పాత స్నేహితుల్ని కలుస్తున్నారా?

స్నేహితులతో కలిసి గడిపే క్షణాలు ఎప్పుడూ ప్రత్యేకమే! సంతోషాన్ని పంచుకోవాలన్నా, బాధను దించుకోవాలన్నా ప్రాణ స్నేహితులే మనకు గుర్తొస్తారు. మరి, ఇలాంటి స్నేహబంధం కొన్ని సందర్భాల్లో దూరం కావచ్చు.. చదువు/వృత్తి ఉద్యోగాల రీత్యా వేరే చోటికి వెళ్లడం....

Published : 17 Feb 2023 19:05 IST

స్నేహితులతో కలిసి గడిపే క్షణాలు ఎప్పుడూ ప్రత్యేకమే! సంతోషాన్ని పంచుకోవాలన్నా, బాధను దించుకోవాలన్నా ప్రాణ స్నేహితులే మనకు గుర్తొస్తారు. మరి, ఇలాంటి స్నేహబంధం కొన్ని సందర్భాల్లో దూరం కావచ్చు.. చదువు/వృత్తి ఉద్యోగాల రీత్యా వేరే చోటికి వెళ్లడం, ఫోన్‌ నంబర్‌-అడ్రస్‌ మారడం.. ఇలా పలు కారణాల వల్ల స్నేహితులతో కాంటాక్ట్స్‌ తెగిపోతుంటాయి. ఇలాంటప్పుడు మన పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవాల్సిన సమయం వస్తే.. మనసంతా భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరవుతుంది.. అదే సమయంలో కాస్త నెర్వస్‌గానూ అనిపిస్తుంది. అలాగని అదే ఫీలింగ్‌తో వెళ్తే.. వాళ్లతో గతంలో మాదిరిగా కలిసిపోలేం. అందుకే దూరమైన పాత స్నేహితుల్ని కలుసుకునే క్రమంలో కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే అప్పటి స్నేహాలు తిరిగి చిగురిస్తాయని చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

నేరుగా కలవద్దు!

ఎంత ప్రాణ స్నేహితులైనా, ఇద్దరి మధ్య ఎంత చనువు ఉన్నా.. కొన్నేళ్ల పాటు దూరమై.. తిరిగి కలుసుకోవాలంటే మనసులో ఏదో మూల కాస్త నెర్వస్‌గా అనిపిస్తుంటుంది. ఇన్నేళ్ల గ్యాప్‌లో అవతలి వాళ్లు ఎంతలా మారిపోయారో, గతంలో మాదిరిగా నాతో కలిసిపోతారో లేదోనన్న సందేహం చాలామందిలో కలగడం సహజం. అదే సమయంలో తమ పాత స్నేహితుల్ని కలుసుకుంటున్నామన్న ఆనందం కూడా ఉన్నచోట ఉండనివ్వదు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం వారు ఎక్కడ ఉంటున్నారో మీరు తెలుసుకున్నప్పటికీ, వారికి చెప్పకుండా ఒక్కసారిగా వారిని నేరుగా కలవడం కంటే.. ముందు వారికో మెసేజ్‌ పెట్టడం లేదంటే ఫోన్లో మాట్లాడడం, సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేయడం.. వంటివి ఉత్తమం అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్‌ మాయమై.. మునుపటిలా చనువు ఏర్పడుతుంది. అంతేకాదు.. మీ మనసులో ఉన్న నెర్వస్‌నెస్‌ కూడా తొలగిపోతుంది. ఇక ఇప్పుడు కలుసుకుంటే బోలెడన్ని విషయాలు పంచుకోవచ్చు.. అనుబంధాన్నీ తిరిగి పెంచుకోవచ్చు.

ఆతృత పనికిరాదు!

చాలా రోజుల గ్యాప్‌ తర్వాత ప్రాణ స్నేహితుల్ని కలుస్తున్నామంటే మనసులో ఒక రకమైన ఆనందం ఉంటుంది.. అన్ని విషయాలూ ఒకే రోజు వారితో పంచుకోవాలన్న ఆతృత ఉంటుంది. ఇదే పనికి రాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సుదీర్ఘ గ్యాప్‌లో ఇద్దరి జీవితాల్లో సానుకూల మార్పులుండచ్చు.. ప్రతికూల పరిస్థితులూ ఎదురై ఉండచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా.. అవతలి వారి పరిస్థితి ఆలోచించకుండా కలిసిన రోజే అన్ని విషయాలూ పంచుకోవడం, అవతలి వారు చెప్పేది వినకుండా మీ సంతోషం గురించే ఆలోచించడం.. వంటివి చేస్తే మీ స్నేహితుల మనసు నొచ్చుకోవచ్చు. కాబట్టి కలుసుకున్న రోజు.. ఇద్దరి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి చర్చించుకోవాలి. దాన్ని బట్టే జీవితానుభవాల్ని పంచుకోవాలి. అప్పుడే ఒకరినొకరు తిరిగి అర్థం చేసుకోగలుగుతారు.. నెమ్మదిగా దగ్గరవుతారు.

అందమైన జ్ఞాపకంతో..!

స్నేహమంటేనే బోలెడన్ని మధురానుభూతుల కలబోత! కారణమేదైనా, ఇద్దరి మధ్య ఎన్ని రోజుల గ్యాప్‌ వచ్చినా.. గతంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలు, అనుభూతులు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. స్నేహితుల్ని కలిసిన రోజు వాటిని నెమరువేసుకోమంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఇద్దరూ స్నేహితులైన సందర్భం, వెకేషన్‌కి వెళ్లిన ప్రదేశాలు/ఫొటోలు, చేసిన అల్లరి పనులు.. ఇలాంటివన్నీ తిరిగి మీరు పాత రోజుల్లోకి వెళ్లేలా చేస్తాయి. తిరిగి స్నేహాన్ని దృఢం చేసుకోవాలన్నా, ఇద్దరి మధ్య మునుపటిలా చనువు పెరగాలన్నా ఇదీ కీలకమే అంటున్నారు నిపుణులు.

గొడవలకూ స్వస్తి!

స్నేహితుల మధ్య మధురానుభూతులే కాదు.. అప్పుడప్పుడు గొడవలూ జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల విడిపోయిన స్నేహితులూ ఉండచ్చు. కాబట్టి తిరిగి వారిని కలుసుకునేటప్పుడు నెర్వస్‌గా ఫీలవడం సహజం. ఆ ఫీలింగ్‌ని దూరం చేసుకోవాలంటే.. పాత గొడవలకు స్వస్తి పలకాల్సిందే అంటున్నారు నిపుణులు. తప్పు తెలుసుకొని క్షమాపణ కోరడమే కాదు.. స్నేహం కోసం ఓ మెట్టు దిగినా తప్పు లేదంటున్నారు. ఇదే ఇద్దరి మధ్య అనుబంధాన్ని తిరిగి దృఢం చేస్తుందని చెప్పచ్చు.

లక్ష్యాలు తెలుసుకోండి!

సంతోషాన్ని పంచుకోవడం, బాధలో తోడుండడమే కాదు.. మార్గనిర్దేశనం చేయడంలోనూ స్నేహితులు ముందే ఉంటారు. అందుకే పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకునే క్రమంలో ఇద్దరూ ఒకరి భవిష్యత్‌ లక్ష్యాల్ని మరొకరు పంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల మీరు ఎంచుకున్న ఆశయం సరైందో, కాదో.. లేదంటే దానికంటే ఇంకా ఉత్తమమైన మార్గాలుంటే వారు మీతో పంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇద్దరి కెరీర్‌ అభివృద్ధికీ మంచిదే! పరోక్షంగా ఇది స్నేహబంధాన్నీ తిరిగి దృఢం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్