స్నేహితులైనా.. ఈ విషయాలు పంచుకోవద్దు!

కుటుంబ సభ్యుల తర్వాత మనం ఎక్కువగా నమ్మేది మన ప్రాణ స్నేహితుల్నే. అందులోనూ కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ల దగ్గర చెప్పకుండా రహస్యంగా దాచిపెడతామేమో గానీ.. ప్రాణ స్నేహితులకు మాత్రం అన్నీ చెబుతుంటాం.. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ నిర్మొహమాటంగా వారితో పంచుకుంటాం.

Published : 08 Jun 2024 20:43 IST

కుటుంబ సభ్యుల తర్వాత మనం ఎక్కువగా నమ్మేది మన ప్రాణ స్నేహితుల్నే. అందులోనూ కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ల దగ్గర చెప్పకుండా రహస్యంగా దాచిపెడతామేమో గానీ.. ప్రాణ స్నేహితులకు మాత్రం అన్నీ చెబుతుంటాం.. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ నిర్మొహమాటంగా వారితో పంచుకుంటాం. అయితే ఇది సరికాదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఎంత నమ్మకమైన స్నేహితులైనా.. కొన్ని విషయాలు వారితో పంచుకోకపోవడమే మేలంటున్నారు. ఇంతకీ ఏంటా విషయాలు? ఎందుకు పంచుకోకూడదు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

వారి గురించి నెగెటివ్‌గా!

భార్యాభర్తలన్నాక ఇద్దరి మధ్య సవాలక్ష విషయాలుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలూ వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే కొంతమంది తమ భాగస్వామి తమను ప్రశంసించినా, మెచ్చిన కానుకిచ్చినా, ఇద్దరి మధ్య గొడవలైనా.. ఇలా ప్రతిదీ దాచుకోకుండా తమ స్నేహితులతో పంచుకుంటుంటారు. కానీ ఇలా చేయడం కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత ప్రాణ స్నేహితులైనా.. మీ భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు మీ ఇద్దరి మధ్యే ఉంచుకోవడం, మీరిద్దరే ఒకరికొకరు పంచుకోవడం వల్ల ఆ అనుభూతి వేరుగా ఉంటుందంటున్నారు. అలాగే గొడవలైనప్పుడు కూడా.. మీ భాగస్వామి గురించి మీ స్నేహితులతో నెగెటివ్‌గా చెప్పడం, వారు చేసిన పొరపాట్ల గురించి పదే పదే ప్రస్తావించడం వల్ల.. మీ భాగస్వామిపై వారిలో ఒక రకమైన ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది ఇటు మీ స్నేహానికి, అటు మీ ఆలుమగల అనుబంధానికి.. రెండు రకాలుగా నష్టమే! కాబట్టి మీ ఇద్దరి మధ్య పరిష్కారం కాని గొడవలేమైనా ఉంటే వారి సలహాలు తీసుకోవచ్చు.. అంతేతప్ప మిగతా విషయాల్ని మీ మధ్యే ఉంచుకోవడం మంచిది.

బాధలతో భారం కావద్దు!

నిత్యం మన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనలకు లోనవడం, కోపంతో చిరాకు పడడం సహజం. అయితే ఇలా మనసుకు బాధ కలిగినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది మన స్నేహితులే! అందుకే వెంటనే వారికి ఫోన్‌ చేసి మనసులోని బాధనంతా వెళ్లగక్కుతాం. అయితే స్నేహితులపై మరీ ఇంతలా ఆధారపడడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో బాధ కలగచ్చు.. దానికి తోడు మీకు సంబంధించిన బాధలన్నీ వారితో పంచుకోవడం వల్ల వారి మనసు భారాన్ని పెంచిన వారవుతారు. అంతేకాదు.. ఇలా చిన్న చిన్న విషయాలకూ వారిపై ఆధారపడడం, వారి సలహాలు కోరడం వల్ల వారి దృష్టిలో మీరు చులకనయ్యే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి కొన్ని సమస్యల్ని మీకు మీరే పరిష్కరించుకుంటే.. మీలోని అభద్రతా భావం దూరమై.. ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు నిపుణులు.

ఆ ముద్దూ ముచ్చట్లు.. మీ మధ్యే!

ఆలుమగల అనుబంధాన్ని దృఢం చేసే అంశాల్లో శృంగారం ఒకటి.. ఇద్దరి జీవితంలో ఇది చాలా సున్నితమైన అంశం. నాలుగ్గోడల మధ్య జరిగే ఈ ముద్దూ ముచ్చట్లనూ కొందరు తమ ప్రాణ స్నేహితులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో తమ భాగస్వామి బలహీనతల్నీ షేర్‌ చేసుకునే వారు లేకపోలేదు. ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. ఏదైనా సలహా ఇస్తారేమోనని మీరు పంచుకున్నప్పటికీ.. అవతలి వారు ఇలాంటి విషయాలు వినడానికి ఆసక్తి చూపకపోవచ్చు. తద్వారా వారిని ఇబ్బంది పెట్టిన వారవుతారు. అంతేకాదు.. వారి ద్వారా ఇలాంటి విషయాలు మరొకరికి తెలిసి, ఆపై వారు మీ భాగస్వామికి చెప్తే.. మీ అనుబంధంలో సమస్యలొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాల గురించి భార్యాభర్తలే ఒకరితో ఒకరు పంచుకోవాలి. అంతగా మీ లైంగిక జీవితంలో ఇబ్బందులేమైనా ఉంటే.. నిపుణుల వద్దకు వెళ్లి పరిష్కరించుకోవడం మరీ మంచిది.

అత్తింటి ఆరళ్లు!

ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం, తిరిగి సద్దుమణగడం సహజం. ఈ క్రమంలో కొంతమంది మహిళలు వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మథన పడుతుంటారు. పోనీ.. ఈ విషయాలు పుట్టింట్లో చెబుదామా అంటే.. అనవసరంగా వారిని బాధపెట్టడం ఎందుకనుకుంటారు. ఇక ఆ తర్వాత ఆప్షన్‌ స్నేహితురాలే! అయితే అత్తింట్లో జరిగే గొడవల్లోనూ ప్రతిదీ స్నేహితుల దాకా తీసుకెళ్లడం సరికాదంటున్నారు నిపుణులు. దానివల్ల వారు పొరపాటున మరెక్కడైనా, ఇంకెవరితోనైనా ఈ విషయాలు చెప్పినా, అవి మూడో వ్యక్తి ద్వారా మీ అత్తింటి వారికి, మీ భర్తకు తెలిసినా.. సమస్య పెద్దదవుతుంది. ఇంటి విషయాలు రచ్చకీడుస్తున్నారని మీపై నెగెటివ్‌ ముద్ర పడిపోతుంది. ఇలా కోరి కోరి గొడవలు పెంచుకోవడం కంటే.. అత్తింట్లో మీకు ఎవరితోనైతే భేదాభిప్రాయాలు వచ్చాయో.. వారితోనే నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఆ చాడీలే వద్దు!

ఎంత ప్రాణ స్నేహితులైనా.. అప్పుడప్పుడూ వారి మధ్యా చిన్న చిన్న అపార్థాలు చోటుచేసుకుంటాయి. అయితే ఈ క్రమంలో కొంతమంది ఈ గొడవల గురించి ఇతర స్నేహితులతో పంచుకోవడం, వారి గురించి నెగెటివ్‌గా చెప్పడం, లేనిపోని చాడీలు చెప్పడం.. వంటివి చేస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల మీ గురించి, మీ స్నేహం గురించి అవతలి వారికి నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే మీ ప్రాణ స్నేహితురాలికీ మీపై ఉన్న సదభిప్రాయం దెబ్బతింటుంది. ఫలితంగా గొడవలు మరింత పెద్దవవుతాయి. మీ మధ్య స్నేహబంధమూ సన్నగిల్లుతుంది. ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే.. ఓపికతో మీరిద్దరే గొడవల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా మీ స్నేహబంధమూ మరింత దృఢమవుతుందని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్