Sandhya Sriram: చేప కోయక్కర్లేదు... రొయ్య ఒలవక్కర్లేదు!

ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లే ఆవిష్కరణలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అలాంటిదే సెల్‌ కల్చర్డ్‌ మీట్‌. ఇప్పటికే ఈ తరహా చికెన్‌ అందుబాటులోకి రాగా ఇప్పుడు సీఫుడ్‌ వంతు.

Published : 20 May 2023 00:09 IST

ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లే ఆవిష్కరణలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అలాంటిదే సెల్‌ కల్చర్డ్‌ మీట్‌. ఇప్పటికే ఈ తరహా చికెన్‌ అందుబాటులోకి రాగా ఇప్పుడు సీఫుడ్‌ వంతు. సింగపూర్‌ కేంద్రంగా నడుస్తోన్న షివోక్‌ మీట్స్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి కణ ఆధారిత పీతలు, దక్షిణాసియాలోనే తొలి కల్టివేటెడ్‌ సీఫుడ్‌, మీట్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ స్థాపకురాలు డా. సంధ్య శ్రీరామ్‌.

మానవాళికీ, పర్యావరణానికీ హాని కలగకుండా...జంతువులను హింసించకుండా ప్రత్యామ్నాయ మాంస ఉత్పత్తులను తీసుకురావాలన్న ఆలోచన, ఆహార రంగం, ఇన్నోవేటివ్‌ సైన్స్‌ రంగాలపై ఉన్న ఆసక్తి... తనని షివోక్‌ మీట్స్‌ ఏర్పాటు దిశగా నడిపించాయంటారు సింగపూర్‌కి చెందిన డా. సంధ్యా శ్రీరామ్‌. ఆమె తన స్నేహితురాలు డా. కాఇ లింగ్‌తో కలిసి 2018లో ఈ సంస్థను ప్రారంభించారు. స్నేహితురాళ్లిద్దరికీ స్టెమ్‌ సెల్‌ బయాలజీ రంగంలో 20 ఏళ్ల అనుభవముంది. సంధ్యా వాళ్లది తమిళనాడు, సింగ్‌పూర్‌లో స్థిరపడ్డారు. పోస్ట్‌డాక్టోరల్‌ పరిశోధన చేస్తున్నప్పుడే సెల్‌ ఆధారిత మాంసం తయారీపై ఆసక్తి పెంచుకున్నారు. ‘తక్కువ నీరు, శక్తి, భూమి వినియోగంతో సెల్యులార్‌ టెక్నాలజీతో మాంసాన్ని తయారు చేయొచ్చు. దీనివల్ల జీవవైవిధ్యమూ దెబ్బతినదు. పైగా సాధారణ జంతు మాంసాల్లో ఉన్నట్లుగా హార్మోన్లూ, యాంటీ బయాటిక్స్‌, మైక్రో ప్లాస్టిక్‌, పాదరసం వంటి హానికర రసాయనాలేమీ ఉండవు. అందుకే దీన్ని ఎంచుకున్నా’ అంటారామె.

ఏంటీ సెల్యులార్‌ సాగు...

సెల్‌ కల్చర్డ్‌ మీట్‌, సెల్యులార్‌ వ్యవసాయం..పేరేదైనా ఈ విధానంలో ముందుగా కోడి, మేక, చేప, పీత, ఎండ్రకాయ, రొయ్య....నుంచి మూలకణాలను సేకరించి సెల్‌బ్యాంక్‌లో భద్రపరుస్తారు. ఆపై పోషకాలు అధికంగా ఉండే ప్రత్యేక వాతావరణం (ఉక్కుపాత్ర లేదా బయో రియాక్టర్‌)లో ఉంచి పరిపక్వం చేస్తారు. ఈ పద్ధతిలో మాంసం తయారీకి 14 రోజులు పడుతుంది. తర్వాత ప్రతి 18 నుంచి 24 గంటలకు మాంసం రెట్టింపవుతుంది. దీనివల్ల ఏ జీవినీ చంపకుండానే మాంసాన్ని పొందవచ్చు.

సవాళ్లెన్నో దాటి...

సాంకేతికత, ఆవిష్కరణలు ఎంత గొప్పవైనా... వినియోగదారులు దానిని అంగీకరించకపోతే ఉపయోగం ఉండదు. దీన్ని అధిగమించాలంటే ముందు ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఆ సంకల్పంతోనే మార్కెటింగ్‌లో పట్టుసాధించారామె. ‘ప్రణాళిక, పరిశోధన, మార్కెటింగ్‌ కంటే ఉద్యోగుల నిర్వహణే కాస్త భిన్నమైన వ్యవహారం. ఇందులోనూ పట్టు తెచ్చుకోగలిగితేనే వ్యాపారం నిలబడేదని’ సంధ్య అభిప్రాయం. ‘ఏ పనైనా అనుకోగానే పూర్తయిపోదు. 80 శాతంమంది మొదటి ప్రయత్నంలో విఫలమవుతారు. పనిలో బోలెడు సందేహాలు వెంటాడతాయి. పొరపాట్లూ జరుగుతాయి. విమర్శలూ వెక్కిరిస్తాయి. అలాగని వెనకడుగు వేస్తే... మన ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. నాకూ ఇలాంటి పరిస్థితులెన్నో ఎదురయ్యాయి. వాటినే పాఠాలుగా మలుచుకుని నా ప్రయాణం కొనసాగించా’ అంటారామె. స్టార్టప్‌ ఆలోచనల్లో ఉండగా ఓ ఇన్వెస్టర్‌ దగ్గరకు వెళ్తే... ‘నువ్వు తెల్ల జాతీయుడివి అయితే కచ్చితంగా పెట్టుబడి పెడుదును అంటూ హాస్యమాడారట. అది విన్న సంధ్య ఏ మాత్రం తడబడకుండా ‘అయ్యో, నేను మహిళను. నాది గోధుమ రంగు ఛాయ’ అంటూ లేచి బయటకు వచ్చేశారట. తర్వాత ఆమె ప్రతిభతో అమెరికా, యూరప్‌, సింగపూర్‌, జపాన్‌, దక్షిణ కొరియా వంటి చోట్ల నుంచి సుమారు రూ.247 కోట్లకు పైగా పెట్టుబడి సంపాదించుకోగలిగారు. ఐదేళ్ల క్రితం ఇద్దరితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం రెండు దేశాల్లో ముప్పై రెండు మంది ఉద్యోగులతో నడుస్తోంది. విశేషమేంటంటే... షివోక్‌ మీట్్స ప్రారంభించిన కొన్నాళ్లకే, జియాఫుడ్స్‌ అనే కల్టివేటెడ్‌ రెడ్‌మీట్‌ కంపెనీ పగ్గాలనూ చేజిక్కించుకోగలిగారు. సమర్థతకు వర్ణ, లింగ భేదాలు ఉండవని చెప్పడానికి సంధ్యకంటే చక్కటి ఉదాహరణ ఏముంటుంది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్