మితిమీరితే కట్టడి చేయాల్సిందే...

వేలెడంత లేదు. పెద్ద ఆరిందలా మాట్లాడుతోంది అని ఒకరు. టీవీ పెడితేనే అన్నం తింటా... చాక్లెట్‌ ఇస్తేనే హోం వర్క్‌ రాస్తా అని మొండి కేస్తున్నాడని మరొకరు... అడగాలే గానీ, ఇలా పిల్లలపై బోలెడు ఫిర్యాదులు చెప్పేస్తారు తల్లిదండ్రులు. కొన్నిసార్లు వారికి సమాధానం చెప్పలేక, అల్లరిని నియంత్రించలేక కొట్టడం, తిట్టడం చేస్తుంటారు.

Published : 03 Jan 2023 01:12 IST

వేలెడంత లేదు. పెద్ద ఆరిందలా మాట్లాడుతోంది అని ఒకరు. టీవీ పెడితేనే అన్నం తింటా... చాక్లెట్‌ ఇస్తేనే హోం వర్క్‌ రాస్తా అని మొండి కేస్తున్నాడని మరొకరు... అడగాలే గానీ, ఇలా పిల్లలపై బోలెడు ఫిర్యాదులు చెప్పేస్తారు తల్లిదండ్రులు. కొన్నిసార్లు వారికి సమాధానం చెప్పలేక, అల్లరిని నియంత్రించలేక కొట్టడం, తిట్టడం చేస్తుంటారు. అలా చేస్తే... మరింత మొండిగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మరి ఈ ఇబ్బందిని ఎలా అధిగమించాలంటే...

ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతిదీ స్వయంగా చూసి తెలుసుకోవాలనుకుంటారు. ఆటలు, బొమ్మలు, ఫ్రెండ్స్‌ విషయంలో స్వేచ్ఛ, స్వతంత్ర నిర్ణయాలు కోరుకుంటారు. ఇది తప్పేం కాదు... అయితే మితిమీరిన చనువు తీసుకుని వయసుకి మించి ప్రవర్తిస్తుంటే మాత్రం కట్టడి చేయాల్సిందే. ఆ సమయంలో వారి భావావేశాలకు తలొగ్గితే... దాన్నే అలుసుగా తీసుకుని పదే పదే కోరింది సాధించుకుంటారు. అలా కాకూడదంటే... వారు ప్రత్యామ్నాయ విషయాలపై దృష్టి పెట్టేలా చేయాలి.

పిల్లలు మాట వినాలన్నా, వారి అల్లరి అదుపులో ఉండాలన్నా ముందు పెద్దలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చిన్నారులు వారిలోని కోపం, అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తం చేస్తారు. వాటిని చూసి మాట వినట్లేదనుకుని పొరబాటు పడుతుంటారు. ఇలాంటప్పుడు వారికి మీ అవసరం ఎంతో. కొత్త విషయాలు దగ్గరుండి నేర్పించే ఓపిక మీకు అవసరం. వారికి నిర్ణయాధికారం ఇస్తూనే అవసరమైన చోట సరిదిద్దే పట్టుని తెచ్చుకోండి. అప్పుడు మీ మాట చక్కగా వింటారు.

పిల్లలకు వాళ్ల పనులు వాళ్లే చేసుకునే అలవాటు చేయాలి. అలా చేయడానికి  వెంటనే ఇష్టపడకపోవచ్చు. అందుకే మీరు పనులు చేస్తున్నప్పుడు సరదాగా కబుర్లు చెబుతూ వారితోనూ చేయించండి. అలాగని బరువులెత్తించమని కాదు. ఆమె ఆడుకునే బొమ్మలు తానే చక్కగా సర్దుకోవడం, అన్నం తిన్నాక తన ప్లేటు శుభ్రం చేసుకోవడం వంటి చిన్నచిన్నవి చేయించండి. క్రమంగా వీటిని దినచర్యలో భాగం అనుకుంటారే తప్ప భారంగా భావించరు.

పిల్లలు మొండికేస్తుంటే బలవంతంగా వారిని దారిలోకి తెచ్చుకోవాలని చూడకండి. వారి సమస్యను అర్థం చేసుకోండి. పిల్లల ప్రవర్తన కొన్నిసార్లు మనపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. పెద్దవాళ్లుగా మీకే ఓ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే... మీరెలా ప్రవర్తిస్తారు? కోపంగా.. అరుస్తున్నారా? మొండిగా వాదిస్తున్నారా? అలా అయితే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా మనం ఉంటే.. మనల్ని చూసి పిల్లలూ నేర్చుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్