Akshata Murty: రిషి.. ముందు నాన్నకు నచ్చలేదు!

తల్లిదండ్రులిద్దరూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపారవేత్తలు.. సేవామూర్తులు.. భర్త బ్రిటన్‌లో గొప్ప రాజకీయవేత్తగా ఖ్యాతి గాంచారు.. అయినా వాళ్ల పలుకుబడితో సంబంధం లేకుండా సొంతంగా ఎదగాలనుకుందామె. అనుకున్నట్లే తనకిష్టమైన ఫ్యాషన్‌ రంగంలో తిరుగులేని ముద్ర వేసింది. ఇక ఇప్పుడు తన భర్త బ్రిటన్‌ ప్రధానిగా.....

Published : 25 Oct 2022 18:13 IST

తల్లిదండ్రులిద్దరూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపారవేత్తలు.. సేవామూర్తులు.. భర్త బ్రిటన్‌లో గొప్ప రాజకీయవేత్తగా ఖ్యాతి గాంచారు.. అయినా వాళ్ల పలుకుబడితో సంబంధం లేకుండా సొంతంగా ఎదగాలనుకుందామె. అనుకున్నట్లే తనకిష్టమైన ఫ్యాషన్‌ రంగంలో తిరుగులేని ముద్ర వేసింది. ఇక ఇప్పుడు తన భర్త బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ఆ దేశ ప్రథమ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణాన్ని తన తల్లిదండ్రుల నుంచి పుణికి పుచ్చుకున్న ఆమె మరెవరో కాదు.. బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషీ సునక్‌ సతీమణి అక్షతా మూర్తి. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి - సుధామూర్తిల గారాల పట్టి అయిన అక్షత.. ఎన్నో ఏళ్ల క్రితం విదేశాల్లో స్థిరపడ్డా భారతీయ మూలాల్ని మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ ప్రతి అకేషన్‌లోనూ భారతీయ కట్టూ-బొట్టునే ఫాలో అవుతూ, వ్యాపారవేత్తగా రాణిస్తూ.. తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

నాన్నమ్మ దగ్గరే పెరిగింది!

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి- సుధా మూర్తి దంపతుల కూతురైనా.. వ్యాపార రంగంలో తనదైన పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది అక్షతా మూర్తి. 1980లో ఆమె జన్మించే నాటికి ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంకా తమ తమ కెరీర్స్‌లో స్థిరపడలేదు. అందుకే నెలల వయసున్న అక్షతను కర్ణాటక హుబ్లిలోని ఆమె నాన్నమ్మ-తాతయ్యల వద్ద వదిలి.. వాళ్లిద్దరూ ముంబయికి వెళ్లిపోయారు. అయినా నిన్ను చూడకుండా ఒక్క వారం కూడా ఉండలేకపోయేవాడినంటూ తన కూతురిని ఉద్దేశిస్తూ ఓ సందర్భంలో ఇలా పంచుకున్నారు నారాయణ మూర్తి.

‘కెరీర్‌లో స్థిరపడేందుకు నువ్వు పుట్టాక రెండు నెలలకు నిన్ను తీసుకొని అమ్మా, నేను ముంబయి వెళ్లాం. కానీ ఓవైపు పాపాయి ఆలనా పాలనా చూసుకోవడం.. మరోవైపు కెరీర్‌పై దృష్టి పెట్టడం ఎంత కష్టమో అప్పుడు మాకు అర్థమైంది. అందుకే నిన్ను కొన్ని రోజులు హుబ్లిలోని నాన్నమ్మ-తాతయ్యల ఇంట్లో ఉంచాం. అయినా నిన్ను చూడకుండా ఒక్క వారం కూడా ఆగలేకపోయేవాణ్ని. అందుకే వ్యయప్రయాసే అయినా ప్రతి వారం విమానంలో రెక్కలు కట్టుకొని నీ ముందు వాలిపోయేవాళ్లం..’ అంటూ కూతురిపై తనకున్న ప్రేమను అక్షరీకరించారాయన.

క్రమశిక్షణే విలువలుగా..!

ఇక పెద్దయ్యే క్రమంలో అక్షత ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. 1981లో ఇన్ఫోసిస్‌ను స్థాపించిన మూర్తి దంపతులు.. సంస్థ కార్యకలాపాల్లో ఎంత బిజీగా ఉన్నా.. రోజూ రాత్రి 8-10 గంటల వరకు తమ పిల్లలు అక్షత, రోహన్‌లతోనే గడిపేవారు. ఇంట్లో తాము విధుల్లో నిమగ్నమైనా.. తమ పిల్లలు హోమ్‌వర్క్‌ పూర్తిచేసుకోవడం, పుస్తకాలు చదవడం.. వంటి అంశాల్లో వారిని ప్రోత్సహించేవారు. అంతేకాదు.. రోజురోజుకీ తమ సంపద ఎదుగుతున్నా.. తమ పిల్లల్ని ఆటో రిక్షాలోనే స్కూల్‌కి పంపించేవారు. ఇలా చిన్నతనం నుంచి అమ్మానాన్న తమకు ఇంట్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండేలా చూసేవారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని తమకు నేర్పించారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు అక్షత.

రిషి.. ముందు నాన్నకు నచ్చలేదు!

లాస్‌ ఏంజెల్స్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసిన అక్షత.. కొన్నాళ్ల పాటు డెలాయిట్‌, యూనిలీవర్‌ కంపెనీల్లో పనిచేశారు. ఆపై ఎంబీఏ కోసం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చేరారు. అక్కడే రిషీ సునక్‌ను కలుసుకున్నారామె. తొలి చూపులోనే ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది.

‘రిషి గురించి తొలిసారి ఇంట్లో చెప్పినప్పుడు నాన్న కాస్త తటపటాయించారు. కానీ ఆయన్ని కలిశాక, ప్రత్యక్షంగా చూశాక తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందం, అంతకుమించిన నిజాయతీ తనలో బాగా నచ్చాయని, బహుశా.. ఇవే తను నీ మనసును దొంగిలించేలా చేశాయేమోనని నవ్వేశారం’టూ ఓ సందర్భంలో తన ప్రేమ ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు అక్షత. అలా 2009లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు.. అనౌష్క, కృష్ణ అనే ఇద్దరు కూతుళ్లున్నారు.

అది చూసి అమ్మ ఆశ్చర్యపోయేది!

ఎలాంటి ఫ్యాషన్‌ నేపథ్యం లేకుండానే.. కేవలం తపనతోనే ఈ రంగంలో అడుగుపెట్టారు అక్షత. క్యాలిఫోర్నియాలోని ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తిచేసిన ఆమె.. పెళ్లికి రెండేళ్ల ముందే 2007లో ‘అక్షతా డిజైన్స్‌’ పేరుతో సొంత లేబుల్‌ని ప్రారంభించారు. ఎవరికీ తెలియని భారతీయ ఫ్యాషన్‌ కళల్ని అందరికీ చేరువ చేయడానికే తన బ్రాండ్‌ను ప్రారంభించారంటారామె.

‘కొత్త ట్రెండ్స్‌ని, ఫ్యాషన్‌ డిజైన్స్‌ని ఫాలో అవడమంటే నాకు చిన్న వయసు నుంచే ఇష్టం. నా వార్డ్‌రోబ్‌లో కొత్తగా చేరిన దుస్తులు, వాటిని నేను జతకూర్చే విధానం చూసి అమ్మ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయేది. అలాగే దీనిపైనే నేను ఎక్కువ సమయం వృథా చేస్తున్నానేమో అని బాధపడేది కూడా! అలా ఫ్యాషన్‌పై నాకున్న మక్కువే అక్షతా డిజైన్స్‌కి బీజం పడేలా చేసింది. నేను రూపొందించే ప్రతి వస్త్రం/ఫ్యాషన్‌లో ప్రాచీన డిజైన్ల మేళవింపు ఉండాలని, కళాకారుల ఫ్యాషన్‌ నైపుణ్యాల్ని చాటాలని తపించేదాన్ని. అందుకే కంపెనీ లాభాలు వారికే దక్కేలా ఏర్పాటుచేశా..’ అంటూ తన ఫ్యాషన్‌ ప్రయాణాన్ని పంచుకుంది అక్షత. 2011లో ఆమె రూపొందించిన ఇక్కత్‌, చందేరీ, మైసూర్‌ సిల్క్‌.. వంటి వస్త్ర డిజైన్లు జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికలపై మెరిసి మురిశాయి.

ఆమె సంపద అక్షరాలా...!

అయితే వివిధ కారణాల రీత్యా 2012లో తన సంస్థను మూసేసి తన తండ్రి వ్యాపారంపై దృష్టి పెట్టిందామె. ఈ క్రమంలో ‘Catamaran Venture’ పేరుతో తన తండ్రి స్థాపించిన వెంచర్‌ క్యాపిటల్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మరోవైపు తన తండ్రి కంపెనీ ఇన్ఫోసిస్‌లోనూ ఆమెకు 0.93% విలువ గల షేర్లున్నాయి. ఇంకోవైపు.. తన సోదరుడు ప్రారంభించిన ఫిట్‌నెస్‌ కంపెనీ ‘Digme Fitness’ కూ డైరెక్టర్‌గా కొనసాగుతోంది అక్షత. ఇవి కాకుండా.. యూకేకు చెందిన పలు ప్రముఖ వ్యాపారాల్లోనూ ఆమెకు వాటా ఉంది. ఇక రిషి కూడా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడానికి ముందు తన పేరిట ఉన్న ఆస్తులన్నీ తన భార్య అక్షతకు బదిలీ చేశారు. ఇవన్నీ కలుపుకుంటే అక్షత ఆస్తుల విలువ 900 మిలియన్ డాలర్లు!

‘సింప్లిసిటీ’కి మారుపేరు!

తల్లిదండ్రుల్లాగే తానూ ఎంతో సింపుల్‌గా, హుందాగా వ్యవహరిస్తుంటుంది అక్షత. ప్రస్తుతం తన భర్తతో కలిసి బ్రిటన్‌లో స్థిరపడ్డా భారతీయ ఫ్యాషన్‌ మూలాలు మరవలేదామె. అది ఎలాంటి సందర్భమైనా, ఇంట్లో ఉన్నా చీర, కుర్తీ.. వంటి సంప్రదాయ దుస్తులు ధరిస్తూ దేశంపై తనకున్న ప్రేమను చాటుకుంటోందీ ఫ్యాషన్‌ లవర్‌. ఇలా తన సింప్లిసిటీని చూసి ప్రతి ఒక్కరూ ‘తల్లిదండ్రులకు తగ్గ తనయ’ అంటూ ఓవైపు అక్షతను, మరోవైపు మూర్తి దంపతుల్నీ ప్రశంసిస్తుంటారు.

ఇలా ఓ కూతురిగా, భార్యగా, తల్లిగా.. వ్యక్తిగత జీవితంలో సక్సెసైన అక్షత.. వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు.. తాను చేసే ప్రతి పనిలోనూ సింప్లిసిటీని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని చాటుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్