Fathima Asla: 50 సార్లు ఎముకలిరిగాయి.. నీకు ర్యాంప్‌వాక్‌ ఏంటన్నారు

పట్టుదల ఉంటే పరిమితులను అధిగమించి మరీ కలలను సాకారం చేసుకోవ చ్చనడానికి ఉదాహరణ డాక్టర్‌ ఫాతిమా అస్లా. డాక్టరవ్వాలి, ర్యాంప్‌ వాక్‌ చేయాలనే ఆమె కలలను ఎందరో అపహాస్యం చేశారు.

Published : 30 Apr 2023 00:22 IST

పట్టుదల ఉంటే పరిమితులను అధిగమించి మరీ కలలను సాకారం చేసుకోవ చ్చనడానికి ఉదాహరణ డాక్టర్‌ ఫాతిమా అస్లా. డాక్టరవ్వాలి, ర్యాంప్‌ వాక్‌ చేయాలనే ఆమె కలలను ఎందరో అపహాస్యం చేశారు. ఆమె పట్టుదల వాటన్నింటినీ జయించింది. ఆ కథ మీరూ చదివేయండి.

జీవితంలో  ప్రతి రోజూ.. ఫాతిమాకు కొత్తదే. ఎందుకంటే ఏరోజుకారోజే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండొచ్చు. కొచ్చిన్‌కు చెందిన ఈమె పుట్టిన మూడో రోజునే చేతి ఎముక విరిగింది. అనుకోకుండా జరిగింది అన్నారంతా. ఏడాది నిండకుండానే మరోసారి ఎముక విరగడంతో వైద్యపరీక్షలు చేయించారు. జన్యు సంబంధిత వ్యాధి అన్నారు వైద్యులు. ఎముకలు బలహీనంగా ఉండి తరచూ ఫ్రాక్చర్‌ అవుతాయన్నారు. ఫాతిమాను చదివించడమే ఆ మధ్యతరగతి కుటుంబానికి కష్టం. దీనికితోడు ఈ అనారోగ్యం. ఈ పాపనెలా పెంచాలనే బెంగ అమ్మా నాన్నలది. తరచూ ఏదో ఒక ఎముక విరగడం, చికిత్స మామూలయ్యాయి. ఇలా ఉన్నా చదువులో ఫాతిమా ఎప్పుడూ ముందంజే.

డాక్టర్‌గా..

చిన్నప్పటి నుంచి తరచూ ఆసుపత్రికెళ్లే ఫాతిమా వైద్యవృత్తి పట్ల ఆకర్షితురాలైంది. తానూ డాక్టరై రోగులకు సేవలందించాలని కలలు కనేవారు. ‘డాక్టరవ్వాలనే కల నెరవేర్చుకోవడంలో ఇబ్బందులెన్నెదురైనా అమ్మానాన్న నాకు తోడుగా నిలిచారు. నాలుగడుగులు వేయలేనంత బలహీనం. ఎముకలు విరుగుతాయేమో అనే భయం. పాఠశాల స్థాయిలోనే 6 సార్లు ఎముకలు విరిగి ఆపరేషన్లు జరిగాయి. వాకర్‌ సాయంతో నడిచే నాకు, అమ్మ నీడలా తోడుగా ఉండేది. నేను కోరుకున్నట్లు ఎంబీబీఎస్‌ సీటు రాలేదు. కానీ కొట్టాయం ఏఎన్నెస్సెస్‌ హోమియో మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో బీహెచ్‌ఎంఎస్‌లో అవకాశమొచ్చింది. హౌస్‌సర్జన్‌ అయ్యాక హోమియోపతిలో స్పెషలైజేషన్‌ చేస్తున్నా. నాలాంటివారు జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను అందరికీ చెప్పాలనిపించి ‘నిలావుపోలె చిరిక్కున్న పెన్‌కుట్టి’ అని పుస్తకం రాశానని’ చెప్పుకొచ్చింది ఫాతిమా.

ఆ పరిచయం..

లక్షద్వీప్‌కు చెందిన ఫిరోజ్‌ తిరువనంతపురంలో చదువుతున్నప్పుడు ఆన్‌లైన్‌లో ఫాతిమాకు పరిచయమయ్యాడు. ‘కొవిడ్‌లో మామధ్య ప్రేమ చిగురించింది. నడవలేని నాపై సానుభూతితో కాకుండా ప్రేమతో మనస్ఫూర్తిగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానించాడు. మేం పర్యటక ప్రాంతాలకు, బయటకు విహార యాత్రలకు వెళ్లేటప్పుడు నాలాంటివారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలిసేవి. ఆ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మావంతు సేవ చేయాలని ‘కాదలుం నిలావుం’ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాం. మన సమాజాన్ని డిజేబుల్డ్‌ ఫ్రెండ్లీగా మార్చాలనే దానిపై అవగాహన కలిగిస్తూ ట్రావెల్‌ వ్లోగ్స్‌ చేస్తుంటామం’టారు ఫాతిమా.


వేదికపై..

ర్యాంప్‌వాక్‌ చేయాలనేది ఫాతిమా చిన్నప్పటి కల. విన్నవాళ్లంతా నీకు ర్యాంప్‌వాక్‌ ఏంటని హేళన చేసేవారు. ఆమెకప్పటికి 50 సార్లు ఎముకలు విరిగాయి. ‘అలా విమర్శించిన వారికి నా చిరునవ్వే సమాధానం. నా పరిస్థితిని నేను అంగీకరించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. టీవీలో ఫ్యాషన్‌ షోలు చూస్తున్నప్పుడు ఆ వేదికపై నేనున్నట్లుగా ఊహించుకొని పొంగిపోతుంటా. ర్యాంప్‌వాక్‌ చేస్తుంటే అందరూ కొట్టే చప్పట్ల శబ్దమెంతో ఇష్టం. మనసు చెప్పింది మనం వినాలి. నా నమ్మకం నిజమయ్యే క్షణాలొచ్చాయి. గతేడాది డిసెంబరులో ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌’ వేడుకల్లో ర్యాంప్‌వాక్‌ చేసే అవకాశాన్ని అందుకున్నా. వీల్‌ఛెయిర్‌లో నన్ను చూసి అందరూ కొట్టిన చప్పట్లు జీవితాంతం మరవలేను’ అంటున్న ఫాతిమా నిజంగా స్ఫూర్తి ప్రదాత కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్