ఈ అబద్ధాలు చెప్పకూడదట..!

ఏదో సరదాకి ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే పర్లేదు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటివ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుంది.

Updated : 29 Feb 2024 13:27 IST

ఏదో సరదాకి ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే పర్లేదు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటివ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుంది. ఇదే అనుబంధాల్లో కలతలు రేగడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే భార్యాభర్తలు ఏ విషయంలోనైనా పారదర్శకంగా వ్యవహరించాలని చెబుతున్నారు. మరి, ఆలుమగలు ఏ విషయాల్లో అబద్ధాలు చెప్పుకోకూడదో? దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకుని ఉండడం అవసరం..

తను జస్ట్‌ ఫ్రెండ్‌.. అంతే!

విఫలమైన ప్రేమకథలు, బ్రేకప్‌లు చాలామంది జీవితాల్లో ఉంటాయి. అయితే వాటినే తలచుకుంటూ అక్కడే ఆగిపోలేం.. అలాగని వాళ్ల జ్ఞాపకాల్ని అంత త్వరగా మర్చిపోలేం కూడా! వేరొకరితో పెళ్లైనా ఏదో ఒక సందర్భంలో ‘మాజీ’ గుర్తుకు రావడం, వాళ్ల ఆలోచనలు మనసును ఉక్కిరి బిక్కిరి చేయడంతో మూడ్‌ మారిపోతుంటుంది. అయితే ఆ అసహనాన్ని మీ భాగస్వామిపై చూపించడం, వారి గురించి పదే పదే ప్రస్తావించడం, దీనికి కారణమేంటని అడిగితే.. మనసు నిండా మీ మాజీ ఆలోచనలే పెట్టుకొని.. బయటికి మాత్రం తను జస్ట్‌ ఫ్రెండ్.. అంతే! అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, అవతలి వారికి అబద్ధం చెప్పడం.. ఇవన్నీ మీ భాగస్వామికి మీపై లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తాయి. తద్వారా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. అందుకే సాధ్యమైనంతవరకు పారదర్శకంగా ఉండడం దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఆర్థిక విషయాల్లో..

ఆలుమగల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాల్లో ఆర్థిక విషయాలూ ముందు వరుసలో నిలుస్తున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. ఒకరి ఆదాయ వ్యయాల గురించి మరొకరి దగ్గర దాచడం, ఒకరికి తెలియకుండా మరొకరు వేర్వేరు అకౌంట్స్‌ నిర్వహించడం, విచ్చల విడిగా ఖర్చు చేస్తూ.. వ్యయాల విషయంలో పరిమితంగానే ఉన్నానని కవర్‌ చేసుకోవడం.. ఇలా ముందొకలా, వెనక మరోలా వ్యవహరిస్తుంటే.. ఎప్పుడో ఒకసారి దొరికిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మీపై మీ భాగస్వామి నమ్మకం కోల్పోయి క్రమంగా మీ అనుబంధం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొత్తగా అకౌంట్ ప్రారంభించినా, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసినా.. ఇలా ప్రతి విషయంలోనూ పారదర్శకత అవసరం అంటున్నారు నిపుణులు.

నమ్మకం పెరగాలంటే..

ఒక్కోసారి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి చెప్పే అబద్ధాలు కూడా అనుబంధాలు బీటలు వారేలా చేస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తమ్మీద దాంపత్య బంధంలో ఏ విషయంలోనూ దాపరికం, అబద్ధాలు చెప్పుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. తద్వారా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం పెరిగి అనుబంధమూ దృఢమవుతుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్