అనూహ్య విజయాల కవలలు!

ఆ అక్కాచెల్లెళ్లు ఎక్కడికెళ్లినా అందరి చూపూ వాళ్లపైనే! కనీసం ఒక్కసారైనా ఆగి చూసే వాళ్లు. వాళ్లిద్దరూ కవలలు మరి! ఆ ప్రత్యేకతనే వ్యాపార మార్గంగా చేసుకుంటే అన్న ఆలోచన వచ్చింది వాళ్లకి. ఇదంతా అయ్యే పనేనా అన్న వాళ్ల ముందే అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు.

Published : 18 Jan 2023 00:45 IST

ఆ అక్కాచెల్లెళ్లు ఎక్కడికెళ్లినా అందరి చూపూ వాళ్లపైనే! కనీసం ఒక్కసారైనా ఆగి చూసే వాళ్లు. వాళ్లిద్దరూ కవలలు మరి! ఆ ప్రత్యేకతనే వ్యాపార మార్గంగా చేసుకుంటే అన్న ఆలోచన వచ్చింది వాళ్లకి. ఇదంతా అయ్యే పనేనా అన్న వాళ్ల ముందే అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు. డెబీ, లిసా వ్యాపార పయనమేంటో మీరూ చూసేయండి!

‘మీ ఇద్దరిలో ఎవరు డెబీ.. ఎవరు లిసా’ ఇలా ఎంతోమంది అడిగినా ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ డెబీ, లిసా గాంజ్‌ల్లో ఏదో వింత అనుభూతి. చదువు, ఆటలు, పాటలు, నృత్యం ఏదైనా కలిసే చేసేవారు. వీళ్లది అమెరికా. చిన్నతనం నుంచీ రెస్టారెంట్‌ పెట్టాలనే కల. వివిధ రెస్టారెంట్లలో పనిచేసి.. అనుభవం సంపాదించుకున్నాక సొంతంగా ప్రయత్నించాలనుకున్నారు. ‘ఎన్నో రెస్టారెంట్లు. మన ప్రత్యేకత ఏంట’న్న ప్రశ్న ఎదురైంది ఇద్దరికీ! ‘మనమే ప్రత్యేకం.. దాన్నే వ్యాపార సూత్రం చేసుకుందా’ మంది డెబీ. తమ రెస్టారెంట్‌లో పనిచేసే వాళ్లందర్నీ కవలలనే ఎంచుకుందామంది. విన్నవాళ్లంతా పిచ్చి ఆలోచనన్నారు. డబ్బు వృథా.. హాయిగా ఉద్యోగం చేసుకోమని సలహానిచ్చారు. కానీ ఇంట్లోవాళ్లు అండగా నిలవడంతో 1994లో న్యూయార్క్‌లో ‘ట్విన్‌ రెస్టారెంట్‌’ ప్రారంభించారు. 30కిపైగా కవలలు.. ప్రతి జంటకీ ఒకే తరహా దుస్తులు.. ఒకరికి ఆరోగ్యం బాగోకపోతే ఇద్దరూ సెలవు తీసుకోవాల్సిందే. ఒక్కరు పొరపాటు చేసినా ఇద్దరి ఉద్యోగాలకీ ముప్పే! కస్టమర్ల కోసమూ కొన్ని సదుపాయాలు తీసుకొచ్చారు. వీటన్నింటితో వినియోగదారులతోపాటు వార్తాసంస్థలనూ ఆకర్షించారు. దీంతో బాగా ప్రచారం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటకులు వాళ్ల దగ్గరికి వచ్చే వారు. కవలలు, ట్రిప్లెట్స్‌.. మొదలైన వాళ్లూ వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్ల అనుభవాలను పంచుకునేవారు.

ఎన్నో రంగాల్లోకీ..

ఊహించని లాభాలు. అయినా అయిదేళ్లకు రెస్టారెంట్‌ని మూసేశారు. ‘పనులన్నీ ముగించుకునే సరికి రోజూ రాత్రి 2 అయ్యేది.  మళ్లీ ఉదయాన్నే పని మొదలు. ఓసారి ఓ ఫ్యాషన్‌ సంస్థ తమ ప్రకటన కోసమని ఇద్దరు కవలలు కావాలంటే సాయం చేశాం. తర్వాతి నుంచి టీవీ, సినిమా వాళ్ల దగ్గర్నుంచి ఇలాంటి రిక్వెస్టులెన్నో! దీంతో క్యాస్టింగ్‌ డైరెక్టర్లుగా మారాం. కవలలు, ట్రిప్లెట్‌.. ఎవరు మా దగ్గరికొచ్చినా వాళ్ల వివరాలను పుస్తకంలో రాసి ఉంచుకొనేవాళ్లం. వాళ్ల ఫొటోలతో ఓ పుస్తకాన్నీ తీసుకొచ్చాం. లక్షల మంది వివరాలున్నాయి మా వద్ద. సినిమా, టీవీ, యాడ్స్‌ వాళ్లు సంప్రదించినప్పుడు కొంత మొత్తం తీసుకుని వివరాలిచ్చే వాళ్లం. శ్రమ లేకుండానే ఆదాయం. అందుకే ట్విన్స్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రారంభించాం’ అంటారీ ద్వయం.

రిసెర్చర్లు మందులు, కొన్ని రకాల వ్యాధుల పరిశోధనకు ట్విన్స్‌, మల్టిపుల్స్‌ కోసం వీళ్లనే సంప్రదిస్తున్నారు. టెక్నాలజీ, క్రిమినల్‌ కేసులే కాదు.. నాసాకీ సాయపడ్డారు. ఇద్దరూ సొంతంగా ప్రొడక్షన్‌ సంస్థల్నీ నిర్వహించుకునే స్థాయికి ఎదిగారు. ‘ఇరవైల్లో వ్యాపారంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు మా వయసు 50కిపైమాటే! ఒక్క క్లిక్‌తో సమాచారం పొందే వీలున్నా.. మా వద్దున్నంత వివరంగా దొరకదు. అలాంటి డేటాబేస్‌ రూపొందించుకొన్నాం. అలా విజేతలమయ్యా’మని గర్వంగా చెబుతారు డెబీ, లిసా. అభినందించాల్సిందే మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్