వారి గొడవల మధ్య నేను నలిగిపోతున్నా..!

నాకు పెళ్లై ఏడాదవుతోంది. నాకు, నా భర్తకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ, పెళ్లైన దగ్గర్నుంచి మా అన్నయ్యకు, నా భర్తకు మధ్య చాలాసార్లు విభేదాలు వచ్చాయి. నేను ఎంత ప్రయత్నించినా వారి మధ్య సయోధ్య కుదర్చలేకపోయా. ఈ క్రమంలో ఆయన మా అన్నయ్య పైనే కాకుండా మా తల్లిదండ్రులపై కూడా కోపం పెంచుకున్నాడు.

Published : 12 Apr 2024 13:11 IST

నాకు పెళ్లై ఏడాదవుతోంది. నాకు, నా భర్తకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ, పెళ్లైన దగ్గర్నుంచి మా అన్నయ్యకు, నా భర్తకు మధ్య చాలాసార్లు విభేదాలు వచ్చాయి. నేను ఎంత ప్రయత్నించినా వారి మధ్య సయోధ్య కుదర్చలేకపోయా. ఈ క్రమంలో ఆయన మా అన్నయ్య పైనే కాకుండా మా తల్లిదండ్రులపై కూడా కోపం పెంచుకున్నాడు. నా నిర్ణయాలను మా అన్నయ్య ప్రభావితం చేస్తున్నాడని నా భర్త బలంగా నమ్ముతున్నాడు. అందులో వాస్తవం లేదని ఎంత చెప్పినా అతను నమ్మడం లేదు. ఆ కోపంతో కుటుంబ కార్యక్రమాలకు రావడం మానేయడంతో నేనొక్కదాన్నే వెళుతున్నా.. దాంతో ఇతర కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలు నన్ను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నాకు భర్త, మా పుట్టింటివాళ్లు.. ఇరువురూ ముఖ్యమే. వీరి మధ్య గొడవల వల్ల నేను నలిగిపోతున్నాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే ఇతరుల గొడవల్లో భాగం కావాల్సి వస్తుంటుంది. దానివల్ల గొడవ పడిన వారికంటే భాగమైన వారే ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. మీ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అసలు సమస్య మీ అన్నయ్య, భర్త మధ్య అయినా.. దాని ప్రభావం మీపై ఎక్కువగా పడుతోంది. ఈ క్రమంలోనే వారి మధ్య సయోధ్య కుదర్చడానికి మీ వంతుగా ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు.

మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరి మధ్య బంధమే కాదు.. ఇరు కుటుంబాల కలయిక. అందుకే సమస్య ఎవరికి వచ్చినా అది రెండు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. మీ అన్నయ్యతో ఉన్న విభేదాల కారణంగా మీ భర్త కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. అది సమస్యకు పరిష్కారం కాదన్న విషయాన్ని అతనికి తెలియజేసే ప్రయత్నం చేయండి. దానివల్ల పరోక్షంగా మీ భర్త విలువ కూడా తగ్గిపోతుందన్న విషయాన్ని గుర్తు చేయండి. ఫలితంగా అతని ఆలోచనలో మార్పు వస్తుందేమో గమనించండి. 
అదేవిధంగా- ఈ విషయంలో అటు మీ అన్నయ్యకు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. వాళ్లిద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా మీరు మానసికంగా ఎంత బాధపడుతున్నారో వివరించండి. విభేదాలు మర్చిపోయి మీ వారితో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించమని కోరండి.

అయితే సాధారణంగా సమస్య ఎవరి మధ్య ఉంటే వారే పరిష్కరించుకోవాలి. చాలామంది విషయంలో సమస్యకు పరిష్కారం లభించకపోవడానికి అసలు కారణం కలిసి చర్చించుకోకపోవడమే. కాబట్టి, మీ భర్త, అన్నయ్య కలిసి మాట్లాడుకోవడానికి అనువైన వాతావరణం కల్పించడానికి ప్రయత్నించండి. ఇందుకు అవసరమైతే ఇతర కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్