Katya Saini: చీరకట్టులో కైట్‌బోర్డింగ్ చేసి..!
కైట్‌బోర్డింగే సాహసమనుకుంటే.. చీరకట్టులో అలవోకగా చేసేసిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఇంత సాహసం ఆమెకెలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి..
(Photos: Instagram)
చీర కట్టుకొని ఇంటి పనులు చేసుకోవడమే కష్టమనుకుంటే.. ఏకంగా సాహసాలే చేసేస్తున్నారు కొంతమంది మహిళలు. చీరకట్టులో స్కీయింగ్, స్కై డైవింగ్, హూలాహూప్ విన్యాసాలు.. వంటివెన్నో ఇప్పటికే మనం చూశాం. అయితే చీర కట్టుకొని భూమిపై, ఆకాశంలోనే కాదు.. నీటి పైనా విన్యాసాలు చేయచ్చని నిరూపించింది బెంగళూరు సర్ఫర్ కత్యా సైనీ. పసుపు రంగు చీర ధరించి.. ఆమె నీటిపై కైట్‌బోర్డింగ్ విన్యాసాలు చేసిన వీడియో ఇటీవలే వైరలైంది. సోషల్ మీడియాలో లక్షల కొద్దీ వ్యూస్‌ను సంపాదించి పెట్టిన ఈ వీడియోలో ఆమె చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘కైట్‌బోర్డింగే సాహసమనుకుంటే.. చీరకట్టులో అలవోకగా చేసేసిందం’టూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఇంత సాహసం ఆమెకెలా సాధ్యమైందో తెలుసుకుందాం రండి..
కైట్‌బోర్డింగ్ ఓ నీటి క్రీడ. ఇందులో భాగంగా గాల్లో ఎగిరే ప్యారాచూట్‌ను పోలి ఉన్న పెద్ద గాలిపటాన్ని పట్టుకొని.. నీటిపై సర్ఫింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. గాలి వేగానికి పరుగులు తీసే గాలిపటంతో మన వేగాన్ని సమన్వయం చేసుకుంటూ నీటికి ఎదురీదాల్సి ఉంటుంది. ఇలాంటి సాహసోపేతమైన క్రీడను.. సంబంధిత స్పోర్టింగ్ సూట్‌లో ప్రదర్శించడమే కష్టమనుకుంటే.. చీరకట్టులో ప్రదర్శించి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది కత్యా.
ఆమె విన్యాసాలకు ఫిదా!
పసుపు రంగు చీర ధరించి.. తమిళనాడులోని ట్యుటికోరన్ సముద్ర తీరంలో ఇటీవలే కైట్‌బోర్డింగ్ విన్యాసాలు చేసింది కత్యా. సేఫ్టీ గేర్ ధరించి నీటిపై అలల మాదిరిగా అలవోకగా దూసుకుపోతున్న ఆమె కైట్‌బోర్డింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఇటీవలే ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకోగా అది కాస్తా వైరలైంది. లక్షల కొద్దీ వ్యూస్‌ను సంపాదించింది. చాలామంది నెటిజన్లు ఆమె నైపుణ్యాల్ని, ధైర్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ‘మీ ప్రతిభ అద్భుతం’ అంటూ కొనియాడారు.
ఆంత్రప్రెన్యూర్‌గా.. ఇన్‌స్ట్రక్టర్‌గా..!
బెంగళూరుకు చెందిన కత్య ‘వన్యప్రాణి జీవశాస్త్రం-పరిరక్షణ’ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆమెకు చిన్నతనం నుంచి నీటి క్రీడలంటే చాలా ఇష్టం. ఈ మక్కువతోనే స్కూబా డైవింగ్, కైట్‌బోర్డింగ్.. వంటి పలు నీటి క్రీడల్లో పట్టు సాధించిందామె. ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (PADI) నుంచి స్కూబా డైవింగ్, ఇంటర్నేషనల్ కైట్ బోర్డింగ్ ఆర్గనైజేషన్ (IKO) నుంచి కైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా సర్టిఫికేషన్లూ సొంతం చేసుకుంది కత్య. జల క్రీడల్లో ఔత్సాహికుల్ని ప్రోత్సహించడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి తన భర్త శ్యామ్‌తో కలిసి.. ‘ఓషన్ నొమాడ్స్’ పేరుతో ఓ డైవ్ ట్రావెల్ సంస్థను ప్రారంభించిందామె. అంతేకాదు.. సముద్ర పరిరక్షణ, జల చరాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి, వాటిపై అధ్యయనం చేయాలనుకునే వారికీ ఈ సంస్థ ఆయా అవకాశాల్ని అందిస్తోంది. నీటి క్రీడలపై శిక్షణ ఇవ్వడమే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో జరిగిన పలు కైట్‌బోర్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది కత్య. స్వతహాగా సముద్ర జీవశాస్త్రం, వన్యప్రాణుల పరిరక్షణ, పచ్చదనంపై ఆసక్తిని కనబరిచే ఆమె.. వాటికి సంబంధించిన అందమైన ఫొటోల్నీ ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘ఇవే తన ఒత్తిడిని దూరం చేస్తాయి..’ అని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.