నీ కోసం.. నువ్వు!

ప్రేమికుల రోజంటే జంటలకే! ఒంటరిగా ఉన్నవారికి దానితో పనేముంది అని ఆలోచిస్తున్నారా? దీని ఉద్దేశమేంటి.. మనసులోని ప్రేమను వ్యక్తం చేయడం కదా! ‘నా మీద నాకెంత ప్రేమ’ అని ఆలోచించుకోండి.

Published : 14 Feb 2023 00:23 IST

ప్రేమికుల రోజంటే జంటలకే! ఒంటరిగా ఉన్నవారికి దానితో పనేముంది అని ఆలోచిస్తున్నారా? దీని ఉద్దేశమేంటి.. మనసులోని ప్రేమను వ్యక్తం చేయడం కదా! ‘నా మీద నాకెంత ప్రేమ’ అని ఆలోచించుకోండి. స్వీయ ప్రేమ వ్యక్తీకరించుకుంటూ.. కాస్త దృష్టిపెట్టేయండిలా..

* ఎవరికోసమో కాకపోయినా ఎన్నో సందర్భాల్లో అందంగా కనిపించాలని తెగ ప్రయత్నించేస్తుంటాం కదా! ఈరోజూ అదే చేయండి. కాకపోతే చర్మ సంరక్షణకి ప్రాధాన్యమివ్వాలి. రోజూలా హడావుడిగా కాకుండా కాస్త సమయం తీసుకొని మృదువుగా ముఖాన్ని శుభ్రం చేయండి. నచ్చిన దాంతో స్క్రబ్‌ చేసి, షీట్‌ మాస్క్‌ లేదంటే అందుబాటులో ఉన్న పండ్లతో మాస్క్‌ వేసేయండి. కడిగేశాక ప్రేమగా మాయిశ్చరైజర్‌ మసాజ్‌ చేస్తున్నట్టుగా రాయండి. అద్దంలో చూసుకుంటే మనసులో ‘ఎంత అందంగా ఉన్నా’ అనిపించిందా! ఫర్లేదు.. వినిపించేలా బయటికి అనేసేయండి.

* చాక్లెట్లు ఇష్టమా? కొనుక్కోండి. బరువు, డైట్‌ అన్న ఆలోచనలు వచ్చేస్తాయేమో! డార్క్‌ చాక్లెట్‌, హెర్బల్‌ టీ, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వంటివి తెచ్చేసుకోండి. ఆరోగ్యం గురించి పట్టించుకోవడమూ ప్రేమను వ్యక్తం చేయడమే.

* మనసుకి ఎంతో నచ్చినవీ.. ఖర్చు ఎక్కువ అని భారంగా పక్కన పడేసిన సందర్భాలు బోలెడు కదూ! ఆ అసంతృప్తికి ఈసారికి చెక్‌ పెట్టేయండి. కావాలంటే నెలవారీ బడ్జెట్‌లో మిగతా వాటిని తగ్గించుకోవాలి. నచ్చింది దక్కిందన్న ఆనందంలో ఆ మాత్రం సర్దుకోలేమా ఏంటి?

* ‘నాలో నాకు నచ్చినవి’ అని ఓ మూడు అంశాలను కాగితం మీద పెట్టేయండి. వ్యక్తిత్వం, సృజనాత్మకత ఏదైనా కావొచ్చు.. చోటిచ్చేయండి. ఇటీవల మీకు మీరే శభాష్‌ అనిపించిన సంఘటనేదో గుర్తుచేసుకోండి. లేదూ సాధించాలి అనుకుంటున్న దాన్ని రాసేయండి. మీ బలం బయటపడుతుంది లేదూ లక్ష్యం ఏర్పడుతుంది.

* ‘నచ్చింది చేసేయాలి’ అని నియమం పెట్టుకోండి. మంచి సినిమా, నచ్చిన పుస్తకం చదవడం, మెచ్చిన దుస్తులు వేసుకోవడం, స్నేహితులతో గడపడం.. ఏది చేయాలనిపిస్తే అది చేసేయండి. మనసు ఎంత ఉల్లాసంగా మారుతుందో! అయితే దీన్ని ఈరోజుకే మాత్రం పరిమితం చేయొద్దు. ఇక నుంచీ  ప్రతినెలా ఓ నియమంలా కొనసాగించాలి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్