అతి ప్రేమ ఉంటే.. అలుసైపోతుంది జాగ్రత్త!

బంధాలు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగాలి. ఈ క్రమంలో చిన్న చిన్న తప్పులను క్షమించడం ఎంతో అవసరం. అది లేకుంటే నిరంతరం మనస్పర్థలతో జీవితం నరకమవుతుంది. కానీ ఈ మన్నించడం మరీ ఎక్కువైతే చివరికి మనకు మనం మిగలకుండా జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది....

Published : 18 May 2024 19:23 IST

బంధాలు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాగాలి. ఈ క్రమంలో చిన్న చిన్న తప్పులను క్షమించడం ఎంతో అవసరం. అది లేకుంటే నిరంతరం మనస్పర్థలతో జీవితం నరకమవుతుంది. కానీ ఈ మన్నించడం మరీ ఎక్కువైతే చివరికి మనకు మనం మిగలకుండా జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది. బంధాలు బాగుండాలంటే సర్దుకుపోవాలి... కానీ దానికీ ఓ హద్దుంది. కలకాలం కలిసున్న జంటలు చెప్పే జీవన సూత్రం ఇదే.

ఎల్లలు లేని ప్రేమ చూపిస్తున్నారా..?
ఎవరి మీదైనా చెప్పలేనంత ప్రేమ ఉండడం మంచిదే. ఏదీ ఆశించకుండా ప్రేమించడం గొప్ప విషయం కూడా. కానీ ఆ ప్రేమను అవతలి వారు అలుసుగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. కలకాలం కలిసుండాలంటే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి గౌరవం కూడా అవసరం. క్షమిస్తున్నామన్న భ్రమలో మిమ్మల్ని కించపరిచే సమయంలో కూడా మౌనంగా ఉండడం మంచిది కాదు. మీ సహనానికి హద్దులు ఉన్నాయని అవతలి వారితో నిస్సంకోచంగా చెప్పండి.

అందరికీ అదే మంత్రం వద్దు!
మానవత్వం తెలిసిన మనుషుల్లో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మన ప్రేమతో, క్షమతో వారిని మార్చవచ్చు. లోపాలు మనిషికి సహజం. కానీ మృగంలా ఆలోచించే వారిని, ప్రవర్తించే వారిని అతిగా క్షమించడం అస్సలు మంచిది కాదు. మీ పట్ల తరచూ అనుచితంగా ప్రవర్తించినా, మీపై శారీరకంగా దాడి చేసినా క్షమించే ఆలోచన చేయకండి. అటువంటి వారు మీ మంచితనం వల్ల మారకపోగా.. మీ ప్రేమను, మీ క్షమను అసమర్థతగా భావిస్తారు.

ముందే కళ్లు తెరవండి..
మీరు ప్రేమించే వారి ప్రాధాన్యాలు మారుతున్నప్పుడు గమనించండి. ఎప్పుడూ ఒకేలా ఉండడం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదే ప్రేమ, గౌరవం చూపడం అందరి వల్లా సాధ్యం కాదు. కానీ ముఖ్యమైన సందర్భాలలో కూడా మిమ్మల్ని తరచూ మర్చిపోతుంటే, నిర్లక్ష్యం చేస్తుంటే ఎప్పటిలా క్షమించేయడం మంచిది కాదు. వారి జీవితంలో మీ స్థానం గురించి ప్రశ్నించండి. మీరు అనుభవించే మానసిక సంఘర్షణను వారితో పంచుకోండి. ఇలాంటి సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది.

ఇవీ గమనించండి..
ఈ క్రమంలో- దంపతుల మధ్య సంబంధం గురించి వివిధ పరిశోధనలలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి.
* అనవసరమైన వాదనలు ఇష్టపడని వారు అవతలి వారు ఏం చేసినా చూసీ చూడనట్టు ప్రవర్తిస్తారు. కానీ లోలోపల ఆ అసంతృప్తి వారిని చాలా కుంగదీస్తుంది. దీనివల్ల భార్యాభర్తలిద్దరి మధ్య అగాథం ఏర్పడుతుంది. అటువంటి జంటలో ఏ ఒక్కరూ తమ వివాహ జీవితాన్ని ఆస్వాదించలేరు.
* కొందరు పెళ్త్లెన కొత్తలో తమ భాగస్వామిపై ఉన్న విపరీతమైన ప్రేమతో తాము అంగీకరించలేని విషయాలను కూడా క్షమించేస్తారు. అదే అలుసుగా తీసుకుని అవతలివారు తమ ప్రవర్తన కష్టం కలిగిస్తుందని తెలిసినా మారరు. సరికదా.. ఎప్పుడైనా వారి వల్ల కలిగే ఇబ్బందిని తెలియజేసినప్పుడు 'నువ్వు నన్ను ఇంతకు ముందులా ప్రేమించట్లే'దంటూ మానసిక దాడి చేస్తారు.
* అప్పుడప్పుడూ తప్పులు చేసే భాగస్వామిని క్షమించిన వారి దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగే అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. అటువంటి వారు తమ వైవాహిక జీవితంలో సంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే నిరంతరం ఒకరు తప్పులు చేయడం, మరొకరు దాన్ని క్షమించడం అలవాటైన జంటలు వైవాహిక జీవితంపై విరక్తితో పాటు, విపరీతమైన మనోవ్యథను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
* అప్పుడప్పుడు చిన్న చిన్న కలతలు ఏర్పడినప్పటికీ వెంటనే మళ్లీ కలిసిపోయే దంపతులు మిగతా అందరికన్నా అన్యోన్యంగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా సరే... అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని మర్చిపోకండి.!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్