటలను చూసినప్పుడు ‘నువ్వూ ఉన్నావ్‌ ఎందుకు.. ఎప్పుడైనా అలా చేశావా?’ అంటూ మాటామాటా అనుకోవడం మొదలుపెడతారు. ఇది చినికి చినికి గాలి వానలా మారి ఒకరినొకరు అపార్థం చేసుకునే దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది వినడానికి కాస్త సిల్లీగానే అనిపించినా.. చాలామంది దంపతులు ఈ విషయం గురించి చిర్రుబుర్రులాడుకుంటారు.. కాదంటారా? అయితే ఇలాంటి సమయంలోనే ఇద్దరూ నేనంటే నేనన్నట్లుగా కోపగించుకోవడం కాకుండా.. ఒకరు అలిగినా మరొకరు ఎదుటివారిని కూల్‌ చేసేలా ఉండాలి. మీ భాగస్వామి అడిగిన రొమాన్సేదో తాను అలకపాన్పుపై ఉన్నప్పుడు చేయండి.. వెంటనే మీ కౌగిలిలో ఒదిగిపోకపోతే అడగండి..!

ఇక వీటితో పాటు.. ఒకరి కోసం ఒకరు తగినంత సమయం కేటాయించలేకపోయినప్పుడు, పడకగదిలో కూడా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తోనే ఎక్కువగా గడుపుతున్నప్పుడు.. ఇలాంటి విషయాల్లోనూ ఆలుమగల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. అలాంటప్పుడు ఇద్దరూ ఈగోలకు పోకుండా ఎదుటివారి మనసును అర్థం చేసుకొని మెలిగితే సంసార జీవితం ఆనందంగా సాగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్