Exam Stress: అమ్మలకు అగ్నిపరీక్ష

ఏడాదంతా చదవడం ఒక ఎత్తయితే.. పరీక్ష రాయడం ఇంకో ఎత్తు. భయంతో చదివింది మర్చిపోవడం, సమర్థంగా రాయలేకపోవడం కద్దు. ఈ సమయం పిల్లలకే కాదు అమ్మలకీ గుబులు పెట్టించేదే! అన్నింటినీ అందరినీ దూరం పెట్టేసి ధ్యాసంతా చదివించడం మీదే.

Updated : 20 Mar 2023 02:01 IST

ఏడాదంతా చదవడం ఒక ఎత్తయితే.. పరీక్ష రాయడం ఇంకో ఎత్తు. భయంతో చదివింది మర్చిపోవడం, సమర్థంగా రాయలేకపోవడం కద్దు. ఈ సమయం పిల్లలకే కాదు అమ్మలకీ గుబులు పెట్టించేదే! అన్నింటినీ అందరినీ దూరం పెట్టేసి ధ్యాసంతా చదివించడం మీదే. ఈ నేపథ్యంలో మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..

వాళ్టి రోజున బాగా చదివితేనే స్థిరమైన జీవితం అనుకుంటున్నారంతా. దీంతో చదువూ వ్యాపార ధోరణిలోకి మారింది. ఆ పోటీలో నెగ్గుకురావాలనే ఆశతో తల్లిదండ్రులు ‘నీ కోసం మేమింత కష్టపతున్నాం, నువ్వు దానికి తగ్గట్టు చదివి బాగా స్థిరపడాలి’ అంటారు. తండ్రుల కంటే తల్లులు సున్నితం కనుక బాగా చదవమని ఒత్తిడిచేస్తారు. ప్రోత్సహించడం మంచిదే. కానీ తమ పిల్లల సామర్థ్యం గురించి ఆలోచించడం లేదు. ఎక్కువసేపు చదివితే ఎక్కువ మార్కులొస్తాయని, బొత్తిగా సేదతీరనివ్వడంలేదు. బాగా చదవమని పోరుపెడతారు. అనుక్షణం సలహాలిస్తూ, భయపెడతారు. చదువుకున్న అమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. పోటీ తట్టుకోవాలంటే చాలా శ్రమించాలనుకుంటారు.

స్కూల్లో, ట్యూషన్లో ఎటూ చదివిస్తారు. ఇంట్లోనూ క్షణం వృథా చేయొద్దంటే అది మామూలు ఒత్తిడి కాదు. మీ పిల్లలకూ మంచి మార్కులే రావచ్చు. కానీ ముందుగానే అంచనాలొద్దు. వాళ్లకు చదువు ప్రాధాన్యత గురించి చెప్పి ఇక వదిలేయండి. వాళ్లు బాధ్యతగానే ఉంటారు. మార్కులు, ర్యాంకులు అంటూ ప్రమాణాలూ ఉద్వేగాలూ సరికాదు. వీటివల్ల అమ్మలకూ, పిల్లలకూ కూడా ఆందోళనే. నిజానికి వాళ్లకీ బోలెడు సందేహాలు, అనుమానాలుంటాయి. అంచనాలు భయపెడుతుంటాయి. అమ్మానాన్నల ఆశలు, టీచర్లకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వీటన్నింటి మధ్య తమను నిరంతరం అమ్మ గమనిస్తూ సలహాలిస్తోంటే ఆందోళన చెందుతారు. అసలే చదవగలమా అనే సందేహం.. అన్నింటా స్నేహితులు మెరుగ్గా ఉంటే ఆందోళన.. చదివిన ప్రశ్నలు పరీక్షల్లో వస్తాయా, భవిష్యత్తు ఏమవుతుందన్న కంగారు.. పరీక్ష సరిగ్గా రాయకపోతే అంతా అవమానిస్తారన్న భయం.. ఇన్ని దిగుళ్లతో పుస్తకాల ముందు కూర్చున్నా చదవలేరు. రోజులలా గడిచి పరీక్షలు వచ్చేసరికి కంగారు మరీ ఎక్కువౌతుంది. ఆ టెన్షన్‌తో చదివినవీ గుర్తురావు. ఫెయిలైపోతానని బెంబేలుపడతారు.


పరిష్కారం ఏమిటంటే..

పిల్లల్ని మంచి విద్యాసంస్థలో చేర్పించాం. ఏడాదంతా చదివారు. నెలవారీ పరీక్షలన్నిటిలో ఉత్తీర్ణులయ్యారు. ముందే అనేక ఆందోళనలతో సతమతమౌతున్న పిల్లల్ని మనం ఇంకా ఒత్తిడిపెట్టకూడదు. ఇంత పోటీ ఉన్నందున మన పిల్లలకు ర్యాంకు వచ్చినా, రాకపోయినా అర్థంచేసుకుని అంగీకరించాలి. జీవితంలో స్థిరపడటమే ముఖ్యం కానీ ఈ లక్ష్యాలు కాదు అనుకోవాలి. వాళ్ల ఒత్తిడి తగ్గించాలే గానీ పెంచకూడదు. అందుకోసం ఆశావహంగా ఉండాలి. ‘నువ్వు కష్టపడి చదివావు కదా! చక్కగానే రాస్తావు! ఫలితం గురించి ఆలోచించక నిశ్చింతగా ఉండు’ అంటూ అనునయించాలి.

కొందరు పిల్లలు పరీక్షల కంగారులో అర్థంకాలేదు, మర్చిపోతున్నామంటారు. అలాంటప్పుడు విడమరిచి చెప్పండి, లేదా చెప్పించండి. విన్నది గుర్తుంచుకోమని, సుదీర్ఘమైనవి తేలిగ్గా రాయమని చెప్పి నిబ్బరం కలిగించండి. అంతేకానీ మాటిమాటికీ సలహాలివ్వొద్దు. వాళ్లంతట వాళ్లు చదువుకునేలా చేయండి. అడిగితేనే ఆసరా ఇవ్వండి. అవసరమైతేనే సాయం చేయండి. పక్కనే ఉండి డిపెండెన్సీ పెంచొద్దు. ఆందోళనకూ గురిచేయొద్దు.

ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచండి. బిగ్గరగా మాట్లాడటం, టీవీ హోరూ వద్దు. ఇష్టమైనవారితో మాటలు, నచ్చిన వ్యాపకం.. అలా మధ్యలో సేద తీరుతుంటే ఒత్తిడి ఉండదు. కొందరు ముందంతా ఒత్తిడి చేసి చివర్లో పరీక్ష తప్పినా ఫర్లేదనేస్తారు. ఇలాంటి ధోరణి కూడదు. కంట్రోల్‌, కరక్షన్‌, కంపేరింగ్‌, కమిట్‌మెంట్‌- ఈ నాలుగూ వద్దు. పిల్లలను విచ్ఛిన్నమయ్యే స్థితికి తీసుకెళ్లక స్థిమితంగా ఉంచండి. సత్ఫలితాలు తప్పకుండా వస్తాయి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్