దంపతులుగా విడిపోయినా.. స్నేహంగా ఉండాలంటే..!

‘మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోతున్నాం.. కానీ మా మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది..’ చాలామంది సెలబ్రిటీలు తమ విడాకుల ప్రకటనలో చెప్పే విషయమిదే! ఇలా వీళ్లే కాదు.. కొంతమంది సామాన్యులూ తమ భాగస్వామి నుంచి విడిపోయాక.. వాళ్లతో స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఇది మాట్లాడుకున్నంత సులభం....

Published : 27 Jul 2022 21:08 IST

‘మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోతున్నాం.. కానీ మా మధ్య స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది..’ చాలామంది సెలబ్రిటీలు తమ విడాకుల ప్రకటనలో చెప్పే విషయమిదే! ఇలా వీళ్లే కాదు.. కొంతమంది సామాన్యులూ తమ భాగస్వామి నుంచి విడిపోయాక.. వాళ్లతో స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఇది మాట్లాడుకున్నంత సులభం కాదు. ఇదో ఎమోషనల్‌ జర్నీ. ఈ క్రమంలో కొన్ని భావోద్వేగాల్ని, ఆలోచనల్ని అదుపు చేసుకుంటూ అవతలి వ్యక్తితో స్నేహపూర్వక అనుబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే గత చెడు జ్ఞాపకాల నుంచి బయటపడి ఇద్దరూ ఫ్రెండ్స్‌లా కలిసిపోగలుగుతారు. అయితే ఇందుకోసం ఇద్దరూ కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

సమయం తీసుకోండి!

విడాకులైనా, బ్రేకప్‌ అయినా.. అప్పటిదాకా కలిసున్న వ్యక్తికి దూరమవడమంటే అంత సులభం కాదు. ఇద్దరూ విడిపోవడానికి కారణమేదైనా.. పదే పదే వాళ్లే గుర్తుకు రావడం, ఆ జ్ఞాపకాలే మదిలో మెదలడం.. ఇలాంటి ఆలోచనలన్నీ మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈరోజే విడాకులు తీసుకొని.. రేపట్నుంచే ఫ్రెండ్స్‌గా ఉంటామంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇద్దరూ కొన్నాళ్ల పాటు దూరందూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి తమకు నచ్చిన పనులు చేయడం, ఇష్టమైన వ్యక్తుల మధ్య గడపడం, వేరే చోటికి మకాం మార్చడం.. లేదంటే ఉద్యోగం మారడం.. ఇవన్నీ ప్రత్యామ్నాయాలే! వీటి వల్ల స్వీయ ప్రేమ పెరుగుతుంది. ఇది ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అందిస్తుంది. ఇలా మీరు మానసికంగా దృఢమయ్యాక.. తిరిగి మీ మాజీ భాగస్వామితో స్నేహాన్ని కొనసాగించినా ఎలాంటి సమస్యలూ ఎదురుకావంటున్నారు నిపుణులు.

హద్దులు దాటకుండా..!

మాజీ భాగస్వామితో స్నేహబంధాన్ని కొనసాగించే క్రమంలో కొన్ని హద్దులు పెట్టుకోవడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తుండచ్చు.. ఒకే ఆఫీసులో పని చేస్తుండచ్చు.. ఈ క్రమంలో వృత్తిపరమైన విషయాల్ని పక్కన పెడితే.. వ్యక్తిగత అంశాల్లో ప్రైవసీని మెయింటెయిన్‌ చేయడం మంచిదంటున్నారు.

స్నేహం కొనసాగాలంటే..

స్నేహమంటే సుఖాలనే కాదు.. కష్టాలనూ పంచుకునే వారధి. అయితే కొంతమంది స్నేహం ముసుగులోనే తమ మాజీ భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవచ్చు. ఈ క్రమంలో దాంపత్య బంధం నుంచి విడిపోయినా మళ్లీ గొడవలు కావచ్చు.  కాబట్టి విడిపోయాక స్నేహంగా ఉండాలంటే మాత్రం.. ఒకరినొకరు గౌరవించుకోవాలి.. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి.

పిల్లలున్నారా?

పిల్లలు పుట్టకముందు భార్యాభర్తలు విడిపోవడం వేరు.. పిల్లలున్నాక విడాకులు తీసుకోవడం వేరు. ఒకవేళ పిల్లలు పుట్టాక ఇద్దరూ విడిపోతే వాళ్ల బాధ్యత ఇద్దరిపై సమానంగా ఉంటుంది. కాబట్టి విడిపోయిన తర్వాత మీరు స్నేహంగా మెలగాలనుకుంటే.. ఆ విషయం గురించి పిల్లలకు ముందే వివరంగా చెప్పండి. వారికి ఏ విషయంలోనూ ఏ లోటూ లేకుండా చూసుకోండి. కొంతమంది సెలబ్రిటీ జంటలు విడిపోయినా.. తమ పిల్లల సంతోషం కోసం అందరూ కలిసి విహార యాత్రలకు వెళ్లడం, ఇరు కుటుంబాల్లో ఏవైనా వేడుకలకు హాజరవడం.. వంటివి మనకు తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్