ఇలాంటి వ్యక్తిని వదులుకోకండి!

ప్రేమైనా, పెళ్లైనా.. నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే విడిపోవడం ఈ కాలపు జంటలకు కామనైపోయింది. అయితే ఇలా విడిపోయే క్రమంలో ఒకరి కోసం మరొకరు చేసిన త్యాగాలు, మంచి పనులు సైతం గుర్తుకు రావు.

Published : 21 Feb 2024 13:15 IST

ప్రేమైనా, పెళ్లైనా.. నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే విడిపోవడం ఈ కాలపు జంటలకు కామనైపోయింది. అయితే ఇలా విడిపోయే క్రమంలో ఒకరి కోసం మరొకరు చేసిన త్యాగాలు, మంచి పనులు సైతం గుర్తుకు రావు. నిజానికి ఇలా ఆఖరి మెట్టు దిగే ముందు ఒక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలావరకు విడాకులు/బ్రేకప్‌లు తగ్గుతాయంటున్నారు నిపుణులు. భాగస్వామిలోని ఈ సానుకూలతల్ని అంగీకరించి.. కుదిరితే వారు చేసిన పొరపాట్లను క్షమించగలిగితే బంధాన్ని నిలుపుకోవచ్చంటున్నారు.

అంతకన్నా కావాల్సిందేముంది?!

ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉన్నట్లే.. ప్రతి భార్య విజయంలో భర్తదీ కీలక పాత్రే! ఈ క్రమంలో ఇంటా, బయటా వారు అందించే ప్రోత్సాహమే పరోక్షంగా భార్య ఉన్నతికి కారణమవుతుంటుంది. అయితే అందరు భర్తలు ఇలాగే ఉండాలని లేదు. కొంతమంది భార్య మాటలకు, వారు తీసుకునే నిర్ణయాలకు తగిన గౌరవం ఇవ్వకపోవచ్చు. ఇంకొందరు కెరీర్‌ పరంగానూ వారిని నిరుత్సాహపరచచ్చు. ఈ నేపథ్యంలో- మిమ్మల్ని ప్రతి విషయంలో ప్రోత్సహించే వ్యక్తి మీకు తోడుగా ఉన్నంత వరకు ఇక మీకు తిరుగుండదని గుర్తుపెట్టుకోండి. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. ఇలాంటి భాగస్వామిని వదులుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

నువ్వు-నేను ఒకటే..!

‘భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయంలో సమానమే..!’ అంటే చాలామంది భర్తలు ఒప్పుకోరు. తనకంటే తన సహచరి ఓ మెట్టు కిందే ఉండాలని, ఉద్యోగం చేసినా సంపాదనలోనూ తానే ఓ మెట్టు పైనుండాలని అనుకునే వారూ లేకపోలేదు. ఇలాంటి దంపతుల్లో సఖ్యత లేక మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇదే వారి మధ్య గొడవలకు దారితీస్తుంది. ఒకవేళ భార్యలు సర్దుకుపోయినా చాలామంది భర్తలు వారిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. ఇదిలా ఉంటే.. ప్రతి విషయంలోనూ భార్య తనతో సమానమేనన్న ధోరణి కొంతమంది భర్తల్లో కనిపిస్తుంటుంది. అలాంటి వారు ఇంటా-బయటా తన సహచరికి అన్ని విషయాల్లో తోడ్పాటునందిస్తారు. ఈ పని మహిళలే చేయాలి.. ఇది పురుషులు చేయకూడదన్న నియమాలేవీ వారికి ఉండవు. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది మహిళలు.. తాము ఈ స్థాయికి చేరుకోవడానికి భాగస్వామి అందించిన ప్రోత్సాహం, సమానత్వం కూడా ఓ కారణం అని చెప్పడం చూస్తుంటాం. కాబట్టి మీవారు కూడా ఎలాంటి భేషజాల్లేకుండా ఇలాంటి సమానత్వం చూపిస్తే.. మీరు అదృష్టవంతులన్నట్లే!

నేనున్నాననీ.. నీకేం కాదనీ..!

పెళ్లిలో వధూవరులు ఒకరికొకరు ప్రమాణాలు చేసుకోవడం తెలిసిందే! సుఖదుఃఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటానని బాస చేసుకోవడం కూడా వీటిలో ఒకటి. కొత్త మోజులో కొన్నాళ్లు దీన్ని పాటించినా.. ఆ తర్వాత మాత్రం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసే వారూ లేకపోలేదు. ఈ క్రమంలో భాగస్వామి సంతోషాల్లో పాలుపంచుకొని.. తనకు కష్టం వచ్చినప్పుడు వదిలేసే భర్తలూ కొందరుంటారు. నిజానికి ఇలాంటి వాళ్లు తోడుగా ఉన్నా లేకపోయినా ఒక్కటే అనిపిస్తుంటుంది. ఈ లోటే అనుబంధాలను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీవారు ఇందుకు భిన్నం అని మీరు అనుకుంటే.. సంతోషాల్లో తోడున్నట్లే బాధల్లోనూ ఓదార్పునిస్తాడు.. తానున్నానన్న భరోసా కల్పిస్తాడని మీరు రియలైజ్‌ అయితే.. కచ్చితంగా ‘మీ ఆయన బంగారమే!’ అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి మంచి మనిషిని వదులుకోవద్దని చెబుతున్నారు.

మిమ్మల్ని మీరుగా..!

పెళ్లయ్యాక తమ భాగస్వామి తమకు నచ్చినట్లుగా మారాలని అనుకోవడం భార్యాభర్తలిద్దరిలోనూ సహజమే! అయితే అవి ఎలాంటి మార్పులనేవే ఇక్కడ ముఖ్యం. మీపై ఆంక్షలు పెడుతున్నారా? లేదంటే మీ మంచికే ఆ మార్పు కోరుకుంటున్నారా? అనేది ఆలోచించుకోవాలి. ఉదాహరణకు.. మీవారు మీ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. మీకు అలవాటు లేని వ్యాయామాన్ని రొటీన్‌గా మార్చాలనుకుంటే.. అది మంచి విషయమే అని చెప్పాలి. అలాగే ఆర్థికంగా-వ్యక్తిగతంగా-వృత్తిపరంగా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరిగ్గా లేకపోతే.. సరిచేయడం కూడా మంచిదే! ఇలా మీకు తెలిసో, తెలియకో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తపడుతున్నారంటే.. మీ భర్తకు మీరంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి భాగస్వామి చెంతనున్నంత వరకు ఏ విషయంలోనైనా మీరు తప్పటడుగు వేసే ప్రసక్తే ఉండదని గుర్తుపెట్టుకోండి.

ఇలా భార్యలే కాదు.. భర్తలూ తమ ఇష్టసఖి మంచి మనసును అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ ప్రోత్సాహం అందించడం, తమతో పాటు ఇంటి బాధ్యతల్ని-వృత్తి బాధ్యతల్ని సమానంగా పంచుకోవడం, మీకంటూ కొన్ని విషయాల్లో ప్రైవసీ కల్పించడం, మిమ్మల్ని అమితంగా ప్రేమించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవారిలో సానుకూలాంశాలు చాలానే ఉంటాయి. కాబట్టి భర్తలూ ఇలాంటి భాగస్వామిని విడిచిపెట్టకుండా.. ఒకరికొకరు తమ జీవితాలను బ్యాలన్స్‌ చేసుకోగలిగితే.. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆ సంసార నావ సాఫీగా ముందుకు సాగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్