సోనమ్‌ ప్రెగ్నెన్సీ టిప్స్.. విన్నారా?

ఇంట్లో గర్భిణులెవరైనా ఉంటే.. వాళ్ల విషయంలో ఇటు కుటుంబ సభ్యులు, అటు స్నేహితులు పలు జాగ్రత్తలు తీసుకోవడం.. ఈ దశను వాళ్లు బాగా ఆస్వాదించడం.. వంటివి కామన్‌. ప్రస్తుతం తానూ ఇలాంటి అనుభూతినే పొందుతున్నానంటోంది త్వరలోనే తల్లి కాబోతోన్న బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌. సాధారణ సమయంలోనే తన జీవనశైలి.....

Updated : 13 Jul 2022 20:57 IST

(Photos: Instagram)

ఇంట్లో గర్భిణులెవరైనా ఉంటే.. వాళ్ల విషయంలో ఇటు కుటుంబ సభ్యులు, అటు స్నేహితులు పలు జాగ్రత్తలు తీసుకోవడం.. ఈ దశను వాళ్లు బాగా ఆస్వాదించడం.. వంటివి కామన్‌. ప్రస్తుతం తానూ ఇలాంటి అనుభూతినే పొందుతున్నానంటోంది త్వరలోనే తల్లి కాబోతోన్న బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌. సాధారణ సమయంలోనే తన జీవనశైలి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఈ చక్కనమ్మ.. మరో చిన్నారిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించే క్రమంలో తన ఆరోగ్యం విషయంలో మరెంతో శ్రద్ధ వహిస్తున్నానంటోంది. గర్భం ధరించిన తొలి నాళ్ల నుంచి తన అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకుంటోన్న ఈ సొగసరి.. ఇటీవలే మరో సందర్భంలో అమ్మతనంలోని మాధుర్యాన్ని, ఈ క్రమంలో తాను పాటిస్తోన్న చిట్కాల్ని అందరి ముందుంచింది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్త చెప్పారు సెలబ్రిటీ కపుల్‌ సోనమ్‌ కపూర్‌-ఆనంద్‌ అహుజా. ఇక అప్పట్నుంచి గర్భిణిగా తన అనుభవాలను, సెలబ్రేట్‌ చేసుకుంటోన్న అకేషన్స్‌ని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో- ఇటీవలే లండన్‌లో తన స్నేహితులు సీమంతం వేడుకను ఏర్పాటు చేయడం, ఆ ఫొటోలు వైరలవడం తెలిసిందే. ఇక మరోవైపు సోనమ్‌ తల్లిదండ్రులు, ఆమె ప్రాణ స్నేహితురాలు మసాబా గుప్తా కూడా వేర్వేరుగా సీమంతం జరపబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మసాబా బొహో థీమ్‌డ్‌ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఆ మూడు నెలలూ కీలకం!

ఇలా ఓవైపు గర్భిణిగా ఈ దశను ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఈ క్రమంలో తాను పాటిస్తోన్న చిట్కాల్ని, తీసుకుంటోన్న జాగ్రత్తల్ని ఇటీవలే ఓ సందర్భంలో ఇలా పంచుకుంది సోనమ్. ‘ప్రెగ్నెన్సీ మనకొక వరం. మన జీవితంలో అంతే కీలకమైన దశ కూడా! దీని గురించి ముందుగానే ఎవరూ ఊహించి చెప్పలేరు. ఎందుకంటే అనుభవపూర్వకంగానే ఈ తొమ్మిది నెలల ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతాం. నా విషయానికొస్తే.. గర్భం ధరించిన నాటి నుంచి రోజురోజుకీ నా శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదటి మూడు నెలలు వికారం, వాంతులతో విపరీతమైన అలసటగా అనిపించేది. ఆపై క్రమంగా నా నిద్ర సమయాల పైనా ప్రభావం పడడం ప్రారంభమైంది. ఒక్కోసారి అర్ధరాత్రి ఉన్నట్లుండి మెలకువ వచ్చేస్తుంటుంది. వెంటవెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంటుంది. ఈ మార్పులతో కాస్త కష్టంగానే ఉన్నా.. ఇవన్నీ మా బుజ్జాయి కోసమేనన్న ఆలోచన ఎంతో సంతోషంలో ముంచెత్తుతోంది. ఇక నన్ను నా భర్త, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దీంతో ఈ దశను మరింతగా ఎంజాయ్‌ చేస్తున్నా..’ అందీ సొగసరి.


ఈ ఆహారం.. ఆ వ్యాయామాలు!

ఇక ప్రస్తుతం తాను తీసుకుంటోన్న ఆహారం, చేస్తోన్న వ్యాయామాల గురించి కూడా పంచుకుందీ కాబోయే అమ్మ.

కొంతమంది గర్భిణిగా ఉన్న సమయంలో బరువు అదుపులో ఉంచుకోవడానికి తక్కువ క్యాలరీలున్న ఆహారం (క్రాష్‌ డైట్‌) తీసుకుంటుంటారు. ఈ సమయంలో ఇది మంచిది కాదు. ఎందుకంటే మనలో మరో జీవి ప్రాణం పోసుకుంటోందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఈ డైట్‌కి పూర్తి దూరంగా ఉంటున్నా.

అల్పాహారంగా దోసె, గ్లూటెన్‌-ఫ్రీ టోస్ట్‌, అవకాడో (పావు భాగం), సీజనల్‌ పండ్లు.. వంటివి తీసుకుంటున్నా. అవకాడోలో మంచి కొవ్వులుంటాయి. ఇవి మనకు, బిడ్డ ఆరోగ్యానికి మంచివి.

మధ్యాహ్నం భోజనంలోకి.. అరకప్పు అన్నం, చేపలు, కప్పు ఉడికించిన కాయగూర ముక్కలు తీసుకుంటున్నా.

రాత్రి ఏడు కల్లా భోజనం ముగించేస్తున్నా. ఈ క్రమంలో వెజిటబుల్‌ సూప్‌, అరకప్పు ఉడికించిన కాయగూరలు, అన్నం, బంగాళాదుంప ముక్కలు.. వంటివి తీసుకుంటున్నా.

బాదం పాలతో చేసిన కాఫీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నా.

అలాగే రోజంతా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడుతున్నా. ఇక నిపుణుల సలహా మేరకు ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని మితంగా తీసుకుంటున్నా.

యోగా, వెయిట్‌ ట్రైనింగ్‌ని నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగం చేసుకున్నా. ఇవి ఇటు ఆరోగ్యాన్ని, అటు ఫిట్‌నెస్‌ను అందిస్తున్నాయి.

అలాగే చర్మానికి సరిపడే సౌందర్య ఉత్పత్తుల్నే ఉపయోగిస్తున్నా. రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం, తేమనందించే మాయిశ్చరైజర్‌ రాసుకోవడం తప్పనిసరిగా పాటిస్తున్నా.

గర్భిణిగా ఉన్న సమయంలో మనకంటూ కాస్త సమయం కేటాయించుకోవడం, మనకు నచ్చిన వారితో సమయం గడపడం వల్ల.. ఈ దశలో ఎదురయ్యే పలు శారీరక, మానసిక సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇందుకు బేబీమూన్‌.. వంటివి చక్కటి ప్రత్యామ్నాయాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్