విడాకులు తీసుకున్నారా? ఆ ప్రభావం పిల్లలపై పడనివ్వద్దు..!

విడాకులంటే ఇద్దరు వ్యక్తుల పైనే కాదు.. ఇరు కుటుంబాల పైనా దాని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పిల్లలుంటే వారు తమ తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేరు. ఇకపై తమ తల్లి లేదా తండ్రికి దూరంగా ఉండాల్సి వస్తుందన్న బాధ వారిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది.

Published : 17 Feb 2024 18:47 IST

విడాకులంటే ఇద్దరు వ్యక్తుల పైనే కాదు.. ఇరు కుటుంబాల పైనా దాని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పిల్లలుంటే వారు తమ తల్లిదండ్రులు విడిపోవడాన్ని తట్టుకోలేరు. ఇకపై తమ తల్లి లేదా తండ్రికి దూరంగా ఉండాల్సి వస్తుందన్న బాధ వారిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. ఫలితంగా వారి ఎదుగుదల, కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే విడాకులు తీసుకున్న జంటలు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. ఎదిగే పిల్లలకు తల్లిదండ్రుల అవసరం సమానంగా ఉంటుంది కాబట్టి ఇద్దరూ ఆ లోటు తెలియనివ్వకుండా పిల్లల ఆలనా పాలనను చూసుకోవాలంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

⚛ ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నా స్నేహితులుగా ఉండిపోవడం చూస్తుంటాం. నిజానికి విడాకుల ప్రభావం వాళ్ల పిల్లలపై పడకుండా ఉండేందుకే వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారంటున్నారు నిపుణులు. కాబట్టి విడాకులు తీసుకున్న జంటలూ తమ పిల్లల కోసం స్నేహితులుగా మారచ్చు. ఈ స్నేహబంధమే మీ పరిధుల్లో మీరు ఉండేలా.. మీ పిల్లలకు తల్లి/తండ్రి దూరమయ్యారన్న బాధ లేకుండా చేస్తుందని చెబుతున్నారు.

⚛ జంటలు విడాకుల దాకా వెళ్లాయంటే విభేదాలు, తెగని సమస్యలేవైనా ఉండే ఉంటాయి. అయితే మీరు విడిపోయినా మీ మధ్య ఉన్న తగాదాల్ని పిల్లల దాకా తీసుకురావద్దంటున్నారు నిపుణులు. వారి పరోక్షంలో మీరు ఎలా ఉన్నా.. వాళ్ల సమక్షంలో ఇద్దరూ కలుసుకునే సందర్భాలొస్తే మాత్రం మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టి పిల్లలకు ప్రేమను పంచడం ముఖ్యమంటున్నారు.

⚛ తల్లిదండ్రులు విడిపోతున్నారన్న ఆలోచన పిల్లల్లో ఒక రకమైన అభద్రతా భావానికి, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. ఇది కూడా వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ భావన వారి మనసులోకి రాకముందే జంటలు జాగ్రత్తపడాల్సి ఉంటుంది. కలిసున్నప్పుడు వాళ్ల బాధ్యతను ఎలాగైతే పంచుకున్నారో, విడిపోయాకా దాన్ని కొనసాగించడం మంచిది.

⚛ కొంతమంది భాగస్వామితో విడిపోయాక.. తమ పిల్లల్నీ వారికి దూరంగా ఉంచాలనుకుంటారు. ‘అలాంటి వ్యక్తి నీడ కూడా నా పిల్లలపై పడనివ్వను’ అంటూ శపథాలు చేస్తుంటారు. నిజానికి ఇలాంటి కోపతాపాలు, ఆవేశం తగదంటున్నారు నిపుణులు. మీరు విడిపోయినా.. ఎప్పటిలాగే పిల్లల్ని వారికి దగ్గరగా ఉంచడం వల్ల వారు తల్లిదండ్రుల్ని మిస్సవకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే వారి బాధ్యతల భారం ఒక్కరిపై పడకుండానూ ఉంటుంది.

⚛ జంటలు విడిపోయాక.. ఇద్దరూ వేర్వేరు ఇళ్లకు మారడం సహజమే! అయితే ఇలా మీరిద్దరూ దూరంగా ఉన్నా.. పిల్లలకు మాత్రం ఎప్పటిలాగే దగ్గరగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ వాళ్లతో ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్స్‌ చేయడం, అప్పుడప్పుడూ వాళ్లను బయటికి తీసుకెళ్లడం, కుదిరితే అందరూ కలిసి చిన్న వెకేషన్‌ ప్లాన్‌ చేసుకోవడం.. ఇలా పిల్లల భవిష్యత్తు కోసం మీ పంతాల్ని పక్కన పెట్టి రాజీ పడడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.

⚛ ఉదయాన్నే నిద్ర లేవడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా.. కుటుంబంలో పిల్లలు, పెద్దలు ఒక రకమైన జీవనశైలికి అలవాటు పడిపోతారు. అయితే విడాకులు తీసుకోవడం వల్ల ఈ రొటీన్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం కూడా పిల్లల ఎదుగుదలపై పడుతుంది. కాబట్టి మీరిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ పిల్లల రొటీన్‌ దెబ్బతినకుండా, సమయానికి పనులు పూర్తి చేసేలా వారిని ప్రోత్సహించాలి.

⚛ ఇక వారి పుట్టినరోజుల్ని కలిసే సెలబ్రేట్‌ చేయడం, విజయాల్నీ కలిసే ఆస్వాదించడం, చదువు-ఇతర విషయాల్లో వారిని జంటగా ప్రోత్సహించడం వల్ల మీ విడాకుల ప్రభావం వారిపై పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

⚛ భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉన్నా.. పిల్లల చదువు, వారి స్కూల్‌ ఫీజు, వారు ఎంచుకునే కెరీర్‌ మార్గాల గురించి ఇద్దరూ కూలంకషంగా చర్చించుకొని.. వారితో మాట్లాడాలి. అప్పుడే పిల్లలు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా మంచి మార్గంలో పయనిస్తారు.

⚛ విడాకులతో దంపతుల మనసులు దెబ్బతింటాయి.. దీని ప్రభావం వారి పక్కనున్న వారిపై చూపిస్తుంటారు. అంటే.. అవతలి వ్యక్తులు మాట్లాడించినా చిరాకు పడడం, కోపగించుకోవడం.. వంటివి చేస్తుంటారు. మీ కోపాన్ని పిల్లల పైనా ఇలాగే చూపించారంటే వారి మనసు మరింతగా చిన్నబుచ్చుకుంటుంది. కాబట్టి మీ కోపాన్ని మనసులోనే అణచుకొని వారితో శాంతంగా మాట్లాడడం, రోజూ స్కూల్లో జరిగిన విషయాల గురించి తెలుసుకోవడం.. వంటివి చేయాలి.

ఇలా మీరిద్దరూ విడిపోయినా దాని ప్రభావం వారిపై పడకుండా ఉండాలంటే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మసలుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అప్పుడే వారు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా అభివృద్ధి సాధించగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్