టీనేజీలో విలువలు నేర్పుదామిలా..

పిల్లలకు 14 ఏళ్లు వచ్చేసరికి స్వతంత్ర భావాలు వస్తాయి. స్వేచ్ఛగా ఆలోచించాలనుకుంటారు. అలాగని వాళ్లను తమ ఇష్టానికి వదిలేస్తే భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉంది. ఈ వయసులో పిల్లలు తప్పుదారి పట్టడానికి ఆస్కారం ఎక్కువ. అందుకే టీనేజ్‌లో వాళ్లనో కంట కనిపెడుతూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు...

Published : 06 Feb 2023 00:21 IST

పిల్లలకు 14 ఏళ్లు వచ్చేసరికి స్వతంత్ర భావాలు వస్తాయి. స్వేచ్ఛగా ఆలోచించాలనుకుంటారు. అలాగని వాళ్లను తమ ఇష్టానికి వదిలేస్తే భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉంది. ఈ వయసులో పిల్లలు తప్పుదారి పట్టడానికి ఆస్కారం ఎక్కువ. అందుకే టీనేజ్‌లో వాళ్లనో కంట కనిపెడుతూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు...

స్మార్ట్‌ఫోన్‌లతో.. ఈ కాలంలో చదువుకోవాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా స్మార్ట్‌ఫోన్‌ చాలా అవసరం. కానీ దానితో ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అన్ని అనర్థాలూ ఉన్నాయి. అందువల్ల ఫోన్‌ ఏ ఉద్దేశంతో ఇచ్చాం, వాళ్లేం చేస్తున్నారన్నది గమనించాలి. పిల్లలు ఒంటరిగా కూర్చుని ఫోను చూస్తుంటే వారి మనోభావాలు, ప్రవర్తన ఎలా ఉందో కనిపెడుతుండాలి. ఈ వయసులో తాము ఎలాంటివారితో స్నేహం చేయాలో స్పష్టత ఉండదు. కనుక మంచి పిల్లలతోనే సన్నిహితంగా ఉండాలని, లేదంటే అవతలివారి అవలక్షణాలు అలవాటవుతాయని దగ్గర కూర్చోబెట్టుకుని లాలనగా వివరించాలి.

తేడాలొద్దు.. అమ్మాయిలైతే ఈ పని చెప్పాలి, ఇవి అబ్బాయిలకు చెప్పకూడదు అనే భావన రానీయొద్దు. ఇద్దరినీ సమానంగా చూడండి. అమ్మాయిలు బయటకి వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పరిస్థితులకు తగ్గట్టు ఎలా నడుచుకోవాలో చెప్పండి. అలాగే మగపిల్లలకు అమ్మాయిలతో గౌరవంగా ఎలా మెలగాలో నేర్పించండి. ఆడ, మగ తేడా చూపించకపోవడమే కాదు, ఇద్దరికీ విలువలు నేర్పించండి.

స్వేచ్ఛగా.. పిల్లలకు స్వేచ్ఛనిస్తూనే హద్దుల్లో పెట్టాలి. అడిగిన ప్రతిదీ కొనివ్వకూడదు. ముందు దాని అవసరం ఉందో లేదో వారితో చర్చించండి. స్నేహితులతో కలిసి ట్రిప్‌లు, పార్టీలకి వెళ్తామంటే వెంటనే సరే అనేయకండి. వారు ఎక్కడికి ప్లాన్‌ చేశారు, ఎవరెవరు వెళ్తున్నారు, వారి స్నేహితులతో మాట్లాడి చూడండి. అంతా సురక్షితమే అనిపించినప్పుడు మాత్రమే పంపించండి.

వారితో మాట్లాడండి..

మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో, ఎలా చదువుతున్నారో వారి క్లాస్‌టీచర్‌తో తరచూ మాట్లాడి తెలుసుకోండి. తోటి విద్యార్థులతో వారి ప్రవర్తన ఎలా ఉందనేది కనిపెట్టడం కూడా చాలా ముఖ్యం. అలాగే పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి. దిగులుగా ఉన్నప్పుడు వారికేమైనా సమస్యలు ఉన్నాయేమో అడగండి. ఖాళీ లేదు అనుకోకుండా వారికోసం తప్పకుండా సమయం కేటాయించండి. వారు చేసిన ఏ తప్పు గురించైనా వారితో వాదించకుండా నెమ్మదిగా మాట్లాడి పరిష్కరించండి. దండించడం వలన ఉపయోగమేమీ లేదని గుర్తుంచుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్