Published : 28/03/2023 00:16 IST

గెలిచి.. గెలిపిస్తోంది

గ్రామీణ మహిళా సాధికారత కోసం పుట్టగొడుగుల పెంపకాన్ని నేర్చుకొన్నారామె. దీన్నే కెరియర్‌గా చేసుకొని విజయాలెన్నో సాధించారు. వేల మంది మహిళలకు పాఠంగా బోధిస్తున్నారు. ఈ ప్రయత్నాలే ఆమెను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశాయి. నారీ శక్తి £పురస్కారంతోపాటు పలు అవార్డులను అందించాయి. దివ్యా రావత్‌.. ఆవిడ స్ఫూర్తి కథనమిది.

సైనికదళంలో తండ్రి ఉద్యోగి కావడంతో దివ్య కుటుంబం దేశమంతా తిరిగేది. తానెక్కడున్నా.. సొంత గ్రామమహిళల గురించే దివ్య ఎక్కువగా ఆలోచించేవారు. సామాజికసేవ చేయాలని సోషల్‌వర్క్‌లో డిగ్రీ చేశారు. ఈమెది ఉత్తరాఖండ్‌లోని కందారా గ్రామం. దిల్లీలో ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే గ్రామీణ మహిళలకు ఆర్థికస్వాతంత్య్రాన్ని కల్పించడానికి రాజీనామా చేసి సొంతూరుకు వచ్చారీమె. స్థానిక మహిళలందరి ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారంగా ఆదాయ మార్గాన్ని చూపించాలనుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఉద్యానవన విభాగంలో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ పొందారు. థాయ్‌లాండ్‌, మలేసియా, వియత్నాం, బెల్జియం, నెదర్లాండ్‌ పర్యటించి కొంగొత్త విధానాలు, కొత్తరకాల పెంపకంపై అవగాహన తెచ్చుకున్నారు. ఆ తర్వాత గ్రామ మహిళలకు శిక్షణనిద్దామనుకుంటే ఆమెపై ఎవరూ విశ్వాసం చూపించలేదు.    

మొదట ..

పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఆదాయాన్నెలా అందుకోవచ్చో అందరికీ ప్రయోగాత్మకంగా చెప్పాలనుకున్నా అంటారు దివ్య. ‘ఇంట్లో ఓ గదిలో పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించా. మొదట 100 బ్యాగుల్లో పెంచి అందరినీ ఆశ్చర్యపరిచా. పండించే ప్రతి రకాన్ని చూపించేదాన్ని. 2013లో ‘సౌమ్య ఫుడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ ప్రారంభించి పుట్టగొడుగులను అమ్మేదాన్ని. క్రమేపీ పంటతోపాటు లాభాలూ పెరిగాయి. ఉత్తరాఖండ్‌ సహా హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణ, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లకు రవాణా చేసేదాన్ని. దీంతో ఇందులోని లాభాలు చూసి నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. అది మొదలు  దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు దీనిద్వారా ఉపాధి పొందేలా చేయగలిగా. పెంపకంతో పాటు ఎరువుల తయారీ, మార్కెటింగ్‌ మెలకువలూ నేర్పిస్తున్నా. ఇప్పుడు నేను కూడా దేశవిదేశాలకు పుట్టగొడుగులను ఎగుమతి చేస్తూ, కోటి రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నా’ని చెబుతారు దివ్య.

పురస్కారాలు..

గ్రామీణ మహిళలకు చేయూతనందిస్తున్న దివ్య కృషికి గానూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో వరించాయి. 2017లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ఉత్తరాఖండ్‌ ఉద్యానవన విభాగం ‘ఉద్యాన్‌ పండిట్‌ పురస్కార్‌’తో గౌరవించింది. ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తరాఖండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌నీ చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి