అనుబంధానికి ‘మాట’ సాయం!

సంసారమన్నాక సవాలక్ష సమస్యలొస్తాయి. ఇద్దరి మధ్య గొడవలు కావచ్చు.. ఆరోగ్య సమస్యలు కావచ్చు.. ఒక్కోసారి ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు.. ఇలా కారణమేదైనా భార్యాభర్తల మధ్య కాస్త ఎడం ఏర్పడడం సహజమే!

Published : 02 Dec 2023 12:51 IST

సంసారమన్నాక సవాలక్ష సమస్యలొస్తాయి. ఇద్దరి మధ్య గొడవలు కావచ్చు.. ఆరోగ్య సమస్యలు కావచ్చు.. ఒక్కోసారి ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు.. ఇలా కారణమేదైనా భార్యాభర్తల మధ్య కాస్త ఎడం ఏర్పడడం సహజమే! అయితే ఈ దూరాన్ని చెరిపేయాలంటే మనసు విప్పి మాట్లాడుకోవడం (కమ్యూనికేషన్‌) ఒక్కటే మార్గం అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. నిజానికి ఇది లోపించే ఈ రోజుల్లో చాలా జంటలు నిండు నూరేళ్ల పవిత్ర బంధానికి మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని చెబుతున్నారు. మరి, అసలు దాంపత్య బంధంలో కమ్యూనికేషన్‌ లోపం ఎందుకొస్తుంది? దాన్ని అధిగమించే మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

అందుకేనా ఈ ‘మూగ’నోము!

దంపతుల మధ్య కమ్యూనికేషన్‌ లోపం తలెత్తడానికి వాళ్ల రోజువారీ పనులే కారణమవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా..

⚛ భార్యాభర్తలు పారదర్శకంగా, ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉన్నప్పుడే ఆ అనుబంధంలో కలతలకు తావుండదు. కానీ ఈ కాలపు జంటల్లో ఇవే కొరవడుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. ఈ దాపరికాలే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి మనసు విప్పి మాట్లాడుకోకుండా చేస్తున్నాయట!

⚛ ఈ రోజుల్లో ఆలుమగలిద్దరూ వృత్తి ఉద్యోగాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీనికి తోడు ఇటు ఇంటి పనులు, ఇతర బాధ్యతలతో వారికి కలిసి కాసేపైనా సమయం గడిపే వీల్లేకుండా పోతుంది. ఇలాంటి బిజీ లైఫ్‌స్టైలే దంపతుల మధ్య కమ్యూనికేషన్‌ లోపాన్ని సృష్టిస్తుందంటున్నారు నిపుణులు.

⚛ కొంతమంది భాగస్వామి ఏ పనిచేసినా అందులో తప్పులు వెతుకుతుంటారు. అలా విమర్శించడంలోనే ఆనందం ఉందనుకుంటారు. ఇలాంటి ప్రవర్తనే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ లోపానికి దారితీస్తుంది. ఇదే క్రమంగా దాంపత్య బంధం బీటలు వారేలా చేస్తుంది.

⚛ వైవాహిక బంధంలో కమ్యూనికేషన్‌ లోపం తలెత్తడానికి వారికుండే అనారోగ్యాలు కూడా కొంత వరకు కారణమే అంటున్నారు నిపుణులు. మనసు, చేసే పనులు.. ఇలా మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్య సమస్యను దూరం చేసుకోవడంపైనే లగ్నం చేస్తాం.. ఫలితంగా ఎదుటివ్యక్తితో మాట్లాడాలని గానీ, గడపాలని గానీ అనిపించదు. తద్వారా అనుబంధంలో దూరం పెరిగే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

⚛ కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు తెలియకుండానే మనల్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటాయి. ఉదాహరణకు.. ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోవడం, అసలు విషయం తెలుసుకోకుండా చెప్పుడు మాటలే సరైనవని నమ్మడం, అకస్మాత్తుగా ఏదైనా అనుకోని ప్రమాదం జరగడం.. ఇలా సందర్భమేదైనా మనలోని భావోద్వేగాల్ని భాగస్వామిపై ప్రదర్శించడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయి.. కమ్యూనికేషన్‌ లోపం తలెత్తుతుంది.

⚛ దాంపత్య బంధమంటేనే సర్దుకుపోవడం.. అయితే కొన్ని జంటలు ఈ విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటాయి. అంటే.. భాగస్వామికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక్కరే తీసేసుకోవడం.. వంటివి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు.

వినండి.. అర్థం చేసుకోండి!

కారణమేదైనా సరే- ఏ కమ్యూనికేషన్‌ లోపంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందో.. అదే కమ్యూనికేషన్‌తో ఆ దూరాన్ని దగ్గర చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు.

⚛ మనం చెప్పేది ఎదుటివారు పూర్తిగా వినాలని మనం ఎలాగైతే కోరుకుంటామో.. వాళ్లకూ అలాంటి ఫీలింగే ఉంటుంది. కాబట్టి వాళ్ల మనసులోని మాటల్ని పూర్తిగా విని అర్థం చేసుకునే అలవాటు చేసుకోవాలి. ఈ ఓపికే ఇద్దరి మధ్య ఉండే అరమరికల్ని తొలగిస్తుంది. కమ్యూనికేషన్‌ని పెంచుతుంది. తద్వారా అనుబంధం బలపడుతుంది.

⚛ దంపతుల మధ్య కమ్యూనికేషన్‌ లోపం ఏర్పడడానికి ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోవడం కూడా కారణమే! కాబట్టి ముందుగా కోల్పోయిన ఈ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మనసు విప్పి మాట్లాడుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు, అపార్థాలను నిజాయతీగా విశ్లేషించుకుని తప్పొప్పుల్ని అంగీకరిస్తే సరి!

⚛ ఇప్పుడున్న టెక్‌ ప్రపంచం కూడా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ లోపానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే పని పేరుతో అనవసరంగా గంటల తరబడి ఈ-గ్యాడ్జెట్స్‌కి ప్రాధాన్యమివ్వకుండా.. కాసేపు ఇద్దరూ కలిసి సమయం గడపగలిగితే.. పెరిగిన దూరాన్ని కరిగించుకోవచ్చు.

⚛ దంపతులన్నాక ఒకరి అభిరుచులు, ఇష్టాయిష్టాలపై మరొకరికి పూర్తి అవగాహన ఉంటుంది. పెరిగిన దూరాన్ని దగ్గర చేసుకోవడంలో ఇవే కీలకం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భాగస్వామికి నచ్చిన పనులు చేయడం, వారు మెచ్చేలా మాట్లాడడం.. ఇరువైపుల నుంచి ఇలాంటి ప్రయత్నముంటే కమ్యూనికేషన్‌ లోపాన్ని ఇట్టే అధిగమించచ్చంటున్నారు.

⚛ కమ్యూనికేషన్‌ లోపంతో దూరమైన బంధాన్ని తిరిగి దగ్గర చేయాలంటే.. రొమాన్స్‌ కూడా కీలకమే! ఈ క్రమంలో- నేరుగా మాట్లాడకపోయినా సరే- ఎదుటివారిని ఆకర్షించేలా రొమాంటిక్‌గా సందేశాలూ పంపుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్