Nikh Jasmine: డ్రోన్లతో మందులు సరఫరా చేస్తోంది!

కొన్ని మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు ఇబ్బంది పడడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా రహదారి, రవాణా సౌకర్యాలు లేని కొండ ప్రాంతాలకు అత్యవసర మందులు సరఫరా చేయడమూ కష్టమే! ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దాదాపు....

Published : 18 Mar 2023 18:30 IST

(Photos: Twitter)

కొన్ని మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు ఇబ్బంది పడడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా రహదారి, రవాణా సౌకర్యాలు లేని కొండ ప్రాంతాలకు అత్యవసర మందులు సరఫరా చేయడమూ కష్టమే! ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దాదాపు అన్ని మారుమూల గ్రామాల పరిస్థితీ ఇదే! ఈ దుస్థితిని దూరం చేయడానికి ప్రభుత్వం గతంలో ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రోన్ల సహాయంతో అత్యవసర మందులు, వ్యాక్సిన్లు, ఇతర వైద్య పరికరాలు పంపిణీ చేయడం దీని ముఖ్యోద్దేశం. అయితే ఈ డ్రోన్లు నడుపుతోంది మరెవరో కాదు.. అదే రాష్ట్రానికి చెందిన నిఖ్‌ జాస్మిన్‌. దేశ ఆరోగ్య రంగంలో మొదటి మహిళా డ్రోన్‌ ఆపరేటర్‌గా పేరుపొందిన ఆమె.. డ్రోన్ల సహాయంతో వేగంగా అక్కడి ప్రజలకు అవసరమైన మందులు చేరవేస్తోంది. ‘పారాగ్లైడింగ్‌ పైలట్‌గా అపార అనుభవమున్నా.. డ్రోన్లు నడపడం ఓ సరికొత్త అనుభూతిని పంచుతుందం’టోన్న జాస్మిన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

ఈ ఆధునిక యుగంలో డ్రోన్ల వినియోగం పెరిగిపోతోంది. రవాణా సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు అత్యంత వేగంగా చేరగలిగే సామర్థ్యమున్న ఈ కృత్రిమ మేధను అరుణాచల్‌ ప్రభుత్వం తన ఆరోగ్య రంగంలో ఉపయోగించుకోవాలనుకుంది. అక్కడి జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు అత్యవసర మందులు, ఇతర వైద్య పరికరాల్ని డ్రోన్ల సహాయంతో చేరవేసేందుకు ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ క్రమంలోనే మందులు చేరవేసేందుకు ఉపయోగించే డ్రోన్లను నడిపే బాధ్యతను అక్కడి పారాగ్లైడింగ్‌ పైలట్‌ నిఖ్‌ జాస్మిన్‌కు ఈ మధ్యే అప్పగించిందా ప్రభుత్వం.

వార్తాపత్రికలో చూసి..!

అందరిలా కాకుండా అరుదైన కెరీర్‌ను ఎంచుకోవాలని చిన్న వయసులోనే నిర్ణయించుకుంది జాస్మిన్‌. అమ్మానాన్నలు, తోబుట్టువులు కూడా తన నిర్ణయాన్ని సమర్థించారు.. ప్రోత్సహించారు. ఈ ప్రేరణతోనే ఎయిర్‌లైన్స్‌, టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌.. వంటి అంశాల్లో పీజీ పూర్తిచేసిన ఆమె.. పారాగ్లైడింగ్‌ పైలట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఈ నైపుణ్యాలతో ఇప్పటికే దేశ, విదేశాల్లో పలు ఈవెంట్లలో పాల్గొన్న ఆమె.. ఓసారి వార్తాపత్రికలో జీరో ప్రాంతానికి డ్రోన్‌ ఆపరేటర్‌ కావాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌ చూసింది. ఆపై దరఖాస్తు చేయడంతో పాటు తనకు అప్పటికే పారాగ్లైడింగ్‌, ఏరో డైనమిక్స్‌ నైపుణ్యాలుండడంతో ఆ ఉద్యోగమూ సులభంగా సంపాదించిందామె. ఇలా ‘ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలి మహిళా డ్రోన్‌ ఆపరేటర్‌’గా, ‘దేశ ఆరోగ్య రంగంలో మొదటి మహిళా డ్రోన్‌ ఆపరేటర్‌’గా బాధ్యతలు అందుకుంది జాస్మిన్.

ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను!

అయితే ఉద్యోగంలో చేరిన తొలి రోజు అనుభవాలు తానెప్పటికీ మర్చిపోలేనంటోంది జాస్మిన్‌. ‘కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే నాకీ అరుదైన అవకాశం వచ్చింది. ఇదివరకే నాకు పారాగ్లైడింగ్‌ నైపుణ్యాలున్నప్పటికీ డ్రోన్లు నడపడం ఓ సరికొత్త అనుభూతిని పంచుతోంది. నిజానికి డ్రోన్లకు సంబంధించిన కనీస పరిజ్ఞానం నాకుంది. వాటి విడిభాగాలేంటి? అవి ఎంత ఎత్తు ఎగరగలవు? ఎంత బరువు మోయగలవు?.. వంటి విషయాలపై నాకు అవగాహన ఉండడంతో పాటు డ్రోన్లను సురక్షితంగా, సమర్థంగా నడపడంలోనూ ప్రొబేషన్‌ సమయంలో శిక్షణ పొందా. తద్వారా మరిన్ని నైపుణ్యాలు పొందగలిగా. ఇక జీరో ప్రాంతంలో నేను విధుల్లో చేరాక తొలి రోజు ఆ ప్రాంత వాసులంతా ‘డ్రోన్లు ఆపరేట్‌ చేసేది అమ్మాయట!’ అంటూ ఆశ్చర్యంతో నన్ను చూడ్డానికి వచ్చారు. కొంతమంది ‘అమ్మాయివై ఉండి డ్రోన్లు నడిపే క్లిష్టమైన పనిని ఎలా చేయగలుగుతున్నావ్‌?’ అనడిగారు. కష్టపడేతత్వం, అంకితభావంతో ఏదైనా సాధించచ్చు.. ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవచ్చు.. ముందు నుంచి నేనూ ఇదే నిరూపించాలనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ డ్రోన్‌ గర్ల్.

అందుకు గర్వంగా ఉంది!

ఎంత గొప్ప పనిచేసినా.. నలుగురికీ సహాయపడే పనిచేసినప్పుడే మనసుకు సంతృప్తి అంటోంది జాస్మిన్‌. డ్రోన్‌ ఆపరేటర్‌గా మారుమూల ప్రాంత వాసులకు అత్యవసరమైన మందుల్ని సకాలంలో అందిస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందంటోందామె. ‘ఇక్కడి చాలా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్డు, రవాణా సదుపాయాలు లేవు. వర్షం పడితే ఉన్న రోడ్లు కూడా దెబ్బతిని అంబులెన్స్‌ కూడా చేరుకోలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్లు ఇక్కడి ప్రజలకు ఆపన్నహస్తంగా మారాయి. వీటి సహాయంతో అత్యవసర సమయాల్లో వేగంగా మందులు, ఇతర సామగ్రిని చేరవేయచ్చు. పిల్లలకు వ్యాక్సినేషన్‌ను సకాలంలో అందించచ్చు. ఇలా నా వంతుగా ఇక్కడి ప్రజలకు సేవ చేయడం సంతృప్తిగా అనిపిస్తోంది. మరోవైపు నన్ను చూసి నా కుటుంబ సభ్యులూ గర్వపడుతున్నారు..’ అంటూ చెప్పుకొచ్చిందీ మహిళా డ్రోన్‌ ఆపరేటర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్