సాధించి చూపించారు

లేదు... కాదు... అసాధ్యం... అనే పదాలకు చోటివ్వకుండా ఎంచుకొన్న రంగంలో దూసుకుపోవాలంటే ఎంతో సంకల్పసిద్ధి కావాలి. పోరాటపటిమనీ చూపాలి.

Updated : 25 Mar 2023 17:04 IST

లేదు... కాదు... అసాధ్యం... అనే పదాలకు చోటివ్వకుండా ఎంచుకొన్న రంగంలో దూసుకుపోవాలంటే ఎంతో సంకల్పసిద్ధి కావాలి. పోరాటపటిమనీ చూపాలి. కుల వృత్తికే ఆధునికత జోడించినా.. ఒక కాలు లేకపోయినా... ఆడవాళ్లు అడుగుపెట్టని ఆటోమొబైల్‌ రంగంలో అడుగుపెట్టినా... వీళ్లూ ఇటువంటి చొరవనే చూపుతున్నారు.. యువశక్తిని ప్రపంచానికి చాటుతున్నారు.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ...


కాలు లేకున్నా..

సమస్య వస్తే కుంగిపోయి, దాని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం కాదు.. పరిష్కారం కోసం వెతకాలంటుంది వరలక్ష్మి. ప్రమాదవశాత్తు కాలిని కోల్పోయిన ఈమె కృత్రిమ కాలితో నాట్యం చేస్తూ.. అమెరికాలో ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని సొంతం చేసుకుంది...  

మా ఊరు అనకాపల్లి దగ్గరున్న గవరపాలెం. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్నా. అమ్మానాన్నలు దాడి జగన్నాథరావు, లక్ష్మి. మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఏడేళ్లున్నప్పుడు.. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్తంభం నా కుడి కాలిపై పడింది. ‘కాలినరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తీసేస్తే తప్ప.. ఈ అమ్మాయి బతకదన్నారు’ వైద్యులు. అమ్మనాన్నలు నన్ను బతికించుకోవడం కోసం ఒప్పుకొన్నారు. జైపూర్‌ వెళ్లి కృత్రిమ కాలిని పెట్టించుకునే స్థోమత లేదు. కానీ అదృష్టవశాత్తూ స్థానికంగా ఉన్న గురుదేవ ట్రస్టు వాళ్లు ఉచితంగా కృత్రిమ కాలిని అమర్చారు. మానసికంగా ధైర్యాన్ని నింపారు. అప్పుడే ‘మయూరి’ సినిమా గురించి తెలిసింది. అందులోని కథానాయికలానే నేనూ నాట్యం చేయాలనుకున్నా. ఏడో తరగతి నుంచే సాధన మొదలుపెట్టా. నాకు గురువులెవ్వరూ లేరు. యూట్యూబ్‌లో చూసి సొంతంగా సాధన చేశా. మొదట్లో కష్టంగానే ఉండేది. బాధను భరిస్తూనే చదువు, సాధన రెండూ కొనసాగించా. ఆ శ్రమ వృథా పోలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ బహుమతి గెలుచుకోవడం గొప్ప అనుభూతి. తర్వాత ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చా. విజయవాడ, విశాఖపట్నం, సింహాచలం యువజనోత్సవాల్లోనూ పాల్గొన్నా. చిత్రలేఖనాన్నీ సాధన చేశా. అమెరికాలో నాట్య ప్రదర్శనకు అవకాశం లభించింది. బాగా చదివి వ్యవసాయ శాఖలో అధికారినవ్వాలన్నది నా లక్ష్యం.

-భానూజీరావు, అనకాపల్లి


వెదురు ఉత్పత్తులతో ఉపాధి!

అమ్మానాన్నల వృత్తి... వెదురు బొమ్మల తయారీ! దానికి తన చిత్ర కళను, ఆధునికతను రంగరించి... ‘కలర్‌ టాక్స్‌’ పేరుతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది పెద్దపల్లి జిల్లా అమ్మాయి పిల్లి ప్రియాంక..

దైౖనా ఇష్టంగా నేర్చుకుంటే.. అద్భుతాలు సృష్టించొచ్చని అమ్మ లావణ్య, నాన్న లక్ష్మణ్‌ అనేవారు. వాళ్ల పనితనాన్ని చూస్తూ పెరిగిన నాకూ వెదురు బొమ్మల తయారీ కళ అబ్బింది. పెళ్లి వస్తువుల ఆర్డరు తీసుకుంటే చాలు... వెదురు ఫ్రేములూ, బుట్టలు, కొబ్బరి బొండాలు అన్నింటిమీదా పెయింటింగ్‌ పని నాదే. వెదురు వస్తువులపైనా పోట్రెయిట్‌, మైక్రో ఆర్ట్‌ వేసేదాన్ని. అమ్మ డ్వాక్రా సభ్యురాలు, పలు రాష్ట్రాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసేది. అక్కడ మా ఉత్పత్తులకున్న ఆదరణ చూశాక నాకూ సొంతంగా వ్యాపారం చేయాలనిపించింది. చదువుకుంటూనే ‘కలర్‌టాక్స్‌’ పేరుతో ఇన్‌స్టా పేజీ తెరిచా. వినియోగదారుల అవసరాలూ, ఆధునిక పోకడల్నీ గమనిస్తూ ప్రయోగాలు మొదలుపెట్టా. వెదురు చాపపై పెయింటింగ్‌ ఆలోచన అలా వచ్చిందే. మెల్లగా దేశవిదేశాల ఆర్డర్లు మొదలయ్యాయి. అలా నెలకి రూ.50 వేల నుంచి లక్ష వరకు ఆర్జిస్తున్నా. నా చదువుకు, అవసరాలకు నేనే సంపాదించుకోవాలనే తపన నాది. ఇతరుల మీద ఆధారపడకుండా, ఏ పనైనా సొంతంగా చేయగలిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతా తెలుస్తుంది. పదిమంది పిల్లలకి బొమ్మలు గీయడంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. గ్రూప్స్‌కీ సిద్ధమవుతున్నా.

- అవదూత హరిప్రియ, హైదరాబాద్‌


పొరపాట్లు చేయకపోతే ఎలా? వైఫల్యాలే కదా.. విజయానికి పునాదులు అంటుంది 19 ఏళ్ల దిశా ఖండేల్వాల్‌. హైదరాబాద్‌లో జరిగిన టై గ్లోబల్‌ సమ్మిట్‌ కి వచ్చిన ‘2వీలర్‌’ వ్యవస్థాపకురాలు దిశ వసుంధరతో మాట్లాడింది...

మాది పుణె. నాన్న కృషి ఖండేల్‌వాల్‌ పాతబైకులను రీమోడలింగ్‌ చేసి అమ్మేవారు. అమ్మ లీనా ఉద్యోగిని. అక్క ఖ్యాతి. కొవిడ్‌లో నాన్నకు బాగా నష్టాలొచ్చాయి. అప్పుడు నేను డిగ్రీలో ఉన్నా. తన వ్యాపారాన్ని గట్టెక్కించడానికి ఎవరూ లేరని నాన్న బాధపడుతుంటే.. నేను చేస్తా అన్నా. నీకు తెలీదు, చిన్నదానివన్నారు. ఆయన్ని ఒప్పించాక.. మార్కెటింగ్‌లో ఆయన 30 ఏళ్ల అనుభవాన్ని అడిగి తెలుసుకొంటూ ఆ సలహాలు, సూచనలతో 2020లో ‘2వీలర్‌’ ప్రారంభించా. అక్కని కూడా కలుపుకొని 20 సెకండ్‌హ్యాండ్‌ బైకులను రీమోడలింగ్‌ చేసి విక్రయానికి ఉంచా. ఇందుకు సామాజిక మాధ్యమాలే వేదిక. పాతవాహనాన్ని అమ్మాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో ఆ వివరాలన్నీ పొందుపరచాలి. తగిన ధ్రువపత్రాలుంటే, మా సిబ్బంది దాన్ని వర్క్‌షాపులో పరిశీలిస్తారు. కొన్నతర్వాత రీమోడలింగ్‌ అయ్యి మా స్టోర్‌కు వస్తుంది. వీటిని కొనాలనుకొంటే చెక్‌ చేసి, నడిపి చూసుకోవచ్చు. బ్యాంకు రుణం, బీమా వారంటీ పత్రాలిప్పించే బాధ్యత మాదే. 10 రోజుల్లోపు ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాం. మా వద్ద రూ.25వేల నుంచి రూ3 లక్షల ఖరీదైన అన్నిరకాల బైకులుంటాయి. రెండేళ్లలోనే అయిదు బ్రాంచ్‌లకు విస్తరించాం. 4 వేలకుపైగా వాహనాలు అమ్మాం. 50 మంది సిబ్బంది ఉన్నారు. 2021లో ‘రైడ్‌ ఆన్‌ రెంట్‌’ ప్రారంభించి బైకులను అద్దెకిస్తున్నాం. ఆటోమొబైల్‌ రంగంలో అమ్మాయిలేంటనేవారు. సాధించేవాళ్లు విమర్శలకు వెరవకూడదు అనే అమ్మే నాకు స్ఫూర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్