Prachi Nigam: స్టేట్‌ ఫస్ట్‌.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!

కంటికి ఇంపుగా కనిపించేదే అందమనుకుంటారు చాలామంది.. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత గొప్ప మనసున్నా.. వాటిని పక్కన పెట్టి ‘నీలో ఈ లోపముంది.. ఆ లోపముంది’ అంటూ ఎదుటివారిని విమర్శిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ అమ్మాయి ప్రాచీ నిగమ్‌ ప్రస్తుతం ఇలాంటి విమర్శల్నే ఎదుర్కొంటోంది.

Updated : 23 Apr 2024 19:13 IST

(Photo: Twitter)

కంటికి ఇంపుగా కనిపించేదే అందమనుకుంటారు చాలామంది.. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత గొప్ప మనసున్నా.. వాటిని పక్కన పెట్టి ‘నీలో ఈ లోపముంది.. ఆ లోపముంది’ అంటూ ఎదుటివారిని విమర్శిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ అమ్మాయి ప్రాచీ నిగమ్‌ ప్రస్తుతం ఇలాంటి విమర్శల్నే ఎదుర్కొంటోంది. ఇటీవలే విడుదలైన ఆ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిన ఆమె ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ప్రతిభను ప్రశంసించడానికి బదులు కొందరు ఆమె అందంగా లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బాడీ షేమింగ్‌ వ్యవహారం.. అమ్మాయిలకు ఈ సమాజం నిర్దేశించిన బ్యూటీ ప్రమాణాల్ని మరోసారి కళ్లకు కడుతోంది.

మనం ఎలా ఉండాలో, ఎంత బరువుండాలో, ఎంత ఫెయిర్‌గా ఉండాలో ఈ సమాజమే నిర్ణయిస్తుంది.. ఒకవేళ ఆ ప్రమాణాలకు తగినట్లుగా లేకపోతే విమర్శల పేరిట హింసిస్తుంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాచీ ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొంటోంది. ఇటీవలే విడుదలైన ఆ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఆమె ఫొటో పేపర్లో ప్రచురితమైంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

ప్రశంసలకు బదులు విమర్శలు!

చిన్న వయసు నుంచే చదువులో రాణించే ప్రాచీ.. పదో తరగతి పరీక్షల్లోనూ సత్తా చాటింది. 600లకు గాను 591 మార్కులు సాధించి.. 98.5 శాతంతో టాపర్‌గా నిలిచింది. దీంతో ఆ రాష్ట్ర టెన్త్‌ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అభినందనలు తెలిపారు. ఇలా తన ప్రతిభకు దక్కిన ప్రతిఫలంతో సంతోషంలో మునిగిపోయిన ప్రాచీ భవిష్యత్తులో ఇంజినీర్‌ కావాలని కోరుకుంటోంది. అయితే ఇదే సమయంలో ట్రోలింగ్‌కీ గురైందామె. ఇందుకు కారణం.. ఆమె ముఖంపై అవాంఛిత రోమాలుండడమే! ఈ క్రమంలోనే చాలామంది ఆమె ప్రతిభను ప్రశంసించడానికి బదులు ఆమె అందాన్ని విమర్శిస్తున్నారు. ‘చదువే లోకం కాదు.. అందానికీ కాస్త సమయం కేటాయించుకోవాల’ని; ‘అమ్మాయిలా కాదు.. అబ్బాయిలా ఉంద’ని, ‘వ్యాక్సింగ్‌ చేయించుకోమ’ని.. ఇలా ఎవరి నోటికొచ్చిన మాటల్ని వారు కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేశారు. ఇలా ఈ అమ్మాయి బాడీ షేమింగ్‌ తెర మీదకు రావడంతో.. తాను సాధించిన మార్కులు, పరీక్షల్లో తాను చూపిన ప్రతిభ అన్నీ కనుమరుగైపోయాయి.

అది ఆమె తప్పు కాదు!

అయితే ప్రాచీ ప్రతిభను ప్రశంసించడం పక్కన పెట్టి.. ఆమె అందాన్ని విమర్శించడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఆమెను విమర్శించిన వారిని తప్పుపడుతూ ఎదురు కౌంటర్‌ వేశారు కొందరు.

‘తన ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల కారణంగా ప్రాచీని కొందరు విమర్శిస్తున్నారు. నిజానికి ఇది ఆమె తప్పు కాదు.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్‌.. వంటివి ఈ సమస్యకు మూల కారణాలు. వీటి వల్లే ముఖంపై అవాంఛిత రోమాలు, బరువు పెరగడం, నెలసరి సమస్యలు, జుట్టు బాగా రాలిపోవడం.. వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. వీటి చికిత్స ఖర్చుతో కూడుకున్నది. అది భరించే శక్తి ఆమె తల్లిదండ్రులకు ఉండచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ప్రాచీని విమర్శించడం మాని.. ఆమె ప్రతిభను ప్రోత్సహించండి..’ అంటూ ఒకరు రాసుకొచ్చారు.

‘అసలు మనం ఎవరిని విమర్శిస్తున్నాం.. ఎందుకు విమర్శిస్తున్నాం అనే కనీస ఆలోచన కూడా ఉండదు కొందరికి. తనపై వచ్చిన ఈ విమర్శల్ని చూస్తే ప్రాచీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి ఆమె ఈ కామెంట్లను చదవకూడదని నేను కోరుకుంటున్నా..’ అంటూ మరొకరు స్పందించారు. ఇంకొందరు ఇలాంటి సమస్యలతో తమకెదురైన బాడీ షేమింగ్‌ అనుభవాల్ని పంచుకుంటున్నారు.


ఎంత చెప్పినా మారరా?

ఇలా ప్రాచీనే కాదు.. ఎంతోమంది అమ్మాయిలు తమ ఫేషియల్‌ హెయిర్‌ విషయంలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నారు.  వారిలో కేరళలోని కన్నూరుకు చెందిన శైజ ఒకరు. చిన్న వయసు నుంచే పైపెదవిపై అవాంఛిత రోమాలతో బాధపడుతోన్న ఆమె.. యుక్త వయసులోకొచ్చాక అవి మరింత పెరిగి మీసంలా కనిపించేవి. దీంతో చుట్టూ ఉన్న వారి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఆమె.. వాటిని పట్టించుకోకుండా తనను తాను ప్రేమించుకునేది. ఈ స్వీయ ప్రేమే క్రమంగా ఆమెను సోషల్‌ మీడియా సెలబ్రిటీని చేసింది. ఎలా ఉన్నా మన శరీరాన్ని మనం అంగీకరించాలంటూ ఆత్మవిశ్వాసంతో చాటి చెప్పిన శైజ.. ప్రస్తుతం ‘మీసక్కరి’ పేరుతో దేశవ్యాప్తంగా పాపులర్‌గా మారింది.

తనే కాదు.. పంజాబీ సింగర్‌ హర్నామ్‌ కౌర్‌కు కూడా యుక్త వయసులోనే గడ్డం, మీసాలు వచ్చాయి. అయినా వాటినే తన ప్రత్యేకతగా భావించిన ఆమె.. తనను తాను అంగీకరిస్తూ ముందుకు సాగడం ప్రారంభించింది. ఈ పాజిటివిటీనే ఆమెను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చేసింది. ఆరంగుళాల పొడవైన గడ్డంతో గతంలో గిన్నిస్‌ బుక్‌లోకీ ఎక్కిందామె. ప్రస్తుతం బాడీ షేమింగ్‌ని ఎదుర్కొంటోన్న మహిళల కోసం స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తోంది హర్నామ్.

నిజానికి శైజ, హర్నామ్‌.. లాంటి మహిళలు స్వీయ ప్రేమతో మహిళలందరిలో స్ఫూర్తి నింపడంతో పాటు.. ఎదుటివారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదంటూ చాటి చెబుతున్నారు. అయినా వీళ్ల మాటలు పెడచెవిన పెట్టి.. కొంతమంది ప్రాచీలాంటి అమ్మాయిల్ని అవహేళనకు గురిచేయడం శోచనీయం! పైశాచికత్వం! వీళ్ల మనసులు మారాలంటే ఇంకెంత మంది శైజలు, హర్నామ్‌లు పుట్టుకురావాలో మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్