శ్రద్ధగా వింటేనే.. బంధాలూ బాగుంటాయి!

నిత్యం మనం ఎంతోమందితో ఎన్నో విషయాలు చర్చిస్తుంటాం. ఇందులో చాలామంది ఎదుటి వారు నేను చెప్పేది మాత్రమే వినాలనే మనస్తత్వంతో ఉంటారు. ఎదుటివారిని డామినేట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా ఇతరులకు వారిపై వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంటుంది. ఇలా లాభాల కంటే నష్టాలే...

Updated : 20 Apr 2022 17:29 IST

నిత్యం మనం ఎంతోమందితో ఎన్నో విషయాలు చర్చిస్తుంటాం. ఇందులో చాలామంది ఎదుటి వారు నేను చెప్పేది మాత్రమే వినాలనే మనస్తత్వంతో ఉంటారు. ఎదుటివారిని డామినేట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా ఇతరులకు వారిపై వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంటుంది. ఇలా లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఎదుటివారు చెప్పేది సావధానంగా వినడం వల్ల మంచి థెరపీగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఎదుటి వ్యక్తితో మంచి బంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో తెలుసుకుందాం రండి...

ఆసక్తితో వినాలి...

ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాటలను ఆసక్తితో వింటూ అదే అంశంపై సరైన ప్రశ్నలు సంధిస్తుండాలి. ఇలా చేయడం వల్ల వారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాగే మీరు వారికి గౌరవం ఇస్తున్నారనే భావన కూడా కలుగుతుంది. అయితే ఇలా ఆసక్తితో వినడం అన్ని వేళలా సాధ్యం కాదు. కోపం, అలసటగా ఉన్నప్పుడు ఎదుటివారు చెప్పేది ఆసక్తిగా వినాలంటే కష్టమైన పనే. ఇలాంటి సందర్భాల్లో మూడు విషయాలు గుర్తు పెట్టుకోమంటున్నారు నిపుణులు. అవతలి వ్యక్తి ఇదంతా ఎందుకు చెప్తున్నారు?, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి?, ఈ చర్చ వల్ల అవతలి వ్యక్తితో ఉన్న సంబంధాల్లో ఏదైనా తేడా వస్తుందా? వంటి ప్రశ్నలను మీకు మీరే వేసుకోండి. అప్పుడు వారి మాటలకు ఏ విధంగా స్పందించాలో తెలుస్తుంది.

ఫోన్‌ని దూరం పెట్టండి...

ఇతరులు ఒక విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తున్నప్పుడు వారికి, వారి మాటలకు గౌరవం ఇవ్వాలి. కానీ కొంతమంది వినడం ఆపేసి తమ దృష్టిని ఫోన్‌పై కేంద్రీకరిస్తుంటారు. ఈ పద్ధతి అవతలి వ్యక్తిని నిరుత్సాహపరుస్తుంది. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు గ్యాడ్జెట్లను దూరంగా ఉంచండి.

వివరంగా చెబుతున్నారా?

కొంతమంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ముక్తసరిగా ఒక్క మాట (అవును, కాదు)తో ఆ సంభాషణను పూర్తి చేస్తుంటారు. అయితే ఇది అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. కొన్ని సమయాల్లో వివరంగా  మాట్లాడితే తప్ప ఇరువురిలోనూ సదరు విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన రాకపోవచ్చు. ఈ క్రమంలో- క్లుప్తంగా మాట్లాడితే సరిపోతుంది అనుకున్నప్పుడు తప్ప, మిగిలిన సందర్భాల్లో మాత్రం సాధ్యమైనంతవరకు వివరంగా మాట్లాడ్డానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇలా మాట్లాడేటప్పుడు కూడా ఎంతవరకు అవసరమో అంత వరకే మాట్లాడాలి తప్ప అధిక ప్రసంగం చేయకూడదు. దాంతో ఇద్దరికీ మాట్లాడే అవకాశం లభించడమే కాకుండా అవతలి వ్యక్తి అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడే అవకాశమూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో పరిచయం లేని వ్యక్తులు కూడా విలువైన సమాచారాన్ని మీతో పంచుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

మధ్యలోనే వద్దు!

అలాగే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వారు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే మనం మాట్లాడేస్తే వారు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోవచ్చు. ఫలితంగా ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటప్పుడు ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండి, వారు మాట్లాడ్డం పూర్తయిన తర్వాతే మనం మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని, దానికి సరైన విధంగా స్పందించే అవకాశం కూడా లభిస్తుంది.

హావభావాలూ ముఖ్యమే!

హావభావాలు కూడా వినికిడి నైపుణ్యాలే అంటున్నారు నిపుణులు. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆసక్తిగా వింటున్నామనేది మన హావభావాలే తెలియజేస్తుంటాయి. కాబట్టి, వారు మాట్లాడుతున్నప్పుడు చిరునవ్వుతో స్పందించడం, తల ఊపడం వంటివి చేయడం ద్వారా అవతలి వ్యక్తికి మన ఆసక్తిని తెలియజేయచ్చు. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఆలోచనలో పడిపోయినట్టుగా ఉండడం కూడా మంచిది కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్