Relationship Tips: బంధం బోర్ కొడుతోందా?

దాంపత్య బంధం శాశ్వతమైనది. ఎంత అన్యోన్యంగా ఉన్నా అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు, తగాదాలు వస్తుంటాయి. అలాగని అవి మితిమీరినా నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే అనుబంధాన్ని ఓసారి డీటాక్స్‌ చేయమంటున్నారు. అయితే ఈ ఒక్క విషయంలోనే.....

Published : 03 Dec 2022 18:34 IST

దాంపత్య బంధం శాశ్వతమైనది. ఎంత అన్యోన్యంగా ఉన్నా అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు, తగాదాలు వస్తుంటాయి. అలాగని అవి మితిమీరినా నిర్లక్ష్యం తగదంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే అనుబంధాన్ని ఓసారి డీటాక్స్‌ చేయమంటున్నారు. అయితే ఈ ఒక్క విషయంలోనే అని కాదు.. మరికొన్ని అంశాల్లోనూ భార్యాభర్తలు తమ మధ్య ఉన్న ప్రతికూలతల్ని తొలగించుకోవడం అవసరమంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ రిలేషన్‌షిప్‌ డీటాక్స్‌? అది ఎప్పుడు అవసరం? తెలుసుకుందాం రండి..

డీటాక్స్‌ అంటే మన శరీరంలోని మలినాల్ని తొలగించుకోవడం. మరి, రిలేషన్‌షిప్‌ డీటాక్స్‌ అంటే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతికూలతల్ని తొలగించుకొని ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేయడమన్న మాట! అయితే ఆలుమగలిద్దరూ ఇది ఎప్పుడు అవసరమో తెలుసుకొని తమ బంధాన్ని డీటాక్స్‌ చేసుకోగలిగితే.. దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకోవచ్చని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఔనన్నా కాదన్నా గొడవేనా?

ఆలుమగల మధ్య గొడవలు అప్పుడప్పుడూ జరగడం సహజమే అయినా.. కొంతమంది మాత్రం చీటికీ మాటికీ మాటా మాటా అనుకుంటుంటారు. ఇలా జరుగుతోందంటే ఇద్దరూ ఒకరి విషయంలో మరొకరు ఏదో అసంతృప్తితో ఉన్నారని అర్థం చేసుకోమంటున్నారు నిపుణులు. అదేంటో కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోమంటున్నారు. నిజంగానే అది అనవసర విషయమైతే మీ మధ్య నుంచి తొలగించడం మంచిది. మరి, అలాకాకుండా ఒకరితో ఒకరు సరైన సమయం గడపలేకపోవడం వల్లే ఇలా జరుగుతోందనుకుంటే మాత్రం.. ఇద్దరికీ నచ్చిన వ్యాపకం ఎంచుకొని.. కాసేపు సేదదీరండి. ఇలా ఈ విలువైన సమయం భార్యాభర్తలిద్దరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.. అనుబంధాన్నీ దృఢం చేస్తుంది.

ఆ ఫీలింగే రాకూడదు!

పెళ్లైన కొత్తలో ఉన్నంత అన్యోన్యత, దగ్గరితనం రోజులు గడిచే కొద్దీ ఉండదంటుంటారు. ఈ క్రమంలో ‘అబ్బ.. ఈ రిలేషన్‌షిప్‌ బోరింగ్‌గా ఉంది!’ అనుకునే వారూ లేకపోలేదు. మరి, దీన్నిలాగే వదిలేస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే ఆ ఫీలింగ్‌ రాకుండా వైవాహిక బంధాన్ని నిత్యనూతనం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో పడకగదితో సంబంధం లేకుండా కాస్త ప్రైవేట్‌ స్పేస్‌ని ఏర్పాటుచేసుకోవాలి. దాన్ని మీ అభిరుచులు, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజూ ఓ అరగంట పాటు అక్కడ కూర్చొని ఇద్దరూ ఊసులాడుకోవాలి.. ఇదొక్కటనే కాదు.. నచ్చిన ఆటలాడుకోవడం, రొమాంటిక్‌గా పాటలు పాడుకోవడం.. ఇలా మీకు నచ్చినట్లుగా ఉండచ్చు. వీలు చిక్కినప్పుడల్లా టూర్స్‌, బయట డిన్నర్‌, డేట్‌కి వెళ్లడం.. ఇలా ఆలోచిస్తే దంపతుల అన్యోన్యతను కొత్త పుంతలు తొక్కించే ఐడియాలకు కొదవే లేదని చెప్పచ్చు.

‘సుదీర్ఘ’ ప్రయాణం చేయాలంటే..!

భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు.. ఎవరికి వారుగా కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో- దాపరికం, నీకెందుకు చెప్పాలన్న నిర్లక్ష్యం ఉన్నట్లయితే ఒక దశలో ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఇద్దరి మనసుల్లో ఆ ఆలోచన రాకముందే జాగ్రత్తపడమంటున్నారు. ముఖ్యంగా డబ్బు విషయంలో దంపతుల మధ్య అస్సలు దాపరికాలుండకూడదు. ఎవరెక్కడ పొదుపు చేస్తున్నారు? ఇంకా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలనుకుంటున్నారు.. అనే విషయాలను ఒకరికొకరు పంచుకోవాలి. అలాగే ఆర్థిక అంశాల్లో ఇద్దరూ కలిసి ఓ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలోనూ తప్పు లేదంటున్నారు. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పొదుపు చేయచ్చు.. లేదంటే ఇద్దరూ కలిసి సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకోవచ్చు.. నిజానికి ఇలాంటి సుదీర్ఘ లక్ష్యాలే మిమ్మల్ని కడదాకా కలిపి ఉంచుతాయంటున్నారు నిపుణులు.

ఎవరికి వారుగా.. కలిసికట్టుగా..!

భార్యాభర్తలిద్దరూ తమ అనుబంధాన్ని డీటాక్స్‌ చేసుకోవడంలో భాగంగా కలిసి చేయాల్సిన పనులే కాదు.. విడివిడిగా చేయాల్సినవీ కొన్నున్నాయి. అందులో అన్నింటికంటే ముఖ్యమైనది స్వీయ ప్రేమ. ఇలా ఎవరిని వారు ప్రేమించుకోవడం వల్ల కలిగే సంతోషం ఎదుటివారిలోనూ మంచిని, పాజిటివిటీనే చూడగలుగుతుంది. ఫలితంగా ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు దొర్లకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇందుకోసం మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవడం, మీకు నచ్చినట్లుగా తయారవడం, స్నేహితులతో సరదాగా గడపడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లడం.. వంటివి చేయచ్చు. ఈ క్రమంలో మీకు సొంతమైన అనుభవాలు, అనుభూతుల్ని మీ భాగస్వామితోనూ పంచుకోవచ్చు.. ఇలా కూడా ఇద్దరూ కలిసి సమయం గడపడానికి కాస్త వీలు చిక్కుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్