Relationship Tips: అది చూసే దృష్టిని బట్టే ఉంటుందట!
మంచి కంటే చెడే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. వ్యక్తులే కాదు.. అనుబంధాలూ ఇలాగే ప్రభావితమవుతుంటాయి. ఇద్దరి మధ్య గొడవైనా, మూడో వ్యక్తి వల్ల సమస్య వచ్చినా.. చాలామంది విషయంలో భాగస్వామిని చూసే దృష్టి కోణం ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది.
మంచి కంటే చెడే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. వ్యక్తులే కాదు.. అనుబంధాలూ ఇలాగే ప్రభావితమవుతుంటాయి. ఇద్దరి మధ్య గొడవైనా, మూడో వ్యక్తి వల్ల సమస్య వచ్చినా.. చాలామంది విషయంలో భాగస్వామిని చూసే దృష్టి కోణం ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది. దీన్నే ‘నెగెటివ్ సెంటిమెంట్ ఓవర్‌రైడ్’ అంటున్నారు నిపుణులు. అదే ఆ క్షణికావేశం నుంచి బయటపడి.. అవతలి వారిలోని మంచిని చూడగలిగితే.. దంపతుల మధ్య వచ్చే ఎన్నో అభిప్రాయభేదాలకు ఆదిలోనే చెక్ పెట్టచ్చంటున్నారు. అనుబంధాన్ని పెంచుకోవాలన్నా, తెంచుకోవాలన్నా.. మనం భాగస్వామిని చూసే దృష్టి కోణం పైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరి, వారిలో మంచిని చూస్తే ఏ చిక్కూ ఉండదు. అదే నెగెటివ్ దృష్టితో చూసినప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ దృష్టి కోణాన్ని మార్చుకొని అనుబంధాన్ని దృఢం చేసుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.
ఎందుకీ నెగెటివిటీ?
భార్యాభర్తలన్నాక ఏదో ఒక విషయంలో కలతలు, గొడవలు సహజం. అయితే ఇలా అభిప్రాయభేదాలొచ్చిన ప్రతిసారీ ఒకరినొకరు నెగెటివ్ దృష్టి కోణంలోనే చూస్తుంటారు. ఇద్దరి మధ్య ఇలాంటి ప్రతికూల భావన పెరగడానికి కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు.
⚛ దాంపత్య బంధానికి నమ్మకమే పునాది. కానీ కొన్నిసార్లు పలు కారణాల వల్ల ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతుంటారు. ఈ అపనమ్మకంతో అనుమానాలు మొదలవుతాయి. ఇవే క్రమంగా ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయంటున్నారు నిపుణులు. అందుకే నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు.. దంపతులిద్దరూ ఏ విషయాన్నైనా స్పష్టంగా మాట్లాడుకోవాలంటున్నారు.
⚛ వ్యక్తిగత, కెరీర్ పనుల బిజీలో పడిపోయి కొంతమంది దంపతులకు కలిసి గడిపే సమయమే దొరకదు. ఇక దీన్నిలాగే నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇదే ఒకరిపై ఒకరికి నెగెటివ్ అభిప్రాయాలు ఏర్పడేందుకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా చూసే దృష్టి కోణం కూడా నెగెటివ్‌గానే ఉంటుందంటున్నారు.
⚛ ఆలుమగల మధ్య పదే పదే గొడవలు జరగడం వల్ల కూడా ఒకరినొకరు చూసే దృష్టి కోణం ప్రతికూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదే గొడవలు జరిగినప్పుడు అవతలి వారిలో సానుకూలమైన అంశాల్ని కూడా చూడగలిగితే.. వాళ్లను చూసే దృష్టి కోణం కూడా పాజిటివ్‌గా మారుతుందంటున్నారు.
⚛ భాగస్వామి ఏం చెబుతున్నారో వినరు కొందరు. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాళ్లు అవతలి వ్యక్తిలో పాజిటివిటీని ఎప్పుడూ చూడలేరని చెబుతున్నారు నిపుణులు.
⚛ కొంతమంది స్వభావం చంచలంగా ఉంటుంది. అప్పుడే సరేనంటారు.. ఆ మరుక్షణమే కాదంటారు. ఇలా మనసు నిలకడగా లేని వారూ తమ భాగస్వామి విషయంలో పాజిటివ్‌గా ఆలోచించలేకపోతారని నిపుణులు అంటున్నారు.
⚛ భాగస్వామి అంటే కొంతమందిలో ఒక రకమైన భయం ఉంటుంది. తమ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తారేమో, ప్రతి విషయంలో తమను ఎక్కడ పక్కన పెట్టేస్తారోనన్న అనవసర ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటుంటారు. ఈ భయంతోనే భాగస్వామినీ ప్రతి విషయంలోనూ నెగెటివ్ దృష్టితోనే చూస్తుంటారట!
మార్పుతోనే బంధం దృఢం!
ఏదేమైనా భాగస్వామిని చూసే ఈ నెగెటివ్ దృష్టి కోణాన్ని మార్చుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అప్పుడే అనుబంధాన్ని తిరిగి దృఢం చేసుకోవచ్చంటున్నారు.
⚛ ఆలుమగలు ఎంత దగ్గరైతే.. ఇద్దరి మధ్య అంత పాజిటివిటీ పెరుగుతుంది. అందుకే వీలైనంత సమయం కలిసి గడిపేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు.. ఇద్దరి మధ్య సానుకూల చర్చలు జరగాలంటున్నారు.
⚛ గొడవలైనప్పుడు విమర్శించుకోకుండా.. అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోవడానికి దంపతులిద్దరూ ప్రయత్నించాలి. అప్పుడే గొడవ సద్దుమణుగుతుంది.. ఇద్దరి ఆలోచనల్లో పాజిటివిటీ పెరుగుతుంది.
⚛ కొంతమంది దంపతులు ఒకే విషయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఒకరి ఆలోచనల్ని మరొకరు గౌరవించి ఊరుకుంటే సమస్య ఉండదు. కానీ నాదే కరక్ట్ అంటే నాదే కరక్ట్ అనే భావన సరికాదు. దీనివల్ల అనవసర గొడవలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎవరో ఒకరు తగ్గి వ్యవహరించడం ఇద్దరికీ మేలు.
⚛ దంపతులిద్దరూ ఒకరి వ్యక్తిగత సమయాన్ని మరొకరు గౌరవించాలి. ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచడంతో పాటు.. ఒకరి పట్ల మరొకరు సానుకూల దృక్పథంతో ఉండేలా చేస్తుంది కూడా!
⚛ మన పొరపాటేదైనా ఉంటే భాగస్వామి మాట విని.. దాన్ని సరిదిద్దుకోవడంలో తప్పు లేదు. కాబట్టి అప్పుడప్పుడూ ఎదుటివారి మాటలకూ విలువివ్వడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి నెగెటివిటీ ఉన్నా దూరమవుతుంది.
⚛ మనలో పాజిటివ్ ఆలోచనలు ఉంటే.. అవతలి వారినీ అదే దృష్టితో చూడగలం. ఇలాంటి సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలంటే.. స్వీయ ప్రేమ ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మనసుకు నచ్చిన పనులు చేయడం, నచ్చినట్లుగా రడీ అవడం.. వంటివన్నీ ముఖ్యమే!
⚛ భాగస్వామి చేసిన పనుల్ని ప్రశంసించడం, అప్పుడప్పుడూ వాళ్లకు బహుమతులివ్వడం, వాళ్లిచ్చే కానుకల్ని స్వీకరించడం.. ఇవీ అనుబంధంలో పాజిటివిటీని పెంచేవే!
భాగస్వామిపై ఉండే నెగెటివ్ దృష్టి కోణాన్ని మార్చుకోవడానికి ఇన్ని చేసినా ఫలితం లేకపోతే.. నిపుణుల సలహా తీసుకోవడం, కౌన్సెలింగ్‌కి వెళ్లడం.. వంటివి మేలు చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.