ఆ బంధం దూరమవుతోందా?

స్నేహబంధం శాశ్వతమైనది.. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణ స్నేహితుల మధ్యా గొడవలు జరగచ్చు.. ఆపై అవతలి వారి ప్రవర్తన, ప్రాధాన్యాల్లోనూ మార్పులు రావచ్చు. ఇలాంటప్పుడు వారిపై మనకు కోపం రావడం, దీంతో వారిని దూరం పెట్టడం.. వంటివి చేస్తుంటాం. కానీ ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరిస్తే ఇద్దరి మధ్య....

Published : 06 Nov 2022 13:14 IST

స్నేహబంధం శాశ్వతమైనది.. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణ స్నేహితుల మధ్యా గొడవలు జరగచ్చు.. ఆపై అవతలి వారి ప్రవర్తన, ప్రాధాన్యాల్లోనూ మార్పులు రావచ్చు. ఇలాంటప్పుడు వారిపై మనకు కోపం రావడం, దీంతో వారిని దూరం పెట్టడం.. వంటివి చేస్తుంటాం. కానీ ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరిస్తే ఇద్దరి మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఈ చిట్కాలు పాటిస్తే తిరిగి వారితో అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

కారణమేంటో తెలుసుకోండి!

ప్రతి ఒక్కరిలోనూ మార్పు సహజం. అదే విధంగా మనం ప్రాణంగా అభిమానించే స్నేహితుల ప్రవర్తనలోనూ అప్పుడప్పుడూ మార్పులు కనిపిస్తుంటాయి. అయితే అవి ఎలాంటి మార్పులో ముందు గమనించాల్సి ఉంటుంది. అంటే.. ఎప్పటిలా మీతో మాట్లాడకపోవడం, కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం, మీరు కాల్‌ చేసినా కట్ చేయడం, మెసేజ్‌ చేసినా రిప్లై లేకపోవడం.. వారి ప్రవర్తనలో ఇలాంటి మార్పులు గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ కోపతాపాల్ని పక్కన పెట్టి.. మీ పట్ల తను అలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేశారా? లేదంటే మీ స్నేహాన్ని జీర్ణించుకోలేని మూడో వ్యక్తి మీపై లేనిపోనివి కల్పించి చెప్పారా? అదీ కాదంటే తనే కావాలని అలా చేస్తోందా? ఇవన్నీ వారితో కూర్చొని మాట్లాడితేనే ఓ కొలిక్కి వస్తాయి. ఇక అసలు కారణం తెలిశాక.. పొరపాటు ఎవరిదైతే వారు క్షమాపణ కోరితే సమస్య సద్దుమణుగుతుంది.. స్నేహబంధం తిరిగి పరిమళిస్తుంది.

పంతాలకు పోవద్దు!

పంతాలు, పట్టింపులు.. అనుబంధాల్ని దెబ్బతీస్తాయంటారు. స్నేహబంధానికీ ఇది వర్తిస్తుంది. అయితే కొంతమంది తమ స్నేహితులు తమను దూరం పెడుతున్నారని, వారి ప్రవర్తన రోజురోజుకీ మారిపోతోందని వారిపై ద్వేషం పెంచుకుంటారు. ‘తను నాకు ప్రాధాన్యమివ్వనప్పుడు.. నేను తనను పట్టించుకోను!’ అంటూ పంతాలకు పోతుంటారు. ఇదే చినికి చినికి గాలివానలా మారుతుంది.. అనుబంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఓపికతో వ్యవహరించాలంటున్నారు నిపుణులు. అవతలి వారు మిమ్మల్ని పట్టించుకోకపోయినా.. మీరు వారితో ఎప్పటిలాగే మెలగడం, వారి కోపం తగ్గాక వారితో మాట్లాడడం, నిజానిజాలు తెలుసుకోవడం.. వంటివి చేస్తే మీ స్నేహితురాలి ప్రవర్తనలో ఎందుకు మార్పులొస్తున్నాయో అర్థమవుతుంది. ఆపై ఇద్దరి మధ్య తలెత్తిన పొరపచ్ఛాల్ని సరిదిద్దుకొని తిరిగి కలిసిపోవచ్చు.

మీరూ ఇలా మారిపోండి!

మీ స్నేహితుల్లో క్రమంగా మార్పొచ్చి.. వారు మీ నుంచి దూరమవుతున్నట్లు మీరు గమనిస్తే.. మీరూ కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. ఉదాహరణకు.. మీ స్నేహితురాలికి మీరే అతి పెద్ద విమర్శకురాలు అనుకుంటే.. ఇకపై ఈ స్వభావాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి.. ఈ క్రమంలో విమర్శించిన నోటితోనే వారిని ప్రశంసించడం మొదలుపెట్టండి. వారు మీకు స్ఫూర్తిగా నిలిచిన సందర్భాలు/పనుల్ని పదే పదే వారితో పంచుకునే ప్రయత్నం చేయండి. ఇలా మీలో మార్పును క్రమంగా వారు గమనిస్తూ.. మీరు ఎందుకిలా చేస్తున్నారో వాళ్లే తిరిగి మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఇచ్చిన వారవుతారు. ‘ఇదంతా మన స్నేహాన్ని నిలబెట్టుకోవడానికే! నీతో స్నేహం కోసం ఇదేంటి.. ఏదైనా చేస్తా..’ అని చెప్పి చూడండి.. అవతలి వారిలో కోపం, మార్పులు.. అన్నీ తొలగిపోతాయి.. ఆపై మునుపటిలాగే ఇద్దరూ కలిసిపోవచ్చు.

అటు నుంచి ప్రయత్నించండి!

ఎంత చెప్పినా, ఎన్ని చేసినా.. క్రమంగా దూరమవుతోన్న మీ స్నేహితుల్లో మార్పు రాకపోయినా, వారు మీ మాట వినకపోయినా.. ఆఖరుగా మరో మార్గంలో ప్రయత్నించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌లోని ఇతర స్నేహితుల సహాయం తీసుకోవడం లేదంటే మీ ఇద్దరికీ ఉమ్మడి స్నేహితులెవరైనా ఉంటే వారి సహాయం కోరడం.. వంటివి చేయచ్చు. ఇందులో భాగంగా.. ముందుగా వాళ్ల సమస్యేంటో, మీకు ఎందుకు దూరమవుతున్నారో ఇతర స్నేహితుల్ని అడిగి తెలుసుకోమని చెప్పండి.. మీ ఇద్దరి మధ్య స్నేహబంధం దృఢమవడానికి మీరెంతగా ప్రయత్నిస్తున్నారో వారికి వివరించమనండి. ఆపై ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. తద్వారా ఇద్దరి మధ్య స్నేహబంధం తిరిగి దృఢమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్